వాయిస్ ఆఫ్ యూత్!
వయసుకు తగ్గట్టుగా వచ్చే హార్మోన్లు మనిషికి సహజసిద్ధంగా చాలా విషయాలను నేర్పిస్తాయి. అలాగే సంఘంలో బతుకుతున్నందుకు చదువు, ఉద్యోగం, శ్రమలకు సులువుగా అలవాటు పడిపోతాడు.. మరి ఇదే సంఘంలో బతుకీడుస్తూ కొంచెం వైవిధ్యంగా చదివే వాళ్లు, కొంచెం వైవిధ్యమైన ఉపాధిని చూసుకొనే వాళ్లు, కొంచెం వైవిధ్యంగా శ్రమ పడే వాళ్లు... ప్రత్యేకమైన వ్యక్తులు అవుతారు. గొప్ప గుర్తింపును తెచ్చుకొంటారు. అవకాశం కలిసొస్తే అంతర్జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకొంటారు.
ఈ తరహాలో కొంచెం సృజన, మరికొంచెం బాధ్యత, కొంచెం ఆసక్తి మరికొంచెం అవసరంతో కొంతమంది మంచి ప్రయత్నాలు చేశారు. సమకాలీన సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వారుగా, ప్రభావితం చేసే వ్యక్తులుగా పేరు తెచ్చుకొన్నారు. అలాంటి వారిలో కొందరు. వీళ్లంతా యువ డాక్యుమెంటరీ మేకర్లు. తమ చుట్టూ ఉన్న సమాజంలోని సమస్యలపై అధ్యయనం చేసి తమదైన శైలిలో దాన్ని సంస్కరించడానికి ప్రయత్నించిన వాళ్లు.
పేరు: శ్రుతీ రాయ్, ఇండియా
డాక్యుమెంటరీ పేరు: మైనా, ది లిటిల్ బ్రైడ్
బాల్య వివాహం. చాపకింద నీరులా ఇప్పటికీ మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. వ్యవస్థలో భాగమై అనేక మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ దుష్పరిణామాలకు కారణం అవుతున్న సమస్య ఇది. దేశంలోని ఒక మహానగరంలో చదువుతున్న యువతి శ్రుతీరాయ్. అక్కడే ఒక కార్పొరేట్ విద్యాలయంలో చదువుతున్న శ్రుతి ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా గ్రామానికి వెళితే అక్కడ చిన్న వయసు పిల్లలకే వివాహాలు అవుతున్నాయనే విషయం అర్థమైందట.
ఈ విషయం గురించి పూర్తి వివరాల గురించి గూగుల్‌ను ఆశ్రయిస్తే ఎన్నో కఠోరమైన నిజాలు తెలిశాయి. వాటి గురించి తెలుసుకొన్న శ్రుతి ఆవేదనకు ప్రతిరూపమే ‘మైనా, ది లిటిల్ బ్రైడ్’. అప్పటికే మూవీ మేకింగ్ మీద అవగాహన కలిగిఉన్న ఈ టీనేజర్ యానిమేషన్ డాక్యుమెంటరీని రూపొందించింది. ‘సమాజంలో మార్పు తీసుకురావడానికి, ఏదో ఒక వైవిధ్యమైన ప్రయత్నం చేయాలనే ఆలోచనే ఈ డాక్యుమెంటరీకి మూలం. దీనికి మంచి గుర్తింపు రావడం ఆనందమే. అయితే నా డాక్యుమెంటరీ కొంతమందిపై ప్రభావం చూపి, కొంతమంది అమ్మాయిల జీవితాలు బాగు పడటానికి కారణం అయినా ఆనందమే..’’ అని అంటోంది శ్రుతి.
పేరు: బిజిమనా ఫ్రాంకోయిస్, కెన్యా
డాక్యుమెంటరీ పేరు: క్రై ఆఫ్ ది రెఫ్యుజీస్
ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది శరణార్థి శిబిరంలో ఉన్న మనిషే. ఇటు తమిళ ఈలం దగ్గర నుంచి అటు ఆఫ్రికన్ అంతర్యుద్ధాల బాధితుల వరకూ ఎవరి పరిస్థితిని చూసినా అర్థమవుతుంది ఈ విషయం. కష్టమో నష్టమో సొంత ఊరిలో ఉండి, సొంత వాళ్ల మధ్యనే ఉండి దాన్ని ఎదుర్కొంటునప్పుడు ఉండే స్థైర్యం వేరు, స్థానిక పరిస్థితుల ప్రభావంతోనో, యుద్ధ వాతావరణంలోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో.. కష్టాలను ఎదుర్కోవడం వేరు. అలాంటి కష్టాల ప్రతిరూపమే ‘క్రై ఆఫ్ ది రెఫ్యూజీస్’.
బిజిమనా ఫ్రాంకోయిస్ అనే ఈ కెన్యన్ యువకుడు తీశాడు ఈ డాక్యుమెంటరీని. వాలంటీర్‌గా కెన్యాలోని ఒక శరణార్థ శిబిరాన్ని సందర్శించినప్పుడు ఫ్రాంకోయిస్ కళ్లలోని తడికి ఆవిష్కారం ఈ సినిమా. సృజనాత్మకత ఉన్న యువతీయువకులు సమాజాన్ని ఎంతగానైనా ప్రభావితం చేయగలరనేది తన నమ్మకం అని, అందుకే తను ఈ ప్రయత్నం చేశానని, మరిన్ని ఇలాంటి ప్రయత్నాలు చేస్తానని ఫ్రాంకోయిస్ అంటాడు.
పేరు: ఎరిని-రెనీ గట్సీ, గ్రీస్
డాక్యుమెంటరీ పేరు: డ్రాప్ ఇట్
ఈమె పేరు పలకడానికి మనకు కొంచెం కష్టం కానీ, ఆమె భావాన్ని మాత్రం డాక్యుమెంటరీని చూస్తే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోతోంది, వలసలు ఎక్కువవుతున్నాయి. దీంతో కొన్ని దేశాలకే పరిమితం అయిన భిన్నత్వంలో ఏకత్వం అంతటా ఆవిష్కృతం అవుతుందనే భ్రమల్లో ఉన్నాం కానీ, తమదేశంలోనే జాతుల మధ్య అంతరాలున్నాయని, రేసిజం పుష్కలంగా ఉందని అంటుంది గ్రీస్‌కు చెందిన ఈ టీనేజర్.
మనుషులు అలాంటి జాడ్యాలను వదులుకోవాలని, మనసుంటే అది చాలా సులభమైన విషయం అనే సందేశాన్ని ఇస్తూ ‘డ్రాప్ ఇట్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది రెనీ. భవిష్యత్తులో మానవహక్కులు, మహిళల హక్కులపై అవగాహనను పెంపొందించే పనిలో ఉంటానని, అందులో భాగంగా ఇండియాను ఒకసారి సందర్శించాలనేది తన ప్రణాళిక అని రెనీ వివరించింది.