రెక్కలు తెగుతున్న హక్కులు | human rights in women rights | Sakshi
Sakshi News home page

రెక్కలు తెగుతున్న హక్కులు

Published Wed, Dec 10 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

రెక్కలు తెగుతున్న హక్కులు

రెక్కలు తెగుతున్న హక్కులు

మహిళల హక్కులే మానవ హక్కులు- అని నినదించింది బీజింగ్ సదస్సు. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న హింసను ప్రతిఘటిద్దాం - అంటోంది ఐక్యరాజ్యసమితి. అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం మహిళల హక్కు - అని ఘోషిస్తున్నాయి అంతర్జాతీయ సదస్సులు. పితృస్వామ్య కుటుంబాలను కూల్చండి, ప్రజాస్వామ్య కుటుంబాలను నిర్మించండి- అని డిక్లరేషన్ ఇచ్చింది సెడా (కన్వెన్షన్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెనెస్ట్ ఉమెన్). ఈ అన్ని డిక్లరేషన్‌లలోనూ సంతకం చేసింది భారతదేశం. అయితే వాస్తవంలో ఏం జరుగుతోంది? వాటిని గుర్తు పెట్టుకుని నడుచుకుంటోందా? ‘మానవ హక్కుల దినోత్సవం’ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య మాటల్లో సింహావలోకనం చేసుకుందాం.
 
మొన్న ఈ మధ్య వరంగల్‌లో పెళ్లి నిశ్చయమైన ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత వరుడి కుటుంబీకులు కట్నం ఇంకా ఎక్కువ కావాలని పట్టుబట్టడం, ఆ ఆర్థిక భారాన్ని తట్టుకునే పరిస్థితి ఆమె కుటుంబానికి లేకపోవడమే ఇందుకు కారణం. మానవ హక్కుల ఉల్లంఘన అంటే నేరుగా కొట్టి చంపడమే కాదు, మానసికంగా వేధించడం కూడా ఆమె జీవించే హక్కును కాలరాయడమే.

పైగా 1961 వరకట్న నిషేధ చట్టం పేరుతో ఓ చట్టం ఉండగానే ఈ పరిస్థితి దాపురించింది. కూతురికి డబ్బిచ్చి పెళ్లి చేయడం నుంచి కోడలి నుంచి డబ్బు కోరుకోవడం వరకు చట్టం ఉల్లంఘనకు లోనవుతూనే ఉంది. అంతర్లీనంగా ఇది యువతి హక్కులను తమ చేతుల్లోకి తీసుకోవడమే. ఆ అమ్మాయి మరణానికి ప్రభుత్వం, పౌరసమాజం, కుటుంబ వ్యవస్థ కూడా బాధ్యత వహించాలి.
 
ఉపాధ్యాయుడే హక్కులు కాలరాస్తే!
కృష్ణా జిల్లాలో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు, ఇంగ్లిష్ టీచరు ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక మీద అత్యాచారం జరుపుతూ ఆమె గర్భం దాలిస్తే అబార్షన్ చేయిస్తూ... చివరికి మూడవసారి అబార్షన్ సమయంలో ప్రాణాలు వదిలిందా బాలిక. ఒక ఉపాధ్యాయుడు... పైగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం గుర్తించి గౌరవించిన ఆ మహోత్తముని చేతిలో ఓ అమాయక బాలిక జీవితం హరించుకుపోయింది.

దళిత, గురుకుల, వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో బాలికలు అవాంఛిత గర్భాలు మోస్తూ అయిష్టంగా బిడ్డకు జన్మనివ్వడం, గర్భాన్ని మోయడం ఇష్టం లేక దొరికిన మందేదో తీసుకుని ఆరోగ్యాన్ని కోల్పోవడం వంటివన్నీ చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. ‘మహిళ ఒంటిని ఆమె అనుమతి లేకుండా తాకకూడదు’ అనే చట్టం ఒకటుందని వీరికి తెలియదా? మైనర్ బాలిక అయితే ఆమె అనుమతించినా సరే ఆమెతో లైంగిక చర్య తప్పు అని తెలుసు కదా! అయినా అత్యాచారాలకు పాల్పడుతున్నారంటే... ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యమా? ఇంతటి భరోసాని వారికెవరిచ్చారు? అనేక రకాలుగా జరుగుతున్న దాడుల నుంచి రక్షణ కోసం ఓ నిర్భయ చట్టం, ఓ 498ఎ, ఓ వరకట్న నిరోధక చట్టం... ఇన్నింటిని తెచ్చుకున్నప్పటికీ అవి మహిళకు తగినంత భరోసానివ్వక పోగా నేరస్థులకే భరోసానిస్తున్నాయి.
 
ఏ సంస్కృతికి ఈ ప్రోత్సాహం!
పాశ్చాత్య సంస్కృతిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ ఆ పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి మహిళ లోనవుతోందని తిరిగి ఆమెనే ఆరోపించే భరోసా పాలకులకు ఎవరిచ్చారు? హింస, తీవ్రమైన అభద్రత, పేదరికాల్లోకి నెట్టివేసే ఈ సంస్కృతిని భారతీయ మహిళ నిజంగా వీటిని కోరుకుంటోందా?
 
ఎక్కడ ఉన్నా... ఎలా ఉన్నా!
1977-78లలో రమీజాబీ అత్యాచారాన్ని ఆమె వ్యక్తిగత అంశంగా కాక సామాజికాంశంగా పరిగణించాలని ఉద్యమించాయి ప్రజాసంఘాలు. ఉద్యమాన్ని అణచడానికి పేలిన తూటాలకు 27 మంది బలయ్యారు. నిర్భయ, అభయ... అందరి విషయాల్లోనూ ‘ఆమె ఎప్పడు, ఎక్కడ, ఎలా ఉన్నది’ అనే ప్రశ్నలు వేసే సమాజం... ‘ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఆమె ఒంటి మీద చేయి వేసే హక్కు నీకు లేదు’ అని చెప్పడంలో విఫలమైంది. అమెరికా పగటి వేళ ఇక్కడ షిఫ్టుల్లో పని చేసే ఐటి అమ్మాయి అర్ధరాత్రి ప్రయాణం చేయకపోతే కుదురుతుందా? ‘మహిళలు రాత్రి వేళల్లో కూడా పని చేయాలి, వెనుకడుగు వేయవద్దు’ అని ప్రబోధించే పాలకులు మహిళలు రాత్రి పూట ప్రయాణించగలిగిన భద్రమైన రవాణా వ్యవస్థను రూపొందించడంలో విఫలమవుతున్నారు.
 
ప్రజాసంఘాలు 1985లో మహిళల హక్కుల కోసం మహార్యాలీ చేసినప్పుడు నేను ఓ ప్లకార్డులో ‘సిగ్గుతో తలదించుకోవాల్సింది బాధితులు కాదు, నేరస్థులే’ అనే నినాదాన్నిచ్చాను. దాదాపుగా 30 ఏళ్ల కిందట మహిళ సంఘాలన్నీ ఆ నినాదంతో ర్యాలీ చేశాం. అప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లిన నినాదం తరం మారినా ఏ మాత్రం ప్రభావం చూపించకుండా... స్త్రీ హక్కును కాలరాసే హక్కు మగవారి చేతిలో ఉందనే భావజాలాన్నే పెంచి పోషిస్తోంది పౌర సమాజం.
 
498ఎ దుర్వినియోగం అంటూ గొంతు చించుకునే ముందు మహిళలు మానసిక, ఆర్థిక, మౌఖిక హింసల నుంచి రక్షణ పొందే చట్టాలు లేకపోవడంతో, చట్టబద్ధత, భద్రత లేనప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కడో కొందరు మాత్రమే 498ఎని ఆశ్రయిస్తున్నారని కూడా గుర్తెరగాలి. వాటన్నింటికీ చట్టాలు ఉంటే ఈ దుర్వినియోగం ఉండదు.
 
చట్టానికి తూట్లు పొడవడం కూడా హక్కుల ఉల్లంఘనే!

ప్రేమను తిరస్కరించిందనే కారణంతో అమ్మాయి మీద దాడికి పాల్పడుతున్నారు. అదే అబ్బాయి నుంచి తిరస్కరణకు గురైన అమ్మాయిలు న్యాయం కోసం మౌనపోరాటాలు చేస్తున్నారు తప్ప భౌతిక దాడులకు దిగజారడం లేదు. స్త్రీ స్వేచ్ఛను, గౌరవాన్ని కోరుకుంటోంది.  ‘హింస లేని జీవితం, హింసలేని శరీరం, హింస లేని కుటుంబం’ ఆమె హక్కు. వాటిని పాదుకొల్పే ప్రజాస్వామ్య కుటుంబాలను నిర్మిద్దాం. అన్ని రకాల ఆధిపత్యాలను, తిరస్కరణలను రద్దు చేద్దాం. శాంతియుత కుటుంబాల నిర్మాణమే నిజమైన మానవహక్కుల పరిరక్షణ.
సంభాషణ : వాకా మంజులారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement