మానవ హక్కులకు ‘వృద్ధి’ చెర? | mallepalli lakshmaiah writes on human rights | Sakshi
Sakshi News home page

మానవ హక్కులకు ‘వృద్ధి’ చెర?

Published Thu, Apr 27 2017 12:29 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

మానవ హక్కులకు ‘వృద్ధి’ చెర? - Sakshi

మానవ హక్కులకు ‘వృద్ధి’ చెర?

కొత్త కోణం
మానవ హక్కుల ఉల్లంఘనను పట్టించుకోకుండా ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధినే ప్రధాన అంశంగా చూడటం ఎంత మాత్రం వాంఛనీయం కాదని ఐరాస నొక్కిచెబుతున్నది. ప్రైవేటు కంపెనీల, ప్రభుత్వాల మానవ హక్కుల ఉల్లంఘనను ప్రజలు ఇక ఎంత మాత్రం సహించే స్థితిలో లేరు. భూసేకరణలో రాజ్యాంగ హక్కులు, అటవీహక్కులు, కార్మిక చట్టాలు, వాటికి సంబంధించిన విధానా లను గౌరవించకపోతే భవిష్యత్‌లో పరిశ్రమల స్థాపన, నిర్వహణ కష్టమే.

కొరియాకు చెందిన ‘పోస్కో’ కంపెనీ వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఒడిశాలో ఒక ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. స్థానిక ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. పోస్కో అటవీ హక్కులు, భూ సేకరణ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతోందని, పునరావాసంలో కనీస నిబంధనలు పాటించడం లేదని, నష్టపరిహారం విష యంలో లోపాలున్నాయని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు.  గత్యంతరం లేక ‘పోస్కో’ కంపెనీ తమ ప్రాజెక్టును ఉపసంహరించుకున్నది.

అట్లాగే శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర నిర్మాణాన్ని కూడా ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. ఆ ప్రతిపాదనను కూడా వెనక్కి తీసుకోకతప్పలేదు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను తవ్వితీసే కాంట్రాక్టును కొన్ని కంపెనీలకు కట్టబెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని అక్కడి ఆదివాసీలు చాలాకాలంగా తిరస్కరిస్తున్నారు, తిప్పికొడుతున్నారు. ఎలాగైనా బడా బాబులకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు ప్రభుత్వం తన సొంత గడ్డపైనే, తన ప్రజలపైనే ఆయుధాలు ఎక్కుపెట్టింది. ఒక రకంగా యుద్ధం ప్రకటించింది.

నల్లగొండ జిల్లాలో యురేనియం నిక్షేపాలను వెలికి తీసి, అణు విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించాలని చేస్తున్న ప్రభుత్వ యత్నాన్ని గత కొన్నేళ్లుగా పలు ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఓపెన్‌కాస్ట్‌ బొగ్గుగనుల తవ్వకాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. యాంత్రీకర ణతో అతి తక్కువ ఖర్చుతో అత్యధిక ఉత్పత్తిని ఆశించి ఓపెన్‌కాస్ట్‌ తవ్వకా లను అనుసరిస్తున్నారు.  ఓపెన్‌కాస్ట్‌లను తక్షణమే రద్దుచేయాలని, ఆదివాసీ భూహక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన 1 ఆఫ్‌ 70 చట్టం అమలయ్యే భూముల్లో తవ్వకాలు చేపట్టకూడదనీ, ఆస్ట్రేలియాలోలాగా ప్రజలు లేని ప్రాంతాల్లోనే తవ్వకాలు జరపాలని ఉద్యమాలు జరుగుతున్నాయి.

‘ఉల్లంఘనలు’... కంపెనీల బాధ్యత
ఇటువంటి సమయాల్లో ప్రభుత్వాలు, కంపెనీలు, వాటి ప్రయోజనాలను పరిరక్షించే ఆర్థికవేత్తలు కొన్ని అసంబద్ధమైన వాదనలను చేస్తున్నారు. కొత్తగా జరిగే పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపారాభివృద్ధిని అడ్డుకోవడం దేశ ఆర్థిక పురోగతిని అడ్డుకోవడమేనని, దానివల్ల దేశం రోజురోజుకూ వెనుక బడిపో గలదని వాదిస్తున్నారు. రెండోవైపు ఎటువంటి పరిస్థితుల్లోనూ మానవ హక్కులను ఉల్లంఘించే సంస్థలను అంగీకరించేది లేదని మానవ హక్కుల సంఘాలు తెగేసి చెబుతున్నాయి. సరిగ్గా ఈ విషయంలోనే ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల పరిరక్షణకు మార్గదర్శకాలను రూపొందించి, ‘çసుస్థిరాభివృద్ధి’ సూచికలను తయారుచేసింది.

ముఖ్యంగా వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అనుసరిస్తున్న విధానాలు మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్నాయని ఐరాస భావించింది. ఐరాస గతంలో ఈ ఉల్లంఘనలకు ప్రభుత్వాలనే బాధ్యులుగా చేసేది. నేడు అది ప్రభుత్వాలతో పాటు కంపెనీలు కూడా అందుకు బాధ్యులేనని నొక్కి చెప్పింది. మంగళ వారం ఢిల్లీలో ఐరాస మార్గదర్శకాల వెలుగులో ‘‘ఛేంజ్‌ అలయెన్స్‌’’ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. మానవ హక్కులను గౌరవించడం, అమలు చేయడం, పరిరక్షించడం ద్వారా పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధిని సాధించ వచ్చునని ఆ నివేదిక సారాంశం.

మానవ హక్కుల పరిరక్షణ కోసం ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఇప్పటివరకు మూడు దశలుగా నిబంధనలను రూపొందించింది. మొదటిదశలో వెలువరించిన 1948 డిసెం బర్‌ 10 ప్రకటనలో ప్రధానంగా పౌర, రాజకీయ హక్కులను ఎక్కువగా ప్రస్తావించారు. ఓటు హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ, వివక్ష నుంచి స్వేచ్ఛ  లను, చిత్రహింసల నిర్మూలన వంటి వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన పలు విషయాలను అందులో పొందుపరిచారు. మానవ హక్కుల రెండవ దశలో ఎక్కువగా సామాజికాభివృద్ధికి సంబంధించిన విషయాలు పొందుపరిచారు. విద్య, వైద్యం, గృహం, ఉద్యోగం, సామాజిక భద్రత, చాలినంత వేతనం లాంటి విషయాలు ఇందులో ఉన్నాయి. మూడో దశలో, శాంతిగా జీవించే హక్కుతోపాటు, పరిశుభ్రమైన పర్యావరణం, ఆర్థికాభివృద్ధిలో హక్కు, ఆర్థిక పురోగతిలో వాటా, సామాజిక సామరస్యం, ఆరోగ్యకరమైన వాతావరణం లాంటి అంశాలవైపు హక్కుల ఉద్యమ ప్రయాణం మొదలైంది.

వర్తక వాణిజ్యాలు–మానవ హక్కులు
ముఖ్యంగా వర్తక వాణిజ్యాలు–మానవ హక్కులు అనే అంశం గురించిన చర్చ మొదటిసారిగా ఐరాస ఆధ్వర్యంలో ప్రారంభమైంది. తొలిసారి 1964లో 77 దేశాలు భాగస్వాములుగా జెనీవాలో ‘‘వ్యాపారం–అభివృద్ధి సదస్సు’’ జరిగింది. ఆ తదుపరి నేడు సభ్య దేశాల సంఖ్య 131కి చేరింది. 1990లో ఐరాస ఆర్థిక, సామాజిక సమితి ‘‘ఆర్థికాభివృద్ధి–అంతర్జాతీయ సంబంధాలు–బహుళజాతి కంపెనీలు’’ అనే విషయంపై అధ్యయనం జరప డానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శిని కోరింది. తదనుగుణంగానే 1998 ఆగస్టులో మానవ హక్కుల పరిరక్షణ – అమలుపై ఒక సబ్‌కమిటీ ఏర్పాటైంది. ఐరాస ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ నియమించిన ప్రొఫెసర్‌ జాన్‌ రగ్గి ఏకసభ్య కమిషన్‌ 2008లో వ్యాపార, వాణిజ్యం–మానవ హక్కులపై స్పష్ట విధానాన్ని రూపొందించింది.

అప్పటివరకు మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉండేది. రగ్గి నివేదిక అనంతరం కంపెనీలను ఈ పరిధిలోకి తీసుకురావాలని భావించారు. దానితో ఐరాస ప్రత్యేకించి కొన్ని నిబంధనలను రూపొందిం చింది. ‘‘వ్యాపార, వాణిజ్యాలు – మానవహక్కులు – ఐరాస మార్గదర్శక సూత్రాలు’’ పేరుతో 2011లో వీటిని విడుదల చేశారు. ఇందులో, ‘‘పరి శ్రమలు, వ్యాపార, వాణిజ్యసంస్థలతో సహా ఎవరైనా మానవ హక్కుల ఉల్లం ఘనకు పాల్పడితే, స్థానిక ప్రభుత్వాలు తక్షణమే స్పందించి తగు రక్షణ చేపట్టాలి.

సమర్థవంతమైన చట్టాలు, నిబంధనలు, విధానాల ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడేవారిని శిక్షించాలి. ఇటువంటి సమయాల్లో తగు నివారణ చర్యలు చేపట్టాలి’’ అంటూ మౌలిక నిబంధనలతో మార్గదర్శకాలు రూపొందించారు. ఇందులో మొదటి నిబంధన ఒక జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం. దీనిపైన మొట్టమొదట బ్రిటన్‌ స్పందించింది. ఆ తర్వాత స్వీడన్‌ కూడా జాతీయ మార్గదర్శకాలను తయారు చేసుకున్నది. అదేవిధంగా, కంపెనీలు తగు విధంగా వ్యవహరించడానికి ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించాలి. మానవ హక్కులపై కంపెనీలే స్వయంగా నివేదికలు తయారుచేయాలి. ప్రజల నిత్యావసరాలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి. యుద్ధాలు, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో కంపెనీలు, ప్రభుత్వాలు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి.

భారత రాజ్యాంగంలో మానవ హక్కులకు సంబంధించి ఎన్నో విష యాలను పొందుపరిచారు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల పేరుతో వ్యక్తి స్వేచ్ఛ, సామాజిక రక్షణ, భద్రతలకు సంబంధించిన ఎన్నో అంశాలను ఇందులో చేర్చారు. అంతేకాకుండా ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) బాల కార్మిక వ్యవస్థ నిషేధంపై ఒక నిబంధనను విడుదల చేసింది. దానిని భారత ప్రభుత్వం ఈనెలలోనే ఆమోదించింది. పిల్లల చాకిరి, పిల్ల లను వేశ్యావృత్తిలోనికి దింపడం లాంటి చర్యలను అరికట్టాలని అది సూచిం చింది. అంతేకాకుండా 2011 జూలైలో ఐరాస విడుదల చేసిన మార్గదర్శకా లలో తొమ్మిది అంశాలను పొందుపరిచారు. ఒకటి, వ్యాపారం బాధ్యతగా, పారదర్శకంగా, నైతిక సూత్రాల ఆధారంగా సాగించాలి. రెండు, సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు సురక్షితమైనవిగా, నాణ్యమైనవిగా ఉండాలి.

మూడు, ఉద్యోగాలకు రక్షణ, భద్రత కలిగించి, మంచి జీవితాన్ని అందించాలి. నాలుగు, నిరాదరణకు, వివక్షకు గురవుతున్న వర్గాల పట్ల బాధ్యతగా వ్యవ హరిస్తూ, వారి ప్రయోజనాలను కాపాడాలి. ఐదు, మానవ హక్కులను గౌరవించి, పరిరక్షించాలి. ఆరు, పర్యావరణ పరిరక్షణకు పూనుకుంటూనే, వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. ఏడు, ప్రజలతో చర్చలు జరిపేటప్పుడు ఎంతో సంయమనంతో వ్యవహరించి, వారి అంగీకారం పొందాలి. ఎనిమిది, అభివృద్ధిలో సమానవాటాకు, సమ్మిళిత అభివృద్ధికి అవకాశం కల్పించాలి. తొమ్మిది, ప్రజలకు వినియోగదారులకు తగు గౌరవం ఇస్తూ బాధ్యతా యుతంగా వ్యవహరించాలి.

ప్రజలు ఇక సహించరు
ఇటువంటి నిబంధనలైతే రూపొందించారు కానీ, ప్రభుత్వాల పని తీరుని పరిశీలిస్తే ఐరాస ఒత్తిడివల్లనో, అంతర్జాతీయ ప్రతిష్టకోసమో కొన్ని నిబంధనలను రూపొందిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆచరణ మాత్రం అందు కనుగుణంగా సాగుతున్నట్టు కనిపించడంలేదు. మానవ హక్కుల ఉల్లంఘ నను పట్టించుకోకుండా, కేవలం వ్యాపార, వాణిజ్య,  పారిశ్రామిక అభివృద్ధినే ప్రాధాన అంశంగా చూడటం ఇక ఎంత మాత్రం వాంఛనీయం కాదని ఐరాస నొక్కిచెబుతున్నది. రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం ప్రైవేటు కంపెనీల, ప్రభుత్వాల మానవ హక్కుల ఉల్లంఘనను ఇక ఎంతమాత్రం సహించే స్థితిలో ప్రజలు లేరన్నది నిర్వివాదాంశం. దీనివల్ల ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు చేపడుతున్న ప్రాజెక్ట్‌లకు ఎదురు దెబ్బ తగులుతున్నది. అందువల్ల ప్రైవేట్‌ సంస్థలు తాము చేపట్టబోయే ప్రాజెక్ట్‌లు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండా చూసుకోగలగాలి.

ఈ విషయంలో రాజకీయ అవినీతి ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ప్రజల అవసరాలను, హక్కులను ఖాతరు చేయకుండా లాభాలే లక్ష్యంగా రాజకీయ నాయకులు, ప్రైవేట్‌ సంస్థల అక్రమ కలయిక ఉనికిలోనికి వస్తున్నది. ప్రపంచవ్యాప్త అనుభవాల దృష్ట్యా వ్యాపార, వాణిజ్య, కంపెనీలు భూసేకరణలో రాజ్యాంగ హక్కులు, అటవీహక్కులు, కార్మిక చట్టాలకు సంబంధించిన పలు రక్షణ విధానాలను గౌరవించాలి. లేదంటే పరిశ్రమల స్థాపన, నిర్వహణ భవిష్యత్‌లో కష్టసా ధ్యమే. అందుకే ఐరాస రూపొందించిన మార్గదర్శకాలపట్ల, వాటి అమలు పట్ల ప్రభుత్వాలు నిబద్ధతను ప్రదర్శించాలి. దాంతోపాటు ప్రైవేట్‌ కంపెనీలు కూడా ఐరాస సూచనలను తు.చ. తప్పక పాటించాలి. లేదంటే పారిశ్రామిక, వాణిజ్య వ్యాపారాభివృద్ధిలో ఆటంకాలు తప్పవు.


మల్లెపల్లి లక్ష్మయ్య

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 97055 66213

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement