న్యూఢిల్లీ:ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో ఢిల్లీ పోలీసుశాఖ చాలా వెనుకబడి ఉంది. సామాన్యులను రక్షించాల్సిన రక్షకభటులే వేధింపులు, లంచాలు, బలవంతపు వసూళ్ల వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్నట్టు స్వయానా కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. పోలీసుల నిర్వాకాలపై గత ఏడాది 12,427 ఫిర్యాదులు రాగా, 2012లో వీటి సంఖ్య 12,343గా తేలింది. వీటిని బట్టి చూస్తే నగర పోలీసు వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు జరగాల్సి ఉందని అర్థమవుతోంది. గత ఏడాదిలో నగర పోలీసులు 141 కేసుల్లో మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డట్టు ఫిర్యాదులు వచ్చాయి. 2012లోనూ 75 కేసుల్లో ఉల్లంఘనలు నమోదయినట్టు తేలింది. వీటిలో 12 కేసుల్లో పోలీసులపై చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవడంలోనూ ఉన్నతాధికారులు అలసత్వం చూపిస్తున్నారనే విమర్శలూ ఉన్నా యి.
గత ఏడాది సిబ్బంది అక్రమాలపై 178 విచారణలకు ఆదేశాలు జారీ చేయ గా, వీటిలో 95 కేసులు తప్పుడువని నిర్ధారించారు. మిగతా కేసుల విచారణ కొనసాగుతూనే ఉంది. జాతీయ నేర గణాంకాల సంస్థ పైవివరాలను వెల్లడించింది.2013లో మొత్తం 149 మంది పోలీసులపై కోర్టుల్లో విచారణ కొనసాగింది. వీటిలో ఒక కేసును కొట్టివేయగా, నిందితుడు నిర్దోషిగా విడుదలయ్యారు. 2012లో 43 కేసులను న్యాయస్థానాలు పరిష్కరించాయి. వీటిలో 13 మంది పోలీసులకు శిక్షలు పడ్డాయి. 30 మంది నిర్దోషులుగా తేలారు. అంతేగాక 1,125 మందిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోగా, 1,222 కేసులను ఉపసంహరించుకోవడమో లేక కొట్టివేయడమో జరిగింది. తీవ్ర తప్పిదాలకు పాల్పడిన 103 మంది పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించగా, 592 మందిపై కఠిన చర్యలు తీసుకున్నారు.
ఇక 2012లో 112 మంది పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించగా, 1,049 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని జాతీయ నేరగణాంకాల శాఖ విశదీకరించింది. అక్రమ అరెస్టులపై గత ఏడాది రెండు కేసులు నమోదు కాగా, 2012లో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. గత ఏడాది పోలీసుల బలవంతపు వసూళ్లపై తొమ్మిది, వేధింపులపై మూడు కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఇప్పటికీ చార్జిషీట్లు దాఖలు చేయలేదు. మహిళలతో అనుచితంగా ప్రవర్తించినట్టు 23 కేసులు నమోదుకాగా, మూడు కేసుల్లో మాత్రమే చార్జిషీట్లు సమర్పించారు. గత ఏడాది ఒక నిందితుడి నుంచి డబ్బులు వసూలు కాలేదనే కోపంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపినట్టు కేసు నమోదయింది. మరో బలవంతపు వసూళ్ల కేసులో పోలీసులే ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారు. అమిత్ తోమర్ అనే పోలీసు ఉద్యోగితోపాటు నెబ్ సరాయి పోలీసు వల్ల గత ఏడాది ఈశాఖ ప్రతిష్టకు మచ్చలు తప్పలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 446 మందిని నిరుడు సస్పెండ్ చేశారు. 491 మంది పేర్లను ‘అనైతిక ప్రవర్తన’ కలిగిన ఉద్యోగుల జాబితాలో చేర్చారు.
ఇది వరకే 598 మంది పోలీసుల పేర్లు ఇందులో ఉన్నాయి. వివిధ కేసుల్లో వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన అధికారులు గత ఏడాది 158 విచారణలకు ఆదేశించగా, 19 కేసుల్లో నిందితులు దోషులని తేలింది. దీంతో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు సహా 19 మంది పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. పలువురు పోలీసులపై గతేడాది 794 శాఖాపరమైన విచారణలు నిర్వహించగా, 1,057 మందిపై చర్యలు తీసుకున్నారని జాతీయ నేరగణాంకాల సంస్థ వివరించింది.మహిళలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఫిర్యాదు పెరుగుతుండడంతో మహిళా పోలీసుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది కల్లా మూడు వేల మంది మహిళా పోలీసులను నియమించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
మహిళలకు సంబంధించిన సున్నితమైన అంశాలను పరిష్కరించేందుకు కానిస్టేబుల్ మొదలుకొని వివిధస్థాయిల అధికారులను నియమిస్తారు. ‘భర్తీ ప్రక్రియ ఇది వరకే మొదలయింది. ఎంపికైన వారికి భారీ ఎత్తున శిక్షణ ఇస్తాం. వచ్చే ఏడాది ముగిసేనాటికి మూడు వేల మంది మహిళా పోలీసులు ఉద్యోగాల్లో చేరతారు’ అని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ అధీనంలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. 2012, డిసెంబర్ 16న నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవిదేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం మహిళా పోలీసుల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ప్రకారం ఒక్కో స్టేషన్‌లో కనీసం ఇద్దరు ఎస్‌ఐలు, ఏడుగురు కానిస్టేబుళ్లు మహిళలు ఉండేలా చూస్తారు. ఈ మేరకు మహిళా పోలీసుల నియామకానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుశాఖలో 80 వేల మంది పనిచేస్తుండగా, వీరిలో ఏడు వేల మంది వరకు మహిళలు ఉన్నారు.
కంచే చేను మేస్తోంది..
Published Wed, Jul 2 2014 11:56 PM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM
Advertisement
Advertisement