రాజధానిలో పౌర హక్కుల ఉల్లంఘన
హైకోర్టు న్యాయవాది సురేష్‌కుమార్
తాడేపల్లి రూరల్: రాజధానిలో పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది పొత్తూరు సురేష్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాజధాని గ్రామాలైన ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయనిపాలెం, మందడం, లింగాయపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రైతులు, వివిధ వృత్తిదారులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. 2013 భూసేకరణ చట్టం కింద ప్రజలకు అందాల్సిన సాయం అందడం లేదన్నారు. రాజధానిలో వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు, పేదల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. చేతివృత్తిదారులకు ప్రభుత్వం ఇంతవరకు ప్రత్యామ్నాయం ఎందుకు చూపలేదో సమాధానం చెప్పాలన్నారు. సచివాలయం పక్కనే ఉన్న లింగాయపాలెంలో పెత్తందార్లు పేదలను ఇసుక పనులను కూడా చేసుకోనివ్వడం లేదని చెప్పారు. ఒక విధంగా ఫాసిజం రాజ్యమేలుతోందని మండిపడ్డారు.