
జీవన సమస్యలపై ప్రజలు గొంతెత్తాలి
సాక్షి, హైదరాబాద్: జాతి, మతం, కులం పేరిట జన జీవనం, జీవనోపాధిపైన జరుగుతున్న ప్రభుత్వ దాడిపై జనం గొంతెత్తాలని ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్, ఢిల్లీ జేఎన్‌యూ ప్రొఫెసర్ గోపాల్‌గురు పిలుపిచ్చారు. అందుకు ప్రచార, ప్రసార సాధనాలు అండగా నిలవాలని కోరారు. దేశ సరిహద్దులు భద్రంగా ఉంటే సరిపోదని, దేశ సామాజిక వ్యవస్థలోని అంతర్గత అడ్డుగోడల్ని కూల్చాలన్నారు. దీని కోసం భావసారుప్యత ఉన్న వ్యక్తులు, శక్తులు, సంస్థలు నడుంకట్టాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ సామరస్యం, సమగ్రతకు ముంచుకొచ్చిన ముప్పు- పరిరక్షణపై ‘హైదరాబాద్ కలెక్టివ్’ ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సు గురువారమిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ చందనా చక్రవర్తి అధ్యక్షతన ప్రారంభమైంది.
ఇందులో భాగంగా తొలిరోజు పి.సాయినాథ్ ‘మీడియా-మతతత్వం’పైన, ప్రొఫెసర్ గోపాల్‌గురు ‘దేశం- జాతీయత’పై ప్రసంగించారు. ఆ తర్వాత పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సదస్సు శుక్రవారం కూడా జరుగుతుంది.
మానవ హక్కుల్ని గుర్తించడం మీడియా తొలి బాధ్యత: సాయినాథ్
ప్రజా సమస్యలపై మీడియా గొంతెత్తాలని, మానవ హక్కుల్ని గుర్తించడం తొలి బాధ్యతగా వ్యవహరించాలని సాయినాథ్ పేర్కొన్నారు. మూడు లక్షల మంది సెప్టిక్‌ట్యాంక్ స్కావింజర్లు, మాన్‌హోల్స్, మురుగు కాల్వలు శుభ్రం చేసే వారికి పునరావాసం కల్పించేందుకు ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున రూ. 9 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనుకాడితే ఒక్క విజయ్ మాల్యా రూ. 9 వేల కోట్లతో ఉడాయించారని చెప్పారు.
ప్రస్తుతం దేశాన్ని ఓ రాజకీయ ఐక్య సంఘటన పాలిస్తున్నట్టు కనిపిస్తున్నా, వాస్తవానికది సామాజిక మతతత్వ వాదులు, మార్కెట్ ఆర్థిక శక్తుల సంఘటన ఏలుతోందని వివరించారు. ప్రస్తుతం మీడియా కూడా వీరి చేతుల్లోనే ఉందని చెప్పారు. అందుకే ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచినా, సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని సహా పలువురు అవాకులు చెవాకులు పేలినా,రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మీడియాకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలపై రెవెన్యూ లెక్కలకు, జాతీయ నేర దర్యాప్తు సంస్థల లెక్కలకు పొంతన ఉండదన్నారు. రైతు కుటుంబాలకు అన్యాయం చేసేందుకే ఈ లెక్కల్లో తేడాలని చెప్పారు.
కులాల అడ్డు గోడల్ని కూల్చాలి: గోపాల్‌గురు
‘జాతికి, జాతీయతకు ఒకే అర్థం లేదు. అనేకులు అనేక అర్థాల్లో మాట్లాడుతుంటారు. కొందరి దృష్టిలో అది ప్రాంతమైతే మరికొం దరి దృష్టిలో బహిష్కృత ప్రాంతంగా ఉంద’ని గోపాల్ గురు చెప్పారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల మధ్య హద్దులు చెరిగిపోయి అవధులు లేని ప్రపంచం అవతరిస్తున్నా మన సమాజంలోని అంతర్గత కుడ్యాలుగా ఉన్న కులం, మతం, వివక్ష అంతరించడం లేదన్నారు.