మంగళవారం కోర్టు రూంలోనే ఓర్లోవ్‌ను కస్టడీలోకి తీసుకుంటున్న వైనం
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిన తీరును తీవ్రంగా తప్పుబడుతూ వ్యాసాలు రాసిన రష్యా మానవ హక్కుల కార్యకర్తపై అక్కడి కోర్టు కన్నెర్రజేసింది. ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ ఆర్టికల్స్ రాయడం నేరమంటూ 70 ఏళ్ల ఒలెగ్ ఓర్లోవ్‌కు 30 నెలల కారాగార శిక్ష విధిస్తూ మాస్కో కోర్టు తీర్పు చెప్పింది. రాజకీయ దురుద్దేశ్యంతో పెట్టిన కేసు ఇది అని ఆయన చేసిన వాదనలను కోర్టు పట్టించుకోలేదు. ఆయనకు రెండు సంవత్సరాల 11 నెలల జైలు శిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా రెండు సంవత్సరాల ఆరునెలల శిక్షను కోర్టు ఖరారుచేసింది.
ఈ కేసులో గతంలోనే విచారణ ముగిసింది. అప్పుడు ఆయనకు కొంతమేర జరిమానా కట్టాలని మాత్రమే కోర్టు సూచించింది. అయితే పుతిన్ ప్రభుత్వంపై విమర్శలను సహించేది లేదని, కఠిన శిక్ష వేయాల్సిందేనని ప్రాసిక్యూషన్ ఈ కేసు పునర్విచారణను కోరి చివరకు ఇలా శిక్ష పడేలా చేసింది. గతంలో నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని అందుకున్న మానవహక్కుల సంస్థ ‘మెమోరియల్’కు ఓర్లోవ్ సహ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఓర్లోవ్‌ను శిక్షించడాన్ని మెమోరియల్ సంస్థ తీవ్రంగా తప్పుబట్టింది. తమ ఉద్యమం ఆగదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment