
నాట్ ఇన్ మై నేమ్
ప్రజలంటే ఒక మతమో, ఒక అంకెనో, ఒక ఓటో మాత్రమే కాదు అని అభిప్రాయపడుతున్న వారు. జనం అంటే ధనవంతులు మాత్రమే కాదంటున్నవారు. జనం అంటే ఒక్క పురుషులు మాత్రమే కాదంటున్నవారు. జనం అంటే మనం అంటున్నవారు. సమానత్వానికీ దేశంలో స్థానం కల్పించాలంటున్న వారు. స్త్రీలూ, పురుషులూ, థర్డ్ జెండర్స్, ట్రాన్స్ జెండర్స్, పిల్లలూ, పెద్దలూ అంతా అక్కడ చేరారు. అయితే అక్కడంతా నిశ్శబ్దమే. సంస్థల పేర్లు లేవు, రాజకీయ పార్టీల జాడల్లేవు, విద్యాసంస్థల, సంఘాల బ్యానర్లు లేవు. ఊకదంపుడు ఉపన్యాసాలసలేలేవు. ఉన్నదంతా వ్యక్తులే. వారి చేతుల్లో మాత్రం ‘‘నాట్ ఇన్ మై నేమ్’’ ప్లకార్డులు. దేశవ్యాప్తంగా మైనారిటీలపై జరుగుతోన్న అత్యాచారాలకు, హింసకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ముంబై, బెంగళూరు, ఢిల్లీలోని జంతర్‌మంతర్, హైదరాబాద్‌లాంటి ప్రధాన నగరాల్లో సమానత్వాన్ని కాంక్షిస్తోన్న పౌరులంతా సాయంత్రం నాలుగ్గంటల నుంచి ఆరుగంటల వరకు మౌనంగా నిరసనని తెలియజేశారు.
‘‘నాట్ ఇన్ మై నేమ్’’ అనే స్లోగన్‌కి అర్థం ఈ రోజు నేను దాడికి గురికాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నేను కూడా ఒకానొక కారణంతో దాడికి గురికావచ్చు. ఇప్పుడు నేను వ్యతిరేకించకపోతే రేపు నా వంతూ రావచ్చు. అందుకే ఈ దాడులు ఆపాలంటూ మా నిశ్శబ్ద నిరసన ఇది అన్నారు కార్యక్రమంలో ప్రొఫెసర్ రమామేల్కొటే, వసంతా కన్నాభిరాన్, కల్పనా కన్నాభిరాన్, సుధ, సునీతా రెడ్డి, ఆశాలత, పద్మజాషా, వసుధ, సుమతి, అనితా రెడ్డి, అజీజ్‌పాషా, తేజస్వీని, కృశాంక్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.