ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు ప్రభుత్వం మానవ హక్కులను కాలరాసేవిధంగా పరిపాలన సాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఏపీసీసీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు ప్రభుత్వం మానవ హక్కులను కాలరాసేవిధంగా పరిపాలన సాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్ర పీసీసీ బృందం మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కలసి ఏపీలో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా విజయవాడలో తమ పార్టీ ఆధ్వర్యంలో 23న చేపట్టిన మహా నిరసన కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని అందులో పేర్కొంటూ.. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు పీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, కె.తులసిరెడ్డి, సూర్యానాయక్, అధికార ప్రతినిధి కె.గంగాభవాని తదితరులు హెచ్‌ఆర్సీని కలసి వినతిపత్రం అందజేశారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్‌ఆర్సీ జూన్ 30లోగా ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీ డీజీపీ, చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది.