రాష్ట్ర ప్రభుత్వం పౌర,ప్రజాస్వామిక హక్కులను అణచివేతకు దిగిందని మానవహక్కుల వేదిక ధ్వజమెత్తింది.
మానవ హక్కుల వేదిక ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పౌర,ప్రజాస్వామిక హక్కులను అణచివేతకు దిగిందని మానవహక్కుల వేదిక ధ్వజమెత్తింది. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో వరంగల్‌లో మంగళవారం తలపెట్టిన సభను పోలీసులు భగ్నం చేయడాన్ని ఈ మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండించింది. ఈమేరకు ఈ వేదిక మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాస్వామిక హక్కులను గౌరవించాలని, ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం పూర్తి భరోసాను ఇస్తూ ప్రకటనను జారీచేయాలని వేదిక ఉభయరాష్ట్రాల అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్, ప్రధానకార్యదర్శి వీఎస్ కృష్ణ డిమాండ్ చేశారు.
సోమవారం నుంచే వివిధ జిల్లాల్లో మానవహక్కుల కార్యకర్తలను పోలీస్‌స్టేషన్లకు పిలిపించి, వరంగల్‌కు వెళ్లడం లేదని హామీపత్రాలు రాయించుకోవడం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారని, రాష్ర్టవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టించారని విమర్శించారు. ఈ విషయంపై హోంమంత్రి కాని, ప్రభుత్వంలోని బాధ్యులు కాని పెదవి విప్పడం లేదని పేర్కొన్నారు. ఇదంతా పూర్తిగా ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగిందని తాము భావిస్తున్నామన్నారు.