శాసన వేదికల్లో బిల్లుల్ని కృత్రిమంగా ఆపే సంస్కృతిని కేంద్ర పాలకులు ప్రవేశపెట్టారు. అందుకే ‘ధిక్కార స్వరంతో వ్యవహరించే పాలకులున్న చోట రాజ్యాంగ చట్ట నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు జరిపించడంలో సుప్రీంకోర్టు నిజమైన రాజ్యాంగ రక్షకురాలిగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అని భారత్ లా కమిషన్ అధ్యక్షుడు ఎ.పి. షా స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణా శక్తిగా ఉండవలసినవాళ్లు ఆ బాధ్యత నుంచి తప్పుకోబట్టే దేశంలో పౌర హక్కులకు రక్షణ లేకుండా పోయింది. అందుకే ‘దేశభక్తి అంటే– తిరంగా సెల్ఫీ కాదు, తరాలుగా కూలబడిన పిట్టలకు రెక్క విదిల్చే తెగువనివ్వడం!’
ఇటీవలనే గుజరాత్‌లో ముగిసిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి రకరకాల కార ణాలను ఊహించుకుంటున్న దశలో అను కోని చిత్రమైన ‘విశేషాలు’ వెల్లడయ్యాయి. గుజరాత్ ఎన్నికల్లో అర వింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ రంగంలోకి దిగింది. బీజేపీని గెలిపించడానికే పరోక్షంగా పనిచేసిందని కొందరు ఊహిస్తే... కాదు గుజరాత్‌లో కూడా ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ ఉనికిని చాటుకోవడం ద్వారా అఖిల భారత స్థాయిలో తన ఓటు బ్యాంకుని పెంచుకొని జాతీయ స్థాయి రాజకీయ పక్షంగా నిలబడుతుందనీ, ఇది గొప్ప పరిణామమనీ మరికొందరు భావించారు. దీనికి తోడు అటు కాంగ్రెస్ పాలనలో మాదిరే ఇటు బీజేపీ–ఆరెస్సెస్ ఉమ్మడి పాలనలో కూడా తమకు అనుకూలమైన కేంద్ర ఎన్నికల కమిషన్‌లను, కమిషనర్‌లను నియమించుకోవడం దేశ ప్రజలకు అనుభవమే!
ఎందుకంటే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ఘడియ ఆఖరిదశ డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ముగిసినప్పుడు 93 నియోజక వర్గాలలో 58.8 శాతం ఓటింగ్ నమోదు అయింది. కానీ ఆ ఓటింగ్ శాతాన్ని మరుసటి రోజు ఎలక్షన్ కమిషన్ 65.3 శాతంగా సవరించింది. మొదటి దశలో నమోదైన ఓటింగ్‌ను ముందు 60.11 శాతంగా చూపించి, తర్వాత దాన్ని 63.14 శాతంగా సవరించారు. అంటే, 2017 ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ కన్నా, 2022 ఎన్నికల్లో నాలుగు శాతంపైగా ఓట్లు తగ్గిపోయాయి. కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ కొత్తగా గుజరాత్‌లో రంగంలోకి దిగినందువల్ల ప్రత్యేకించి అది బీజేపీకి పరోక్షంగా సాయపడిందీ లేదు. పైగా తన సత్తాను ఉన్నంత లోనే ‘ఆమ్ ఆద్మీ’ ఆచరణలో రుజువు చేసుకొంది కూడా!
కాగా, క్రమానుగతంగా బీజేపీ–ఆరెస్సెస్ పాలకుల కనుసన్నల్లో గత ఎనిమిది తొమ్మిదేళ్లుగా దేశంలో జరిగిందని చెప్పుకొంటున్న ‘ప్రగతి’ ఫలితాలన్నీ – ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాన్ని పూర్తిగా తారుమారు చేయడం. సంపూర్ణ ప్రైవేటీ కరణ దిశగా మరలడం. బహుశా ఈ పరిణామాల దృష్ట్యానే భారత్ లా కమిషన్ అధ్యక్షుడు, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎ.పి. షా ఇలా వ్యాఖ్యానించారు: ‘‘దేశంలో, రాష్ట్రాలలో అధికార బలం చూసు కుని వ్యవహరించే పాలక వర్గాలున్న చోట దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ మౌలిక ప్రయోజనాల సంరక్షక శక్తిగా వ్యవహరించాల్సి ఉంటుంది.’’
ఈ హెచ్చరిక ఎప్పటికీ శిరోధార్యం కావాలి. మూడు రాజధానుల నిర్మాణం ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవకాశం ఉంటుందని భావించి ఆ ప్రయత్నాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి కొట్టేందుకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ‘హైకోర్టే ప్రభుత్వమైతే, ఇంక ప్రజ లెన్నుకున్న మంత్రివర్గం దేనికి? ప్రజా ప్రతినిధులెందుకు?’ అని ప్రశ్నించింది. ‘ఫలానా ప్రాంతంలోనే రాజధాని ఉండాలని ఆదేశించే అధికారం’ కోర్టులకు లేదనీ స్పష్టం చేయవలసి వచ్చింది.
అంతేగాదు, కొంతమంది జడ్జీలను హైకోర్టు, సుప్రీంకోర్టులకు ప్రమోట్ చేస్తూ నూతన సుప్రీం ధర్మాసనం చేసిన (నవంబర్ 28) ప్రతిపాదనను పాలకవర్గం అమలు చేయకుండా తొక్కి పట్టినందుకు సుప్రీంకోర్టు ఆగ్రహం ప్రకటించవలసి వచ్చింది. ఇటీవల హైకోర్టు లలో నియామకానికి సుప్రీం ధర్మాసనం ప్రతిపాదించిన 20 మంది జడ్జీల పేర్లను పునఃపరిశీలించాలని బీజేపీ పాలకులు ఒత్తిడి చేయ డాన్ని సుప్రీంకోర్టు నిరసించిందని మరచిపోరాదు.
అంతేగాదు, శాసన వేదికల్లో బిల్లుల్ని కృత్రిమంగా ఆపే సంస్కృతిని కూడా బీజేపీ పాలకులు ప్రవేశపెట్టారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత తొలి రాష్ట్రపతిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత, ఇవాళ్టి లాగా ఎన్నడూ తమకు అనుకూలంగా లేని బిల్లుల్ని కృత్రి మంగా తొక్కిపట్టడానికి గానీ, తాను నియమించిన గవర్నర్లు అలాంటి పనులకు పాల్పడటానికి గానీ అనుమతించలేదు. భారత లౌకిక రాజ్యాంగ నిబంధనలను తు.చ. తప్పక పాటించి తీరాలనీ, కారణాలు చూపకుండా బిల్లుల్ని తమ వద్దే పాలక వర్గాలు ఉంచుకొని సభాధికారాన్ని ధిక్కరించరాదనీ సుప్రీం మాజీ న్యాయమూర్తి, నేష నల్ లా కమిషన్ మాజీ అధ్యక్షులు జస్టిస్ జీవన్ రెడ్డి పదే పదే మొత్తుకొంటూ వచ్చారు.
అంతేగాదు, చివరికి స్వతంత్ర నిర్ణయాలు చేసుకొని రాజకీయ జోక్యానికి దూరంగా నిర్ణయాలను అమలు జరపాల్సిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌లోకి కూడా పాలకులు తలదూర్చే స్థితి వచ్చింది.
అందుకనే లా కమిషన్ మాజీ అధ్యక్షుడు జస్టిస్ ఎ.పి. షా అనుభవం మీద ‘ధిక్కార స్వరంతో వ్యవహరించే పాలకులున్న చోట రాజ్యాంగ చట్ట నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు జరిపించడంలో సుప్రీంకోర్టు నిజమైన రాజ్యాంగ రక్షకురాలిగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేయాల్సి వచ్చింది. రాజ్యాంగ పరిరక్షణా శక్తిగా ఉండవలసిన పాలకులు ఆ బాధ్యత నుంచి తప్పుకొని సొంత అజెండాలతో పాలన వెలగ బెడుతూండబట్టే దేశంలో పౌర హక్కు లకు రక్షణ లేకుండా పోయింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని పౌర హక్కులకు రాబోతున్న ప్రమాదం గురించి హెచ్చరిక చేసినా, పాలకు లకు ‘చీమ కుట్టలేదు’! జస్టిస్ వెంకటాచలయ్య, జస్టిస్ జె.ఎస్. వర్మ లాగా నేటి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నిర్ణయాలలో తన స్వతంత్ర వ్యక్తి త్వాన్ని కాపాడుకుంటూ దేశ ప్రజలకు ఆశావహమైన నిర్ణయాలతో అకుంఠితంగా ముందుకు సాగడం పాలకులకు ‘గొంతులో వెల క్కాయ పడిన’ట్టుగా ఉంది.
పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు ఇచ్చిన హామీని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ‘మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వీటిలో మరే వివక్షతోనూ దేశ పౌరులను వేరుచేసి చూడటం నేరం’ అని స్పష్టంగా ప్రకటించారు. అయినా కుల, మత జాడ్యాలకు కళ్లెం పడకపోవడానికి కారణం భారత పార్లమెంటులో ‘సవర్ణ హిందు వుల’ సంఖ్య పెరగడమేనని అంబేడ్కర్ వివరించారు. సుప్రసిద్ధ పార్ల మెంటేరియన్ మహావీర్ త్యాగి ఒక సందర్భంలో రాజ్యాంగ ముసా యిదా కమిటీకి ఒక సవాలు విసిరారు: ‘‘రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చిన పౌర ప్రాథమిక హక్కులలో భాగంగా, ఆ హక్కులకు విరుద్ధంగా ప్రవర్తించే ప్రభుత్వాలను పడగొట్టే హక్కును కూడా అనుమతిస్తారా, లేదా? అలాంటి హక్కును మీరు కల్పించినట్టు లేదు.
ప్రభుత్వ హక్కుల్ని మాత్రమే గుర్తించడంతో సరిపోదు, అదే మోతాదులో ప్రజల హక్కుల్ని గుర్తించాలి’’ అన్నారు మహావీర్ త్యాగి! ఈ ప్రతి పాదనతో అంగీకరిస్తూ అంబేడ్కర్ ఇలా స్పష్టం చేశారు: ‘‘రాజకీయ పదవులు లేదా మరొక పద్ధతుల్లో ప్రలోభాలు సభ్యులకు కట్టబెట్టడం ద్వారా ప్రయోజనం లేదు. ఈ రకమైన ప్రలోభాలకు మొత్తం పార్ల మెంట్ సభ్యుల్ని అలవాటు చేశామంటే పార్లమెంట్ స్వతంత్ర ప్రతి పత్తే నాశనమౌతుంది. వందిమాగధులకు వత్తాసు పెరిగి సంస్థ నాశన మవుతుంది. పార్లమెంట్‌ను మరొక స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌గా, బ్రోకర్ల సంస్థగా మార్చకూడదు’’ అన్నారు. బహుశా ఇలాంటి అనుభవాలను చవిచూసిన తర్వాతనే కాబోలు కవి కంచరాన భుజంగరావు ఇలా ఆక్రోశించి ఉంటారు.
‘‘అర్ధరాత్రి సంకెళ్లు తెగిన జాతికి/ సూర్యోదయం ఒక సహజ మైన ఆశ/ తెల్లవారడం ఒక అనంతమైన భరోసా/... దొరల బూట్లలో కాలు పెట్టినప్పుడే/ అభివృద్ధి నడక ఎక్కడో తప్పటడుగులు వేసింది/ కొండల్ని మేరువులుగా బలిపించి/ కూసుల్ని కురచబార్చింది/ ఇప్పుడు చూడండి/ కేవలం రెండొందల మర్రి చెట్ల (మహాకోటీశ్వర్లు) నీడ దేశాన్ని కమ్మేసింది/ ఎదుగూ బొదుగూ లేని బీదల నేల/ వాడ ల్లోకి మురికివాడల్లోకి మునగ దీసుకుంది/ నేడు పెట్టుబడి ఒక్కటే వీసా లేకుండా దేశాలు తిరిగేస్తోంది/ ఈ గడ్డమీద పెట్టుబడికి ఉన్నంత స్వేచ్ఛ/ వేరెవరికైనా ఉందంటారా?/ ఇప్పుడిక దేశభక్తి అంటే – తిరంగా సెల్ఫీ కాదు సామీ/ రెక్కల మీది వివక్ష బరువుతో/ తరాలుగా కూలబడిన పిట్టలకు/ రెక్క విదిల్చే తెగువనివ్వడం/ రెండు గుండెల వాళ్ల కపటత్వాన్ని ఎదురొడ్డి/ ఉన్న ఒక్క గుండెను స్వేచ్ఛా కాశం కోసం/ ప్రజా పతాకను చేసి ఎగరేయడం!
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు.
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment