‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు’ అన్నట్టు.. తెల్లగా మెరిసిపోతున్న దుస్తులు.. నల్లటి కళ్లద్దాలు.. నీట్‌గా పాలిష్ చేసిన బూట్లు.. ఖరీదైన కార్లు.. ఒలకబోస్తున్న దర్జా, దర్పం చూసి.. చాలా గొప్పవాడని చాలామంది నమ్మారు. తీరాచూస్తే వాడే ఆరితేరిన నేరగాడని.. చాలా తేలిగ్గా నమ్మించి.. తడిగుడ్డతో గొంతు కోసేయగల కిలాడీ అని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. ‘హ్యూమన్ రైట్స్’ పేరు చెబుతూనే.. చేత కర్రపట్టి.. సాటి మనిషిపై అమానుషంగా వ్యవహరించిన తీరు చూసి నిర్ఘాంతపోతున్నారు. హోం మంత్రి బంధువునంటూ చేసిన దందాలు, దాడులకు పాల్పడిన అవినాష్ నేరచరిత్రను తెలుసుకుని జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ/అమలాపురం టౌన్ :ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సౌత్ ఇండియా చైర్మన్‌గా చెప్పుకుంటూ.. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునని ప్రచారం చేసుకుంటూ.. జిల్లాలో పలు దందాలకు, అక్రమ వసూళ్లకు పాల్పడిన పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్ర నేర ప్రస్థానం భద్రాచలంలో మొదలై జిల్లాకు విస్తరించింది. చాలా దశాబ్దాల కిందట తాత చంద్రరావు హయాంలో అవినాష్ కుటుంబం కోనసీమలోని పి.గన్నవరం మండలం పోతవరం నుంచి భద్రాచలానికి వలస వెళ్లింది. చంద్రరావుకు ముగ్గురు కుమారులు సత్యసాయిబాబా, రాజబాబు, డాక్టర్ బాబు ఉన్నారు. వీరిలో రాజబాబుకు అవినాష్ భద్రాచలంలో పుట్టాడు. ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలకు అవినాష్ ఒక్కడే మగబిడ్డ కావడంతో గారాబంగా పెరిగాడు.
కమశిక్షణ లోపించడంతో స్మగ్లింగ్‌కు, అక్రమార్జనకు అలవాటు పడ్డాడు. దీంతో తృప్తి చెందకుండా అధికార హోదా కోసం అప్పుడే హ్యూమన్ రైట్స్ చైర్మన్‌గా అవతారమెత్తి, తిరిగి జిల్లాలో అడుగు పెట్టాడు. పెద్దాపురం, రాజమండ్రితోపాటు కోనసీమలో దందాలు ప్రారంభించాడు. జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉన్నతాధికారులను కలిసి తన హోదాను చెప్పుకోవడంతోపాటు ఉప ముఖ్యమంత్రి రాజప్పతో బంధుత్వం ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకునేవాడు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురికి ఎరవేసి రూ.లక్షలు కాజేశాడు. మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర శాఖకు చైర్‌పర్సన్‌ను చేస్తానని కాకినాడకు చెందిన ఓ మహిళ నుంచి రూ.14 లక్షలు వసూలు చేశాడు. ఆ పని జరగకపోవడంతో బాధితురాలు పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేసింది. దీంతోపాటు రాజమండ్రిలోని ఓ దళిత కుటుంబంపై అవినాష్ కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటనలు బయటకు వచ్చాయి.
బాధితుల కోసం అన్వేషణ
అవినాష్ బాధితులు జిల్లాలో అనేకమంది ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అవినాష్ బాధితులు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీస్తున్నారు. వారికోసం అన్వేషిస్తున్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే కోనసీమలోని అవినాష్ పూర్వ బంధువులు, స్నేహితులపై దృష్టి పెట్టారు. వారిద్వారా అతడి సమాచారాన్ని మరింతగా రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాకలగరువు, పోతవరాల్లో ఉన్న అవినాష్ బంధువులు, స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే భద్రాచలం సమీపంలోని మామిడిగూడెంలో అవినాష్ ఇంటికి కూడా జిల్లా నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లాయి.
రాజప్పతో సంబంధాలపై దర్యాప్తు
ఉప ముఖ్యమంత్రి రాజప్పతో అవినాష్‌కున్న బంధుత్వంపై మరో పోలీసు బృందం మంగళవారం విచారణ చేపట్టింది. జిల్లాలోని అంబాజీపేట మండలం వాకలగరువు, పి.గన్నవరం మండలం పోతవరంలో పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. రాజప్పకు అవినాష్‌తో బంధుత్వం ఉందో లేదో పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అవినాష్ పెదనాన్న సత్యసాయిబాబాకు రాజప్పకు గతంలో స్నేహం ఉండేది. గత ఏడాది అక్టోబర్ ఒకటో తేదీన రాజప్ప పుట్టిన రోజును పురస్కరించుకుని.. అవినాష్ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌నని చెప్పుకుంటూ, ఖరీదైన కారులో అధికార దర్పంతో అమలాపురం వచ్చాడు. అప్పుడే రాజప్పకు తన పెదనాన్న సత్యసాయిబాబా స్నేహితుడని.. తాను ఆయన తమ్ముడి కుమారుడినని పరిచయం చేసుకున్నాడు. అప్పటినుంచీ రాజప్ప తన బంధువని చెబుతూ.. తాను చేసే అక్రమాలకు ఆయన పేరును ఉపయోగించుకుంటూ వచ్చాడు.
పెద్దాపురంలోనే ప్రాథమిక చదువు
అవినాష్ ప్రాథమిక విద్య పెద్దాపురంలో సాగింది. అక్కడి ఇంటర్నేషనల్ మేథ్‌మెటిక్స్, సైన్స్ అకాడమీల్లో చదివాడు. హైదరాబాద్‌లో ఉన్నత విద్య చదివాడు. ఆ అకాడమీ వ్యవస్థాపకుడు, బచ్చు ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన బచ్చు కోటేశ్వరరావు (ఎన్నారై) గత నెల 24న అమెరికా నుంచి పెద్దాపురం వచ్చినప్పుడు అవినాష్ ఖరీదైన కారులో ప్రత్యక్షమయ్యాడు. అప్పట్లో తనది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అని చెప్పుకున్నాడు. అవినాష్ చిన్నాన్న ప్రస్తుతం అదే జిల్లా నిడదవోలులో ఉంటున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
తప్పించేందుకు తెర వెనుక యత్నాలు!
అవినాష్‌పై ఉచ్చు బిగుసుకోకుండా తెరవెనుక కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. కాకినాడ రామారావుపేటకు చెందిన ఒక మహిళకు మానవ హక్కుల కమిషన్ రాష్ర్ట మహిళా విభాగం చైర్‌పర్సన్ పదవి ఇప్పిస్తానంటూ అవినాష్ రూ.14 లక్షలు కాజేశాడన్న ఆరోపణలున్నాయి. దీనిపై బాధిత మహిళ మంగళవారం రాత్రి కాకినాడ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరు మాత్రం గోప్యంగా ఉంచాలని పోలీసులను కోరినట్టు తెలిసింది. దీంతో అవినాష్‌పై కేసు నమోదైంది. ఇలా మరికొంతమంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఏదో అదృశ్య శక్తి బాధితులను బెదిరించి కేసులు పెట్టకుండా అడ్డుకుంటోందన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అలాగే అవినాష్ చేతిలో దెబ్బలు తిని, చిత్రహింసలకు గురైన బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడం వెనుక కొందరు అధికార పక్ష నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఎవరీ అవినాష్?
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరం గ్రామంలో అవినాష్ తాతయ్య పేరాబత్తుల చంద్రరావు కుటుంబం ఉండేది. చంద్రరావుకు ముగ్గురు కుమారులు సత్యసాయిబాబా, రాజబాబు, డాక్టర్ బాబు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు రాజబాబు కొడుకే అవినాష్. ఆ ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలకు కలిపి అవినాష్ ఒక్కడే మగ సంతానం. మిగిలినవారంతా ఆడపిల్లలే. దీంతో అతడు ఆ కుటుంబాలకు గారాల పుత్రుడయ్యాడు. దాదాపు 25 ఏళ్ల కిందట వ్యాపారాల నిమిత్తం చంద్రరావు భద్రాచలం వలస వెళ్లారు. అప్పటినుంచీ ఆ కుటుంబం అక్కడే స్థిరపడింది. కాలక్రమంలో తాత, తండ్రి మృతి చెందారు. ప్రస్తుతం పోతవరంలో అవినాష్ మేనత్త కొడుకు, అమ్మమ్మ ఊరైన అంబాజీపేట మండలం వాకలగరువులో మేనత్త ఉన్నారు. వాకలగరువులో అతడి స్నేహితులు కూడా కొందరు ఉన్నారు. వీరిలో నాగబాబు అనే స్నేహితుడు అవినాష్ ఇటీవల అమలాపురం వచ్చినప్పుడు అతడి కూడా తిరిగాడు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌లు వాకలగరువు, పోతవరంలో అవినాష్ బంధువులు, స్నేహితులను మంగళవారం విచారించారు.
మారిన విచారణాధికారి
ఇదిలా ఉండగా అవినాష్ దురాగతాలపై విచారణకు అదనపు ఎస్పీ దామోదర్‌ను తొలుత నియమించారు. కానీ మంగళవారం ఆయన స్థానంలో ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావును విచారణాధికారిగా నియమించారు. మొత్తం వ్యవహారంపై ఆయన విచారణ చేపట్టి ఎస్పీ రవిప్రకాష్‌కు నివేదిక అందజేయనున్నారు.
అవినాష్‌తో ‘బచ్చు’పై చర్చ..
పెద్దాపురం : ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో అవినాష్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇక్కడి ఎన్నారై సంస్థ బచ్చు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బచ్చు కోటేశ్వరావుతో అవినాష్‌కు ఉన్న సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. గత అక్టోబర్‌లో పెద్దాపురంలో దేవాంగ సేవా సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా జరిగిన అభినందన సభ వేదికపై అవినాష్ తన శిష్యుడంటూ చినరాజప్ప, ఎంపీ తోట నరసింహాలకు బచ్చు కోటేశ్వరరావు బహిరంగంగా పరిచయం చేశారు. ఈ అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. గత నెల 24న శివాలయం వీధిలో కోటేశ్వరావు నివాసంలో అవినాష్ ప్రతక్షమయ్యాడు. అప్పట్లో కోటేశ్వరావుతో కలిసి అవినాష్ విలేకర్ల సమావేశం నిర్వహించాడు. తనది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అని, చిన్నప్పుడు కోటేశ్వరావు స్థాపించిన ఐఎంఎస్‌ఏ పాఠశాలలో చదువుకున్నానని చెప్పాడు.
ఆయనతో కలిసి తాను పెద్దాపురంలో మానవ హక్కులపై అవగాహన, సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నానని, ఇందుకు కోటేశ్వరావు సుముఖుత వ్యక్తం చేశారని అవినాష్ చెప్పాడు. ఈ సందర్భంగా అతడు, కోటేశ్వరావు కలిసి పట్టణంతోపాటు నియోజకవర్గంలోని పలు పాఠశాలలను సందర్శించారు. అవినాష్ తన విద్యార్థి అని ఉపాధ్యాయులకు కోటేశ్వరరావు పరిచయం చేశారు. తెల్లటి సఫారీ వాహనం, ఇద్దరు వ్యక్తిగత అంగరక్షకులు, అనుచరులతో క్యాబినెట్ మంత్రి తరహాలో అవినాష్ హడావిడి చేసేవాడు. దీంతో అతడికి అధికారులు నానా సపర్యలూ చేసేవారు. అవినాష్‌పై అనుమానం వచ్చిన పెద్దాపురం పోలీసులు దీనిపై విచారణకు యత్నించారు. పెద్దాపురం సీఐ శ్రీధర్ కుమార్, ఎస్సై శివకృష్ణలు బచ్చు ఫౌండేషన్ భవనానికి వెళ్లి విచారణ జరిపారు. అనంతరం అవినాష్‌ను, అతడి అనుచరులను, మూడు వాహనాలను స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ విచారణ పేరుతో స్టేషన్‌లోనే ఉంచి అన్ని రికార్డులూ సక్రమంగా ఉన్నాయంటూ వారిని విడిచిపెట్టారు.
రాజమండ్రిలో సోదాలు
రాజమండ్రి క్రైం : అవినాష్ కోసం పోలీసులు రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సోదాలు చేశారు. గత ఏడాది మార్చి నుంచి జూలై వరకూ నగరంలోని ఎమ్‌కే సిగ్నేచర్స్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 201లో అవినాష్ ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడ తనిఖీలు చేశారు. అక్కడి వారిని విచారించారు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో అతడిని ఖాళీ చేయించినట్టు అపార్ట్‌మెంట్‌లోని కొందరు చెబుతున్నారు. తరువాత అక్కడినుంచి పక్కనే ఉన్న ఏఎంటీ ప్లాజాలో అవినాష్ కొంతకాలం ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ రెండు అపార్ట్‌మెంట్ల నుంచే అతడు తన కార్యకలాపాలు సాగించేవాడని చెప్పారు. ఆ అపార్ట్‌మెంట్ కూడా ఖాళీ చేసిన తరువాత కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని ఒక లాడ్జిలో అప్పుడప్పుడు ఉంటూ తన అనుచరులను రప్పించుకుని పనులు సాగించినట్టు సమాచారం. అవినాష్ వివరాలు తెలుసుకునేందుకు పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్ మంగళవారం రాత్రి రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
భద్రాచలం టు కోనసీమ..వయా పెద్దాపురం
Published Wed, Mar 11 2015 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement
Advertisement