మోడీపై 'నపుంసక' వ్యాఖ్యలు.. బీజేపీ మండిపాటు
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. మోడీ 'నపుంసకుడు' అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఉత్తరప్రదేశ్లోని ఫరూకాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఓ ర్యాలీలో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ, ''మీరు జనాలను చంపించారని మేం ఆరోపించడం లేదు... మీరు నపుంసకుడని అంటున్నాం'' అని విమర్శించారు. మోడీ చాలా శక్తిమంతుడైన నాయకుడని, అయినా 2002 అల్లర్ల నుంచి ప్రజలను రక్షించలేకపోయారని అంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దానిపై బీజేపీ ప్రతినిధి, రాజ్యసభలో ప్రతిపక్ష ఉపనేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. ''భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారహితంగా, సిగ్గులేకుండా మాట్లాడటం దారుణం. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న సల్మాన్ ఖుర్షీద్ అసహాయతకు, నపుంసకత్వానికి మధ్య తేడా అర్థం చేసుకోలేకపోతే ఇంకేం చెప్పాలి? ఖుర్షీద్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే'' అని ఆయన అన్నారు.