
'నర్సరీ బాలుడిలా మోడీ ప్రవర్తిస్తున్నారు'
ఫరూకాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మరోసారి మోడీపై మండిపడ్డారు. గుజరాత్ అల్లర్లను అరికట్టలేకపోయిన నపుంసకుడిగా అభివర్ణిస్తూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన మరోసారి మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాటి అల్లర్ల కేసులో దిగువ కోర్టు తనకు క్లీన్‌చిట్ ఇచ్చిందన్న మోడీని ఓ నర్సరీ బాలుడితో పోలుస్తూ ఎద్దేవా చేశారు.
‘మోడీకి క్లీన్‌చిట్ ఎవరిచ్చారో నాకైతే తెలియదు. మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేయలేదు. అది మాత్రం నిజమే. కానీ మోడీ తీరు నర్సరీలో మంచి మార్కులు తెచ్చుకున్న బాలుడు తానేదో డాక్టర్ అయిపోయి పీహెచ్‌డీ కూడా పొందానని భావిస్తున్నట్లు ఉంది. ఇది సాధ్యం కాదు కదా’ అని ఫరూకాబాద్‌లో మంగళవారం వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ అల్లర్ల ఘటనకు నైతిక బాధ్యత వహించకుండా మోడీ తప్పించుకోజాలరని శరద్ పవార్ బుధవారం ఓ ఆంగ్ల వార్తాచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.