
విదేశాల్లో పరువుతీశారు
ఖుర్షీద్‌పై మండిపడ్డ మోడీ
సాక్షి, న్యూఢిల్లీ/ సంబల్‌పూర్ (ఒడిశా): విదేశాల్లో దేశ పరువు, ప్రతిష్టను ఇనుమడించాల్సిన విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ లండన్‌లో సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు చేసి పరువు తీశారని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని హెచ్చరించారు. ఢిల్లీలో శుక్రవారం న్యాయవాదుల సదస్సులో మోడీ మాట్లాడారు. ‘మన ఎన్నికల ప్రక్రియ, నిష్పక్షపాతంగా సాగే ఎన్నికల నిర్వహణ, ఆస్తులు తదితర వాటిని విదేశాల్లో గర్వంగా చెప్పుకోవాలి. కానీ మన విదేశాంగ మంత్రి విదేశాల్లో మన పరువు తీయడంలో నిమగ్నమయ్యారు. సుప్రీం, ఈసీలపై నేరుగా దాడికి దిగారు. రాజ్యాంగ సంస్థలపై మచ్చ పెడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్థలను ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగంపై విశ్వాసం లేకపోవడం వల్లే కాగ్‌పై విమర్శలు, సీబీఐని దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.
రాబోయే ఓటమికి ఇప్పటి నుంచే సాకులు..
రాబోయే ఓటమికి ఇప్పటినుంచే కాంగ్రెస్ నాయకులు సాకులు వెతుకుతున్నారని ఒడిశాలోని సంబల్‌పూర్ ఎన్నికల సభలో ప్రత్యర్థులపై మోడీ విమర్శలు సంధించారు. దానిలో భాగంగానే సల్మాన్ ఖుర్షీద్ ఈసీ, సుప్రీంలపై విమర్శలు చేశారని ఆరోపించారు. మూడో ఫ్రంట్‌కు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దూరంగా ఉండటంతో గతంలో భువనేశ్వర్ సభతో పోలిస్తే ఈ సభలో ఆయనపై చేసిన విమర్శల్లో వాడి తగ్గించారు. నవీన్ విధానాల వల్లే రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందన్నారు.