కాంగ్రెస్‌ చేతులపై ముస్లింల రక్తపు మరకలు | Salman Khurshid controversial comments | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ చేతులపై ముస్లింల రక్తపు మరకలు

Published Wed, Apr 25 2018 1:59 AM | Last Updated on Wed, Apr 25 2018 1:59 AM

Salman Khurshid controversial comments - Sakshi

అలీగఢ్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ సొంత పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీ చేతులకు ముస్లింల నెత్తుటి మరకలున్నాయి.. ’అని వ్యాఖ్యానించి వివాదం సృష్టించారు. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో జరిగిన సమావేశంలో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమిర్‌ అనే విద్యార్థి.. కాంగ్రెస్‌ పాలనలోనే మతపరమైన అల్లర్లు ఎక్కువగా జరిగాయి కదా అని ఖుర్షీద్‌ను ప్రశ్నించాడు.

ఇందుకు సమాధానంగా ఆయన ‘ఇది రాజకీయ ప్రశ్న. నిజమే మా చేతులకు ముస్లింల నెత్తుటి మరకలు అంటుకున్నాయి. ఆ పార్టీకి చెందిన నాయకుడిగా నాకూ అందులో భాగం ఉన్నట్టు భావిస్తున్నా’ అన్నారు. ఈ క్రమంలో ఆమిర్‌ మరిన్ని ప్రశ్నలు సంధించాడు. ‘1948లో ఏఎంయూ చట్టానికి చేసిన సవరణల వల్ల ముస్లిం దళితలు ఎస్సీ, ఎస్టీ కోటా ద్వారా పొందే రిజర్వేషన్‌కు దూరం అయ్యారు.

హసన్‌పురా, మల్యానా, మీరట్, ముజఫర్‌ నగర్, భాగల్‌పూర్, మొరాదాబాద్, అలీగఢ్‌లలో ముస్లిం వ్యతిరేక అల్లర్లు.. బాబ్రీ మసీదులో విగ్రహాలు పెట్టడం, మసీదు కూల్చివేత కూడా కాంగ్రెస్‌ పాలనలోనే జరిగాయి కదా. మరి ఆ నెత్తుటి మరకలను కాంగ్రెస్‌ ఎలా శుభ్రం చేసుకోగలదు’ అంటూ ఆమిర్‌ ప్రశ్నిం చాడు. అయితే తానొక వ్యక్తిగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానని, గతం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని ఖుర్షీద్‌ బదులిచ్చారు. చరిత్ర నుంచి తప్పొప్పులను గ్రహించి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయాలని అన్నారు. ఖుర్షీద్‌ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీ ఇరుకున పడినట్టయింది. ఈ నేపథ్యంలో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదని చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement