న్యూఢిల్లీ/భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ పేరిట రాసిన పుస్తకం వివాదాస్పదంగా మారింది. బుధవారం విడుదలైన ఈ పుస్తకంలో ఆయన ప్రస్తావించిన అంశాలు రాజకీయంగా సెగలు రాజేస్తున్నాయి. సనాతన ధర్మం, ప్రాచీన హిందూవాదంతో కూడిన హిందూత్వం పక్కకుపోయిందని, ప్రస్తుతం హిందూత్వం అనేది జిహాదీ ఇస్లామిక్ సంస్థలైన ఐసిస్, బోకో హరాంల మాదిరిగా మారిపోయిందని పుస్తకంలో ఖుర్షీద్ ఆక్షేపించారు. ఇప్పుడున్నది అతివాద హిందూత్వం అని పేర్కొన్నారు. ఖుర్షీద్‌పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది వివేక్ గార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నేతలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా మండిపడ్డారు. అయోధ్య తీర్పుపై ఖుర్షీద్ రాసిన పుస్తకం ప్రజల మతపరమైన మనోభావాలను గాయపర్చేలా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. సోనియా, రాహుల్ ఆదేశాలతోనే ఖుర్షీద్ పుస్తకం రాశారని గౌరవ్ ధ్వజమెత్తారు. పుస్తకంలో సల్మాన్ అభిప్రాయాలను కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఖండించారు. హిందూత్వను ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో పోల్చడం సరైంది కాదని, అది వాస్తవ దూరమని పేర్కొన్నారు. అతిశయోక్తులు వద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment