సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కేంద్రంలో యూపీఏ -3 కొలువుతీరుతుందని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అందరి అంచనాలకు భిన్నంగా యూపీ ఫలితాలు ఆశ్చర్యకరంగా వెలువడనున్నాయని జోస్యం చెప్పారు. 2009లో యూపీలో కాంగ్రెస్ 21 స్ధానాలను గెలుచుకున్న సందర్భం మరోసారి ఎదురవనుందని, అప్పటికన్నా అధికంగా సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.
2009లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 205 స్ధానాలను గెలుపొందగా అదే సంఖ్యలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు వస్తాయా అని ప్రశ్నించగా అందులో ఎలాంటి సందేహం లేదని సల్మాన్ ఖుర్షీద్ బదులిచ్చారు. పార్టీలో నూతన నాయకత్వం రాకతో కార్యకర్తలు, శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోందని, లోక్‌సభ ఎన్నికల అనంతరం తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్ధితిలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలోకి ప్రియాంక ఆగమనం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని చెప్పారు. కాగా,ఫరక్కాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన సల్మాన్ ఖుర్షీద్ బీజేపీ సిటింగ్ ఎంపీ ముఖేష్ రాజ్‌పుట్, బీఎస్‌పీ అభ్యర్థి మనోజ్ అగర్వాల్‌ల నుంచి ముక్కోణ పోటీ ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment