
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని వెల్లడించిన కాంగ్రెస్ అందుకు సంబంధించిన జాబితాను బహిర్గతం చేసింది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని, కానీ ఏనాడు వాటిని రాజకీయాల కోసం వినియోగించుకోలేదని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా గురువారం మీడియా సమావేశంలో జాబితాను వెల్లడించారు. 2008 జూన్ 19న పూంచ్‌లోని భట్టల్ సెక్టార్ ప్రాంతంలో, 2011 ఆగస్టు 30–సెప్టెంబర్ 1 తేదీల్లో కేల్‌లో నీలమ్ నదీ ప్రాంతంలోని శార్దా సెక్టార్‌లో, 2013 జనవరి 6న సవన్ పత్ర చెక్‌పోస్ట్ వద్ద, 2013 జూలై 27–28 తేదీల్లో నజపిర్ సెక్టార్‌లో, 2013 ఆగస్టు 6న నీలమ్ లోయ ప్రాంతంలో, మరొకటి 2013 డిసెంబర్ 23న చేపట్టినట్లు తెలిపారు. అలాగే వాజ్‌పేయ్ ప్రభుత్వంలోనూ రెండు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు వెల్లడించారు. 2000 జనవరి 21న నీలమ్ నది ప్రాంతంలోని నదలా ఎన్‌క్లేవ్, 2003 సెప్టెంబర్ 18న పూంచ్‌లోని బార్హో సెక్టార్‌లో దాడులు చేసినట్లు తెలిపారు.
మన్మోహన్ ఇంటర్వ్యూ తర్వాత...
యూపీఏ హయాంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.
Comments
Please login to add a commentAdd a comment