న్యూఢిల్లీ: ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పొత్తు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్‌ల మధ్య నెలలుగా సాగుతున్న చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకూ ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా కాంగ్రెస్ కూడా సోమవారం ఆరు స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ ఆసక్తి చూపినా, పంజాబ్, హరియాణ, చండీగఢ్‌ల్లోనూ పొత్తు ఉండాల్సిందేనంటూ ఆప్ పట్టుబట్టింది. ఇది కాంగ్రెస్‌కు నచ్చలేదు. పొత్తు కుదుర్చుకునేందుకు ఎన్నోసార్లు చర్చలు జరిపినా విషయం కొలిక్కిరాలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకూ కాంగ్రెస్ తమ అభ్యర్థులను సోమవారం ప్రకటించింది.
గతంలో ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఈశాన్య ఢిల్లీ నుంచి, కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్‌ను న్యూఢిల్లీ నుంచి, తూర్పు ఢిల్లీ నుంచి అర్వీందర్ సింగ్ లవ్లీని కాంగ్రెస్ బరిలోకి దింపింది. దక్షిణ ఢిల్లీలో బరిలో దింపిన బాక్సర్ విజేందర్ 2008 బీజింగ్ ఒలంపిక్స్‌లో కాంస్య పతక విజేత. బీజేపీ కూడా తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను తాజాగా ప్రకటించింది. గతంలోనే ఆ పార్టీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా తూర్పు ఢిల్లీ నుంచి క్రికెటర్ గౌతం గంభీర్‌ను, న్యూఢిల్లీ నుంచి సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖిని బీజేపీ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో మోదీ గాలి వీచిన కారణంగా ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లనూ బీజేపీ గెలుచుకుంది.
నామినేషన్ వేసిన ఆప్ అభ్యర్థులు..
ఆప్ అభ్యర్థుల్లో ఆరుగురు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న బల్వీర్ సింగ్ జఖర్ గత గురువారమే నామినేషన్ దాఖలు చేయగా, పత్రాలను అసంపూర్తిగా నింపడంతో మరోసారి నామినేషన్ వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆయనను కోరింది. బల్వీర్ సింగ్ మినహా మిగిలిన ఆప్ అభ్యర్థులందరూ సోమవారం నామినేషన్లు వేశారు. వీరందరూ వేర్వేరు చోట్ల నామినేషన్లు వేయగా, ఆప్ కీలక నేతలు వారి వెంట వచ్చారు. అంతకుముందు అభ్యర్థులందరూ రోడ్ షోలు నిర్వహించారు.
మా ప్రభుత్వ విజయాలను వివరిస్తాం: షీలా
ఢిల్లీలో, కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తామని ఈశాన్య ఢిల్లీ అభ్యర్థిని, మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ చెప్పారు. ఢిల్లీలో జరగనున్న త్రిముఖ పోరుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీలో, 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment