కలిస్తే గెలుస్తారు! | Cong-AAP alliance called off over disagreement on tie-up in Haryana | Sakshi
Sakshi News home page

కలిస్తే గెలుస్తారు!

Published Thu, Apr 18 2019 4:47 AM | Last Updated on Thu, Apr 18 2019 8:31 AM

Cong-AAP alliance called off over disagreement on tie-up in Haryana - Sakshi

రాజధాని ఢిల్లీలో పొత్తుల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్‌.. అరవింద్‌ కేజ్రీవాల్‌కు చెందిన ఆప్‌ మధ్య నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో మాత్రమే ఆప్‌తో చేతులు కలపడానికి కాంగ్రెస్‌ సుముఖంగా ఉంటే, హరియాణా, చండీగఢ్‌లో కూడా పొత్తు ఉండాలని ఆప్‌ డిమాండ్‌ చేస్తోంది. ఆరో దశలో భాగంగా మే 12న ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నామినేషన్లకు నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. ఈ నెల 23 వరకు నామినేషన్లకు తుది గడువు ఉంది.

ఇరు పార్టీల్లో పొత్తుల విషయమై ట్విట్టర్‌ మాధ్యమంగా యుద్ధం నడుస్తోందే తప్ప కొలిక్కి రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆప్‌కి స్నేహ హస్తం అందించడమే కాదు, ఏడు సీట్లలో నాలుగు ఇవ్వడానికి అంగీకరించారు. కానీ ఢిల్లీతో పాటుగా హరియాణా, చండీగఢ్‌లో పొత్తు ఉంటేనే తాము చేయి కలుపుతామని ఆప్‌ పట్టు పడుతోంది. ఢిల్లీలో పొత్తు వరకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని రాహుల్‌ అంటోంటే, ‘హరియాణలో 10 సీట్లు, చండీగఢ్‌లో ఒక ఎంపీ సీటు ఉన్నాయి. వాటిలో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్‌కి ఫర్వాలేదా’ అంటూ ఆప్‌ నేత గోపాల్‌ రాయ్‌ ఎదురు ప్రశ్నిస్తున్నారు.

హరియాణాలో ‘ఊడ్చే’ సీన్‌ లేదు
ఆప్‌–కాంగ్రెస్‌ ఢిల్లీలో కలిసి పోటీ చేస్తే బీజేపీని ఓడించే అవకాశాలు మెండుగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ హరియాణా, చండీగఢ్‌లో ఆ పరిస్థితి లేదు. అందుకే కాంగ్రెస్‌ ఢిల్లీలో పొత్తుకి ప్రతిఫలంగా హరియాణా, చండీగఢ్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌తో చేతులు కలపడానికి సిద్ధంగా లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మూడు పార్టీలూ విడివిడిగానే పోటీ చేశాయి. ఏడు నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కంటే ఆప్, కాంగ్రెస్‌లకు పడిన ఓట్లు ఎక్కువ.

గత ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలో క్లీన్‌ స్వీప్‌ చేసింది. అదే హరియాణా రాష్ట్రాన్ని తీసుకుంటే ఆప్, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేసినా గొప్ప ఫలితాలేవీ దక్కలేదు. ఎన్డీయే కూటమి కంటే రోహ్తక్, సిర్సా స్థానాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు రాబట్టింది. రోహ్తక్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పరమైతే, సిర్సా స్థానంలో నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్డీ) గెలుపొందింది. ఆప్‌ ఒక్కటంటే ఒక్క సీటూ సాధించలేక చతికిలబడింది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ కంటే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కి వచ్చిన ఓట్లు చాలా తక్కువ. ఆప్‌ లోక్‌సభ ఎన్నికల పరాభవం నుంచి తేరుకోలేక పోటీకే దూరంగా ఉంది.

ఎన్డీయే, కాంగ్రెస్, ఆప్‌ బలాబలాలను చూస్తే హరియాణా, చండీగఢ్‌ కంటే ఢిల్లీలో ఈ రెండు పార్టీలు కలిస్తేనే కమలనాథులకు చెక్‌ పెట్టవచ్చుననే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ, పంజాబ్‌లో బలం పెంచుకున్నట్టుగా హరియాణాలో ఆప్‌ పుంజుకోలేదు. వాస్తవానికి ఢిల్లీలో ఆప్‌కున్న ఓట్ల బలమంతా ఒకప్పుడు కాంగ్రెస్‌దే. బీజేపీకి తన ఓటు బ్యాంకు ఉండనే ఉంది. అందుకే ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్‌ కలిస్తే బీజేపీ హవాను అడ్డుకోవచ్చు. ఇక హరియాణాలో కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా ఒరిగేదేమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి సమయం కూడా మించిపోతుండటంతో ఈ రెండు పార్టీలు ఏ దిశగా అడుగులు వేస్తాయో చూడాలి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement