క్రేజీ కేజ్రీవాల్‌ | Arvind Kejriwal influence the mindset | Sakshi
Sakshi News home page

క్రేజీ కేజ్రీవాల్‌

Published Tue, Apr 23 2019 2:52 AM | Last Updated on Tue, Apr 23 2019 2:52 AM

Arvind Kejriwal influence the mindset - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వైఖరి ఆయన చెప్పే మాటలకు అనుగుణంగా లేదు. బీజేపీని ఓడించడమే నిజంగా ఆయన లక్ష్యమైతే కాంగ్రెస్‌తో ఏదో ఒక రకంగా సీట్ల సర్దుబాటుకు ఆప్‌ అంగీకరించాలి. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుకు హరియాణా, చండీగఢ్‌లో సీట్ల సర్దుబాటుకు ఆయన ముడి పెడతున్నారు. ఈ రెండుచోట్లా తమకు కాంగ్రెస్‌ సీట్లు వదలకపోతే ఢిల్లీలో ఆప్‌ ఒంటరిగా పోటీ చేస్తుందని ముందే కేజ్రీవాల్‌ చెప్పేశారు.

పొత్తులు పలు విధాలు..
పార్టీల మధ్య పొత్తులు రాష్ట్రాల వారీగా ఉంటాయనేది ఇప్పటికీ వర్తించే సూత్రం. ఈ లెక్కన బీజేపీని బలహీనం చేయాలన్న తన వైఖరికి అనుగుణంగా ఆయన వ్యవహరించడం లేదని ఇటీవల పరిణామాలు చెబుతున్నాయి. హరియాణాలో కాంగ్రెస్, జన నాయక్‌ జనతా పార్టీ (జేపీపీ), ఆప్‌ చేతులు కలిపి పోటీ చేస్తే బీజేపీని సునాయాసంగా ఓడించవచ్చన్న కేజ్రీవాల్‌ మాట నిజమే. అయితే, ఎన్నికల్లో పొత్తులు గరిష్ట స్థాయిలో కుదరవు. పశ్చిమబెంగాల్‌లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ మధ్య చర్చలు జరిగినా సీట్ల సర్దుబాటు జరగలేదు. బీజేపీ ఉమ్మడి శత్రువు అయినా కేరళలో అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఇంత జరిగినా ఈ పార్టీలు తమిళనాడులో డీఎంకే నాయకత్వంలోని కూటమిలో చక్కగా భాగస్వాములయ్యాయి. బిహార్, ఝార్ఖండ్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌ మధ్య సయోధ్య కుదిరింది. కాని, ఝార్ఖండ్‌లోని ఒక్క చాత్రా సీటు విషయంలో పేచీ వచ్చి రెండు పార్టీలూ అభ్యర్థులను నిలిపాయి.

యూపీలో మహాగఠ్‌ బంధన్‌తో కాంగ్రెస్‌ ‘అవగాహన’
ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ తమ మహాగఠ్‌ బంధన్‌లో కాంగ్రెస్‌కు స్థానం కల్పించలేదు. అయితే, కాంగ్రెస్‌పై ఈ కూటమి రెండు సీట్లలో పోటీ పెట్టలేదు. కూటమికి చెందిన బడా నేతలు పోటీ చేస్తున్న ఏడు సీట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలపలేదు. ఈ రకంగా కాంగ్రెస్‌తో మహాగఠ్‌ బంధన్‌కు అవగాహన కుదిరింది. అంటే వివిధ రాజకీయ పక్షాల మధ్య పొత్తులు ఎప్పుడు, ఎక్కడ కుదురుతాయన్న విషయం ఆ పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకచోట కుదిరిన సీట్ల సర్దుబాటు మరోచోట సాధ్యం కాకపోవచ్చు. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు అవసరంపై రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకురాలు షీలా దీక్షిత్‌కు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నచ్చచెప్పగలిగారు. కాని, హరియాణాలో ఆప్‌ మిత్రపక్షమైన చౌటాలాల పార్టీ జేపీపీకి మూడు సీట్లు ఇప్పించడం ఆయనకు అంత తేలిక కాదు.

కాంగ్రెస్‌తో పొత్తు కోరుకుంటున్నామంటూనే ఆప్‌ ఎందుకు రోజుకో రకంగా షరతులు పెడుతోంది? అనే ప్రశ్న తలెత్తుతుంది. అలాంటప్పుడు కాంగ్రెస్‌ కేజ్రీవాల్‌ కోరినట్టే సీట్లు ఇవ్వాలని ఎందుకు అనుకుంటుంది? వాస్తవానికి ఈ ఏడాది ఆఖరులో లేదా 2020 జనవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల్లో మరోసారి విజయం సాధించడానికి ఏం చేయాలో ఆప్‌ అదే చేస్తోంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్ల కన్నా మళ్లీ రాజధాని ప్రాంతంలో గద్దెనెక్కడానికే ఆప్‌ ప్రా«ధాన్యం ఇస్తోంది. ఢిల్లీలో తమ మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోవడానికి కాంగ్రెసే కారణం కానీ, తాను కాదని ఇతరులను నమ్మించడానికి ఆప్‌ గట్టి కృషే చేస్తోంది. దేశ రాజధానిలోని ఏడు సీట్లనూ వీలైతే గెలుచుకోవడం ద్వారా బీజేపీని కొంత వరకైనా నిలువరించడమే కాంగ్రెస్‌ ఉద్దేశం. అందుకే చివరి క్షణం వరకూ ఆప్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement