అధికారం మాదే | Congress will scrap Niti Aayog if voted to power | Sakshi
Sakshi News home page

అధికారం మాదే

Published Sat, Mar 30 2019 4:34 AM | Last Updated on Sat, Mar 30 2019 4:34 AM

Congress will scrap Niti Aayog if voted to power - Sakshi

న్యూఢిల్లీ: డొల్ల వాగ్దానాలతో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న రాజకీయాల్ని దేశ ప్రజలు తిరస్కరించారని, ఈసారి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.   ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తామని చెప్పారు. ఉద్యోగ కల్పన, వ్యవసాయ సంక్షోభ పరిష్కారం, విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసేలా అందులో చర్యలు ప్రకటిస్తామని తెలిపారు. ఆర్థిక రంగ పరిపుష్టానికి కూడా రోడ్‌మ్యాప్‌ను తయారుచేస్తామని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సోదరి ప్రియాంక గాంధీ పోటీచేయాలని పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్లపై స్పందిస్తూ..ఎన్నికల్లో బరిలోకి దిగడంపై ఆమెనే ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాహుల్‌ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

ప్రజల గొంతుక వింటాం..
బీజేపీ–ఆరెస్సెస్‌లు తమ అభిప్రాయాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతుంటే కాంగ్రెస్‌ మాత్రం ప్రజలు చెప్పేది వింటుంది. భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన, వ్యవసాయ రంగ పరివర్తన, చిన్నస్థాయి వ్యాపారాలకు దన్నుగా నిలవడంతో పాటు, ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేలా మా మేనిఫెస్టో ఉంటుంది. పరిశ్రమలకు పన్నుల బెడదను తప్పించడంతో పాటు చిన్న, మధ్యస్థాయి వ్యాపారులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాం. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెరిగితే సామాన్యుడికి మేలు జరుగుతుంది. మోదీ బూటకపు వాగ్దానాలు, బీజేపీ వైఫల్యాలు లాంటివే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలైనా, మా ప్రణాళికలు, దేశానికి సంబంధించి మా దార్శనికత గురించి పంచుకోవడానికి చాలా ఉంది. 2014లో ఓటమి అనంతరం అధికార వికేంద్రీకరణతో పార్టీని సరికొత్తగా తీర్చిదిద్దాం.

మోదీ హామీ వల్లే ‘న్యాయ్‌’ ఆలోచన
2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చేసిన వాగ్దానం వల్లే కనీస ఆదాయ హామీ పథకం ఆలోచన తనకు వచ్చిందన్నారు. దేశంలోని నిరుపేద కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.72 వేలు జమచేసే న్యాయ్‌ పథకం ప్రకటించగానే మోదీలో కలవరపాటు మొదలైందన్నారు. మేమొస్తే నీతి ఆయోగ్‌ను రద్దుచేసి ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 2015లో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీతిఆయోగ్‌తో అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని, ప్రధాని మోదీకి ప్రచారం చేస్తూ సమాచారాన్ని వక్రీకరించడానికే పరిమితమైందని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement