‘పెద్దన్న’పై మరో ప్రతిచర్య
న్యూఢిల్లీ/వాషింగ్టన్: దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్టు విషయంలో భారత్ మరో ప్రతిచర్యకు దిగనుంది. వీసా అక్రమాల ఆరోపణలతో దేవయానిని అరెస్టు చేసిన న్యూయార్క్ పోలీసులు... ఆ కేసును ఉపసంహరించుకోవడానికి, ఆమెకు క్షమాపణలు చెప్పేందుకు భారత్ ఈనెల 13 వరకు గడువు విధించింది.
అప్పటికీ అమెరికా స్పందించకపోతే 16వ తేదీ నుంచి భారత్‌లోనున్న అమెరికా దౌత్య కార్యాలయాల పరిసరాల్లో నిర్వహిస్తున్న వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మన దేశంలోని నాలుగు అమెరికా దౌత్య కార్యాలయాల పరిసరాల్లో రెస్టారెంట్/బార్, వీడియో క్లబ్, బౌలింగ్ అల్లే, క్రీడా సముదాయం, ఈత కొలను, బ్యూటీ పార్లర్, జిమ్ తదితర వాణిజ్య కార్యకలాపాలను అమెరికా కమ్యూనిటీ సపోర్ట్ అసోసియేషన్ (ఏసీఎస్‌ఏ) నిర్వహిస్తోంది.
వీటిలో దౌత్యేతర వ్యక్తులకు, వారి కుటుంబాల సహా ప్రైవేట్ అమెరికా పౌరులకు అందిస్తున్న వాణిజ్య సేవలకు సంబంధించి టాక్స్ రిటర్న్‌లను సంబంధిత భారత విభాగాలకు సమర్పించాలని ఇప్పటికే అమెరికాను ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇలా దౌత్యేతర వ్యక్తులకు వాణిజ్య సేవలు అందించడం దౌత్య సంబంధాలపై వియన్నా ఒడంబడిక-1961లోని అధికరణ 41(3)కు విరుద్ధమని ప్రస్తావిస్తున్నాయి. తన ఇంటిలో పనిమనిషి సంగీతా రిచర్డ్ వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయాని ఖోబ్రగడేని గత నెల 12న న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేయడం విదితమే.
చర్యలు సమంజసమే: ఖుర్షీద్
దౌత్యవేత్త దేవయాని విషయంలో అమెరికా దౌత్య కార్యాలయాలపై ప్రతిచర్యలకు భారత్ ప్రభుత్వం దిగడాన్ని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమర్థించారు. భారత్ ఏమైనా చేయడానికి సిద్ధమని చెప్పడానికి అదొక హెచ్చరిక మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ప్రవాిసీ భారతీయ దివస్ కార్యక్రమంలో మాట్లాడారు.