‘తలాక్’ మతపరమైనదా? కాదా?
ఇస్లాం ప్రాథమికాంశాల్లో దీని ప్రస్తావనపై చర్చిస్తాం : సుప్రీంకోర్టు
► బహుభార్యత్వాన్ని స్పృశించం
► నిఖా హలాలాపైనా విచారణ
► ట్రిపుల్ తలాక్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం
► ఇస్లాం దేశాల్లో ట్రిపుల్ తలాక్ లేదు: పిటిషనర్లు
► భార్యాభర్తల రాజీతోనే తలాక్ అన్న సల్మాన్ ఖుర్షీద్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా పద్ధతుల రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. ఈ సంప్రదాయం ఇస్లాం ప్రాథమికాంశమా? కాదా? అనే అంశంపైనే మొదటగా చర్చ జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ‘ట్రిపుల్ తలాక్ సంస్కారబద్ధమైనదేనా? ముస్లింల ప్రాథమిక హక్కుగా దీన్ని అమలుచేయవచ్చా? అనే అంశాలపైనే ప్రాథమికంగా చర్చ జరగనుంది. ఒకవేళ ట్రిపుల్ తలాక్ ఇస్లాంలోని మూలసూత్రమే అని నిర్థారణ అయితే అప్పుడు దీని రాజ్యాంగ బద్ధతను కోర్టు ప్రశ్నించదు.
కానీ రాజ్యాంగం ప్రకారం ముస్లింల ప్రాథమిక హక్కుగా ట్రిపుల్ తలాక్‌ను భావించొచ్చా అనే అంశంపైనా చర్చ జరుగుతుంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ముస్లింలలోని బహుభార్యత్వానికి ట్రిపుల్ తలాక్‌తో సంబంధం లేనందున ఈ అంశాన్ని చర్చించదలచుకోలేదని వెల్లడించింది. సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్ (సిక్కు) తోపాటుగా జస్టిస్ కురియన్ జోసెఫ్ (క్రిస్టియన్), జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్ (పార్శీ), జస్టిస్ యుయు లలిత్ (హిందు), జస్టిస్ అబ్దుల్ నజీర్ (ముస్లిం) (ఒక్కో మతం నుంచి ఒక్కరు చొప్పున) ఈ రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.
ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకం
పిటిషనర్లలో ఒకరైన సైరా బానో తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ సింగ్ చద్దా ట్రిపుల్ తలాక్‌పై వాదనలు ప్రారంభించారు. ఈ సంప్రదాయం ఇస్లాం ప్రాథమికాంశం కాదని.. దీన్ని తొలగించవచ్చని తెలిపారు. మన పొరుగు ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అనుసరిస్తున్న విధానాలను ఆయన గుర్తుచేస్తూ.. ట్రిపుల్ తలాక్ ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. ఈ అంశంలో కోర్టుకు సహాయకారిగా ఉన్న సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అసలు ట్రిపుల్ తలాక్ వివాదమే కాదని.. భార్య, భర్తల మధ్య రాజీతోనే విడాకులకు మంజూరవుతాయన్నారు.
అయితే రాజీ తర్వాత జరిగే ట్రిపుల్ తలాక్‌లన్నీ వ్యవస్థ ప్రకారమే జరుగుతున్నాయా అన్న ధర్మాసనం ప్రశ్నకు ఖుర్షీద్ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తరపున వాదిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కూడా ఖుర్షీద్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. ‘సమానత్వం కోసం ముస్లిం మహిళలకు పోరాటం’ అంశంపైనా చర్చించనున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది.
తలాక్ సందర్భంగా ముస్లిం మహిళలు లింగవివక్షకు గురవుతున్నారా? అని కూడా కోర్టు ప్రశ్నించింది. నిఖా హలాలా (భార్యాభర్తల మధ్య తలాక్ అయిన తర్వాత మళ్లీ ఆమెనే భర్త పెళ్లి చేసుకోవాలనుకుంటే.. అంతకుముందు భార్యకు వేరే వ్యక్తితో వివాహం జరిపి తలాక్ తీసుకోవాలి. ఇది షియా సంప్రదాయంలో మాత్రమే అమలవుతోంది) పైనా విచారణ జరపనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.
రెండుగా చీలిన ఇస్లాం సమాజం
సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్‌పై చర్చతో ఇస్లాంలోని సంప్రదాయవాదులు, సంస్కరణలను కోరుకునేవారి మధ్య స్పష్టమైన అంతరం కనిపించింది. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాన్ని మత సమావేశాల్లోనే చర్చించుకోవాలని ఓ వర్గం.. ముస్లిం మహిళలను న్యాయవ్యవస్థ ద్వారానే న్యాయం జరుగుతుందని మరోవర్గం తమ అభిప్రాయాలను తెలిపాయి. ‘ఇస్లాం ప్రవక్తలు గొప్పవారా? కొందరు ముల్లాల చేతుల్లోని ఇస్లాం గొప్పదా? అనే అంశం తేలిపోయే సమయం ఆసన్నమైంది. చాలా ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాక్‌ను ఎప్పుడో పక్కనపెట్టేశాయి.
షియా సంప్రదాయంలో ట్రిపుల్ తలాక్‌కు చోటు లేదు’ అని ఆలిండియా షియా పర్సనల్ లాబోర్డు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ముస్లిం మహిళలకు మంచిరోజులు ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు ఆలిండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు షియాస్తా అంబర్ తెలిపారు. అయితే కొందరు మతపెద్దలు మాత్రం ఈ అంశాన్ని తెరపైకి తేవటంలో రాజకీయ కుట్రకోణం దాగుందని విమర్శించారు.
ముస్లిం సమాజం ఇలాంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు మరింత సమయం ఇవ్వాలని ఆలిండియా ముస్లిం మజ్లిసే ముషావరాత్ అభిప్రాయపడింది. ట్రిపుల్ తలాక్ ‘ముస్లిం పర్సనల్ లా’లో భాగమని అయితే దీన్ని దుర్వినియోగం చేయటం పాపమని ఏఐఎంపీఎల్‌బీ తెలిపింది. కేవలం 0.1 శాతం మంది మాత్రమే దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించింది. అయితే ట్రిపుల్ తలాక్‌ను మత విశ్వాసం కన్నా సామాజిక రుగ్మతగా చూడాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు.