సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఏకమయ్యే విపక్షాలు ఎవరి నాయకత్వాన పోరాడుతాయో త్వరగా తేల్చుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సూచించారు. ఎన్నికల అనంతరం నంబర్ గేమ్, రాయబేరాల చుట్టూ రాజకీయాలు తిరిగే అవకాశం ఉన్నందున ఎన్నికలకు ముందే విపక్ష పార్టీలు అవగాహనకు రావాలని ఆకాంక్షించారు. ఎన్నికలకు ముందే పొత్తులపై విపక్షాలు అవగాహనకు రావాలని అన్నారు. విపక్ష శిబిరంలో విభేదాలు సృష్టించేందుకు బీజేపీ కుయుక్తులకు పాల్పడే అవకాశం ఉన్నందున తగిన సమయంలో నాయకత్వంపై ఓ నిర్ణయానికి రావాలని విపక్షాలకు సూచించారు.
‘మనందరికీ (విపక్షాలు) మన నాయకుడే కీలకం.. విపక్షాలను ముందుకు నడిపే పార్టీగా కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందువరుసలో ఉంటుంద’ని అన్నారు. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ నాయకత్వ అంశంపై విపక్షాలన్నీ త్వరలో ఓ నిర్ణయానికి రావాలని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో సంకీర్ణం అవసరమని అభిప్రాయపడ్డారు. సంకీర్ణంపై ఏకాభిప్రాయం ఉంటే..ఆ దిశగా సంకీర్ణ సర్కార్ దిశగా విపక్షాలు అడుగులు వేయాలని పిలుపు ఇచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఉద్వేగభరిత ప్రసంగాలను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు బదులిస్తూ తమకూ మంచి కథలు చెప్పే వక్త కావాలని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment