వివాదానికి పరిష్కారం కనుగొంటాం: సల్మాన్ ఖుర్షీద్
న్యూఢిల్లీ: భారత్ - అమెరికాలు పరస్పర వ్యవహారాల్లో మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను ఇరు దేశాలూ గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుందని.. రెండు దేశాల మధ్య సంబంధాలను పరిరక్షించటం ముఖ్యమని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. భారత దౌత్యవేత్త దేవయాని అరెస్ట్ వివాదానికి ఒక పరిష్కారం కనుగొంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘కేవలం ప్రభుత్వాలే కాకుండా, ప్రయివేటు రంగం, వ్యక్తుల బృందాలు, సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టిన సంబంధాలివి.
పరస్పర వ్యవహారాల్లో రెండు పక్షాలూ ఈ భిన్నమైన కోణాలను గమనంలో ఉంచుకోవాలని నేను భావిస్తున్నా. న్యూయార్క్‌లో భారత దౌత్యవేత్త పట్ల అమెరికా బాధించే విధంగా, అవమానకరంగా వ్యవహరించినప్పటికీ.. మేము రెండు దేశాల మధ్య ఉన్న విలువైన సంబంధాలను గమనంలోనే ఉంచుకున్నాం. వారు కూడా గమనంలో ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నా’’ అని ఖుర్షీద్ పేర్కొన్నారు. మరోవైపు.. భారతదేశంలో అమెరికా దౌత్యాధికారులకు తాము ఎలాంటి గౌరవమర్యాదలు అందిస్తున్నామో.. అమెరికా కూడా తన దేశంలోని భారత దౌత్యాధికారులతో అలాగే వ్యవహరించాలని భారత విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ సూచిం చారు. ఆమె శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేవయాని విషయంలో అమెరికా అధికారుల చర్యలను ఆమె తప్పుపట్టారు. ఒక సీనియర్ దౌత్యాధికారితో వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదన్నారు.