
దేవయాని కేసులో అమెరికాకు చుక్కెదురు
న్యూయార్క్ భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే కేసులో అగ్రరాజ్యం అమెరికాకు చుక్కెదురు అయ్యింది. ఆమెపై నమోదు అయిన ఆరోపణణలను న్యూయార్క్ కోర్టు కొట్టేసింది. భవిష్యత్లో ఎలాంటి అభియోగాలను నమోదు చేయొద్దంటూ న్యాయస్థానం రూలింగ్ ఇచ్చింది. దౌత్యాధికారిగా దేవయానికి పూర్తిస్థాయిలో రక్షణ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
వీసా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అమెరికాలోని న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేసిన దేవయాని ఖోబ్రాగాదే (39)ను డిసెంబర్ లో అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమార్తెను స్కూలు వద్ద దింపేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరూ చూస్తుండగానే చేతికి సంకెళ్లు వేసి తమ వెంట తీసుకెళ్లారు.
అనంతరం మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో ఆమెను హాజరు పరచగా న్యాయస్థానం 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 1.55 కోట్లు) పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది. తన ఇంట్లో పనిచేస్తున్న మహిళకు సంబంధించిన వీసా పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపైనే ఖోబ్రాగాదేను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. దేవయాని గతేడాది న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో చేరారు. అంతకుముందు జర్మనీ, ఇటలీ, పాక్‌లలో పనిచేశారు.