
అమెరికా ద్వంద్వ నీతి
న్యూఢిల్లీ: తమ దేశ వేతన చట్టం నిబంధనలకన్నా భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే తన పనిమనిషికి తక్కువ జీతం ఇచ్చారనే అభియోగాలపై ఆమెను అరెస్టు చేసిన అమెరికా...భారత్‌లో మాత్రం ఈ నిబంధనను యధేచ్ఛగా ఉల్లంఘిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న భారత సిబ్బందికి, దౌత్యవేత్తలు వ్యక్తిగతంగా నియమించుకున్న పనిమనుషులకు అత్తెసరు జీతాలు ఇస్తున్నారని పేర్కొన్నాయి. న్యూయార్క్ సహా అమెరికాలోని మరే ఇతర నగరంలోనైనా రాయబార కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కనీస వేతనం గంటకు 9.47 డాలర్లు చెల్లించాలనే నిబంధన ఉండగా భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో డ్రైవర్లు, వంటమనుషులుగా పనిచేసే మన దేశ సిబ్బందికి నెలకు కేవలం రూ. 12 వేల నుంచి 15 వేల మధ్యే (అంటే 200 నుంచి 250 డాలర్లు) చెల్లిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి.
భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్లు అమెరికా భూభాగం పరిధిలోకి వస్తాయి కాబట్టి ఈ లెక్కన అమెరికా రాయబారులు వారి స్వదేశం రూపొందించిన కనీస వేతన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని ఆ వర్గాలు వివరించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 23లోగా సమర్పించాలంటూ మన విదేశాంగశాఖ అమెరికా రాయబార కార్యాలయాన్ని కోరినా ఇప్పటివరకూ స్పందించలేదని తెలిపాయి. మరోవైపు దేవయానిపై ఫిర్యాదు చేసిన పనిమనిషి సంగీతా రిచర్డ్‌ను స్వదేశానికి పంపాల్సిందిగా భారత్ కోరినా పట్టించుకోని అమెరికా...ఏకంగా సంగీత కుటుంబానికి టీ వీసాలు (మనుషుల అక్రమ రవాణా బాధిత కుటుంబాలకు ఇచ్చేవి) జారీ చేసి రప్పించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దేవయాని కేసు వ్యవహారంపై చర్చించేందుకు విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సోమవారం ఢిల్లీలో సమావేశం కానుంది. మన దేశ సిబ్బందికి అమెరికా రాయబార కార్యాలయాలు చెల్లిస్తున్న వేతనాల వివరాలనూ తనిఖీ చేయనుంది.