
అమెరికాతో దౌత్య వివాదం
భారత దౌత్యాధికారి (డిప్యూటీ కాన్సుల్ జనరల్) దేవయాని ఖోబ్రాగడెను వీసా అక్రమాల ఆరోపణలపై అరెస్టుచేసిన అమెరికా.. ఆమెతో అత్యంత అవమానకరంగా వ్యవహరించటంపై భారత్ కన్నెర్ర చేయటం, తీవ్రంగా స్పందిస్తూ ప్రతిచర్యలకు దిగటం.. అగ్రరాజ్యం అమెరికాకే కాదు మన దేశ దౌత్యనిపుణులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతిపక్షాల నుంచి తరచూ తీవ్ర దాడిని ఎదుర్కొనే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో మాత్రం ప్రశంసలు అందాయి. గతంలోనూ భారత దౌత్యాధికారులకు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం వంటి అత్యంత ప్రముఖులకు పలుమార్లు ఇటువంటి అవమానాలు ఎదురైనప్పటికీ.. సాధారణంగా నసుగుడు స్వరంతో నిరసన తెలిపి సరిపుచ్చే భారత్.. ఈసారి తీవ్రంగా ప్రతిస్పందించటం కొట్టొచ్చినట్లు కనిపించిన మార్పు. ఉన్నతస్థాయి అధికారి అయిన దేవయానికి దౌత్యరక్షణ ఉందన్న విషయాన్ని విస్మరించి మరీ.. డిసెంబర్ 12వ తేదీన సాధారణ నేరస్థులను అరెస్టుచేసినట్లు ఆమెకు నడిరోడ్డుపై సంకెళ్లు వేసి మరీ అమెరికా పోలీసులు అరెస్ట్‌చేశారు. రెండున్నర లక్షల డాలర్ల పూచీకత్తుతో ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు.
భారత్ నుంచి దేవయాని ఇంట్లో పని మనిషిగా వచ్చిన సంగీతఫిలిప్స్ వీసా విషయంలో దేవయాని అక్రమాలకు పాల్పడ్డారని, ఆమెకు అమెరికా చట్టాల ప్రకారం చెల్లించాల్సిన వేతనాలను చెల్లించకుండా వేధిస్తున్నారని దేవయానిపై అమెరికా మోపిన అభియోగాలు. ఈ ఉదంతంపై భారత్ అనూహ్యంగా స్పందించింది. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి భద్రత తగ్గించివేసింది. బారికేడ్లను తొలగించింది. మరోవైపు దేవయానిని న్యూయార్క్ ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌కు బదిలీ చేసి పూర్తిస్థాయి దౌత్యరక్షణ కల్పించింది. భారత్ అనూహ్య స్పందనతో కంగుతిన్న అమెరికా.. ఈ దౌత్యవివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఒప్పుకుంది. ఫలితంగా కేసు విచారణకు దేవయాని హాజరుకాకుండా మినహాయింపు లభించింది.