Devyani Khobragade case
-
దేవయాని కేసులో అమెరికాకు చుక్కెదురు
న్యూయార్క్ భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే కేసులో అగ్రరాజ్యం అమెరికాకు చుక్కెదురు అయ్యింది. ఆమెపై నమోదు అయిన ఆరోపణణలను న్యూయార్క్ కోర్టు కొట్టేసింది. భవిష్యత్‌లో ఎలాంటి అభియోగాలను నమోదు చేయొద్దంటూ న్యాయస్థానం రూలింగ్ ఇచ్చింది. దౌత్యాధికారిగా దేవయానికి పూర్తిస్థాయిలో రక్షణ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. వీసా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అమెరికాలోని న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేసిన దేవయాని ఖోబ్రాగాదే (39)ను డిసెంబర్ లో అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమార్తెను స్కూలు వద్ద దింపేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరూ చూస్తుండగానే చేతికి సంకెళ్లు వేసి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో ఆమెను హాజరు పరచగా న్యాయస్థానం 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 1.55 కోట్లు) పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది. తన ఇంట్లో పనిచేస్తున్న మహిళకు సంబంధించిన వీసా పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపైనే ఖోబ్రాగాదేను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. దేవయాని గతేడాది న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో చేరారు. అంతకుముందు జర్మనీ, ఇటలీ, పాక్‌లలో పనిచేశారు. -
అమెరికా ద్వంద్వ నీతి
న్యూఢిల్లీ: తమ దేశ వేతన చట్టం నిబంధనలకన్నా భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే తన పనిమనిషికి తక్కువ జీతం ఇచ్చారనే అభియోగాలపై ఆమెను అరెస్టు చేసిన అమెరికా...భారత్‌లో మాత్రం ఈ నిబంధనను యధేచ్ఛగా ఉల్లంఘిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న భారత సిబ్బందికి, దౌత్యవేత్తలు వ్యక్తిగతంగా నియమించుకున్న పనిమనుషులకు అత్తెసరు జీతాలు ఇస్తున్నారని పేర్కొన్నాయి. న్యూయార్క్ సహా అమెరికాలోని మరే ఇతర నగరంలోనైనా రాయబార కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కనీస వేతనం గంటకు 9.47 డాలర్లు చెల్లించాలనే నిబంధన ఉండగా భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో డ్రైవర్లు, వంటమనుషులుగా పనిచేసే మన దేశ సిబ్బందికి నెలకు కేవలం రూ. 12 వేల నుంచి 15 వేల మధ్యే (అంటే 200 నుంచి 250 డాలర్లు) చెల్లిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్లు అమెరికా భూభాగం పరిధిలోకి వస్తాయి కాబట్టి ఈ లెక్కన అమెరికా రాయబారులు వారి స్వదేశం రూపొందించిన కనీస వేతన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని ఆ వర్గాలు వివరించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 23లోగా సమర్పించాలంటూ మన విదేశాంగశాఖ అమెరికా రాయబార కార్యాలయాన్ని కోరినా ఇప్పటివరకూ స్పందించలేదని తెలిపాయి. మరోవైపు దేవయానిపై ఫిర్యాదు చేసిన పనిమనిషి సంగీతా రిచర్డ్‌ను స్వదేశానికి పంపాల్సిందిగా భారత్ కోరినా పట్టించుకోని అమెరికా...ఏకంగా సంగీత కుటుంబానికి టీ వీసాలు (మనుషుల అక్రమ రవాణా బాధిత కుటుంబాలకు ఇచ్చేవి) జారీ చేసి రప్పించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దేవయాని కేసు వ్యవహారంపై చర్చించేందుకు విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సోమవారం ఢిల్లీలో సమావేశం కానుంది. మన దేశ సిబ్బందికి అమెరికా రాయబార కార్యాలయాలు చెల్లిస్తున్న వేతనాల వివరాలనూ తనిఖీ చేయనుంది. -
అమెరికాతో దౌత్య వివాదం
భారత దౌత్యాధికారి (డిప్యూటీ కాన్సుల్ జనరల్) దేవయాని ఖోబ్రాగడెను వీసా అక్రమాల ఆరోపణలపై అరెస్టుచేసిన అమెరికా.. ఆమెతో అత్యంత అవమానకరంగా వ్యవహరించటంపై భారత్ కన్నెర్ర చేయటం, తీవ్రంగా స్పందిస్తూ ప్రతిచర్యలకు దిగటం.. అగ్రరాజ్యం అమెరికాకే కాదు మన దేశ దౌత్యనిపుణులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతిపక్షాల నుంచి తరచూ తీవ్ర దాడిని ఎదుర్కొనే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో మాత్రం ప్రశంసలు అందాయి. గతంలోనూ భారత దౌత్యాధికారులకు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం వంటి అత్యంత ప్రముఖులకు పలుమార్లు ఇటువంటి అవమానాలు ఎదురైనప్పటికీ.. సాధారణంగా నసుగుడు స్వరంతో నిరసన తెలిపి సరిపుచ్చే భారత్.. ఈసారి తీవ్రంగా ప్రతిస్పందించటం కొట్టొచ్చినట్లు కనిపించిన మార్పు. ఉన్నతస్థాయి అధికారి అయిన దేవయానికి దౌత్యరక్షణ ఉందన్న విషయాన్ని విస్మరించి మరీ.. డిసెంబర్ 12వ తేదీన సాధారణ నేరస్థులను అరెస్టుచేసినట్లు ఆమెకు నడిరోడ్డుపై సంకెళ్లు వేసి మరీ అమెరికా పోలీసులు అరెస్ట్‌చేశారు. రెండున్నర లక్షల డాలర్ల పూచీకత్తుతో ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు. భారత్ నుంచి దేవయాని ఇంట్లో పని మనిషిగా వచ్చిన సంగీతఫిలిప్స్ వీసా విషయంలో దేవయాని అక్రమాలకు పాల్పడ్డారని, ఆమెకు అమెరికా చట్టాల ప్రకారం చెల్లించాల్సిన వేతనాలను చెల్లించకుండా వేధిస్తున్నారని దేవయానిపై అమెరికా మోపిన అభియోగాలు. ఈ ఉదంతంపై భారత్ అనూహ్యంగా స్పందించింది. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి భద్రత తగ్గించివేసింది. బారికేడ్లను తొలగించింది. మరోవైపు దేవయానిని న్యూయార్క్ ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌కు బదిలీ చేసి పూర్తిస్థాయి దౌత్యరక్షణ కల్పించింది. భారత్ అనూహ్య స్పందనతో కంగుతిన్న అమెరికా.. ఈ దౌత్యవివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఒప్పుకుంది. ఫలితంగా కేసు విచారణకు దేవయాని హాజరుకాకుండా మినహాయింపు లభించింది. -
వివాదానికి పరిష్కారం కనుగొంటాం: సల్మాన్ ఖుర్షీద్
న్యూఢిల్లీ: భారత్ - అమెరికాలు పరస్పర వ్యవహారాల్లో మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను ఇరు దేశాలూ గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుందని.. రెండు దేశాల మధ్య సంబంధాలను పరిరక్షించటం ముఖ్యమని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. భారత దౌత్యవేత్త దేవయాని అరెస్ట్ వివాదానికి ఒక పరిష్కారం కనుగొంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘కేవలం ప్రభుత్వాలే కాకుండా, ప్రయివేటు రంగం, వ్యక్తుల బృందాలు, సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టిన సంబంధాలివి. పరస్పర వ్యవహారాల్లో రెండు పక్షాలూ ఈ భిన్నమైన కోణాలను గమనంలో ఉంచుకోవాలని నేను భావిస్తున్నా. న్యూయార్క్‌లో భారత దౌత్యవేత్త పట్ల అమెరికా బాధించే విధంగా, అవమానకరంగా వ్యవహరించినప్పటికీ.. మేము రెండు దేశాల మధ్య ఉన్న విలువైన సంబంధాలను గమనంలోనే ఉంచుకున్నాం. వారు కూడా గమనంలో ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నా’’ అని ఖుర్షీద్ పేర్కొన్నారు. మరోవైపు.. భారతదేశంలో అమెరికా దౌత్యాధికారులకు తాము ఎలాంటి గౌరవమర్యాదలు అందిస్తున్నామో.. అమెరికా కూడా తన దేశంలోని భారత దౌత్యాధికారులతో అలాగే వ్యవహరించాలని భారత విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ సూచిం చారు. ఆమె శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేవయాని విషయంలో అమెరికా అధికారుల చర్యలను ఆమె తప్పుపట్టారు. ఒక సీనియర్ దౌత్యాధికారితో వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదన్నారు. -
దేవయానిని వదిలేసే ప్రసక్తే లేదు
వాషింగ్టన్: వీసా అక్రమాల అభియోగాలపై అరెస్టు చేసిన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగడేపై కేసును ఉపసంహరించుకోవాలని, ఆమెను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని భారతదేశం చేసిన డిమాండ్లను అమెరికా తోసిపుచ్చింది. దేవయానిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఆమెను విచారించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని శుక్రవారం స్పష్టంచేసింది. దేవయానిని ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత దౌత్య కార్యాలయానికి తరలించిన తర్వాత ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఉంటుందనటం.. అక్కడికి పంపించకముందు ఉన్న కేసులకు వర్తించదని విదేశాంగ శాఖ ప్రతినిధి మారీహార్ఫ్ శుక్రవారం వాషింగ్టన్లో మీడియాతో పేర్కొన్నారు. న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కౌన్సిల్ జనరల్‌గా పనిచేస్తున్న దేవయానిని ఈ నెల 12వ తేదీన అత్యంత అగౌరవంగా నడిరోడ్డుపై సంకెళ్లు వేసి అరెస్ట్ చేయటమే కాక, తనిఖీల పేరుతో కూడా తీవ్రంగా అవమానించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయాలు, దౌత్యాధికారులకు అందిస్తున్న భద్రతను, ప్రత్యేక సదుపాయాలను తగ్గించిన విషయమూ విదితమే. దేవయానిపై కేసును ఉపసంహరించాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమెరికాను భారత్ డిమాండ్ చేసింది. అయితే.. ‘‘దేవయానిపై ఆరోపణలను మేం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ ఆరోపణలపై కానీ, అభియోగాలపై కానీ మేం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇది చట్టపరమైన అంశం’’ అని మారీహార్ఫ్ ఉద్ఘాటించారు. ఒకవేళ దేవయానిపై ఆమె పనిమనిషి ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పటికీ తమ ప్రభుత్వం ఆమెపై అభియోగాలను ఉపసంహరించుకుంటుందని తాను చెప్పలేనన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీతో తన సంభాషణకు సమయాన్ని నిర్ణయించనున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్‌ఖుర్షీద్ చేసిన ప్రకటనతో హార్ఫ్ విభేదించారు. అటువంటి ప్రణాళిక ఏదీ ఇప్పటివరకూ లేదన్నారు. జాన్‌కెర్రీ ఫోన్ చేసినపుడు తాను అందుబాటులో లేనని, నేడో రేపో ఆయనతో తాను మాట్లాడతానని ఖుర్షీద్ మీడియాతో పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ.. కెర్రీ కుటుంబంతో కలసి సెలవులు గడపటం కోసం ఫిలిప్పీన్స్‌లో ఉన్నారని.. సెలవులు పూర్తయ్యాకే ఆయన వాషింగ్టన్ తిరిగి వస్తారని హార్ఫ్ వివరించారు. జూలై నుంచి భారత్‌తో చర్చిస్తున్నాం... చట్టాన్ని నిర్వచించటంలో అమెరికా, భారత్‌ల మధ్య తేడాలు ఉన్నాయని మారీహార్ఫ్ అంగీకరించారు. అయితే.. దేవయానిపై ఆమె పనిమనిషి సంగీత రిచర్డ్స్ చేసిన ఆరోపణల్లో భారత్ దర్యాప్తు వివరాలను తమకు తెలియజేయాలని, ఆరోపణలపై చర్చించేందుకు దేవయానిని తమకు అందుబాటులో ఉంచాలని తాము చేసిన డిమాండ్లను భారత్ నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అమెరికా ప్రభుత్వం తమను సంప్రదించలేదన్న భారత్ ఆరోపణను ఆమె తిరస్కరించారు. సంగీత తన యజమాని దేవయానికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి, తన న్యాయవాదితో కలసి విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసిన జూలై నెల నుంచి ఈ అంశమై ఇరు దేశాల ప్రభుత్వాల మధ్యా చర్చ నడుస్తోందని హార్ఫ్ పేర్కొన్నారు. అయితే.. పని మనిషి చేసిన ఆరోపణలు వివరిస్తూ, వీటిపై దర్యాప్తు చేయాలంటూ సెప్టెంబర్ 4వ తేదీన అమెరికా నుంచి ఒక లేఖ తప్పితే మరెలాంటి సమాచారమూ తమకు అందలేదని వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయం స్పష్టంచేసింది. సంగీత గురించి తాము అమెరికా ప్రభుత్వానికి చెందిన న్యూయార్క్ పోలీసు విభాగం, విదేశాంగ విభాగం, న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాలను పలుమార్లు సంప్రదించినప్పటికీ.. ఏ విభాగమూ స్పందించలేదని ఆరోపించింది. దర్యాప్తు మొదలైనందునే సమాధానం ఇవ్వలేదు... ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా మారీహార్ఫ్ బదులిస్తూ.. విదేశాంగ శాఖలోని బ్యూరో ఆప్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ దర్యాప్తు ప్రారంభించటం.. ఆ విభాగంతో పాటు, ఇతర విభాగాల అధికారులను కూడా.. భారత ప్రభుత్వం, ఆ దేశ విదేశాంగ శాఖ, ఆ దేశ రాయబార కార్యాలయం అడిగిన సమాచారం ఇవ్వకుండా నిరోధించిందని పేర్కొన్నారు. ‘‘బాధితురాలు (సంగీత)కు చెందిన న్యాయవాది నుంచి.. వీసా అక్రమాలు, ఇతర ఆరోపణలతో జూలై 9వ తేదీన మాకు నోటిఫికేషన్ అందింది. ఆ సమయంలో బ్యూరో ఆఫ్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ ఈ ఆరోపణలపై తన దర్యాప్తు ప్రారంభించాల్సిన బాధ్యత ఉంది. ఒకసారి దర్యాప్తు మొదలైతే.. మేం ప్రయివేటుగా కానీ, బహిరంగంగా కానీ ఏం చెప్పాలనేదానిపై పరిమితులు ఉంటాయి. మేం చట్టాన్ని సంపూర్ణంగా పాటించాలి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.