సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ పతనం ఆరంభమైందని, ఆ పార్టీకి 2014లో అధికారంలోకి వచ్చినప్పటి ఆదరణ తుడిచిపెట్టుకుపోతోందని సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. దళితుల నిరసనలు, రైతుల ఆందోళన, పలు కుంభకోణాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో బీజేపీ తిరిగి 2019లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి అత్యంత సంక్లిష్టమైనవని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో సామాజిక అశాంతి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు, దళితులపై బీజేపీ సాగిస్తున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఆయా వర్గాలు నిరసనలతో ముందుకొస్తున్నాయన్నారు. దళితుల నిరసనలు దేశం దృష్టిని ఆకర్షించాయని చెప్పారు. బీజేపీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందని, రాబోయే కర్ణాటక, రాజస్ధాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కాంగ్రెస్ దీటైన పోటీ ఇవ్వనుందన్నారు. ఈ మూడు రాష్ట్రాలూ కాంగ్రెస్ హస్తగతమవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు విపక్షాలు ఏకతాటిపైకి రావడం కీలకమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment