శిక్షించే కూటమిగా మార్చొద్దు: మహీంద రాజపక్స
కామన్వెల్త్ కూటమికి రాజపక్స సూచన
నాలుగేళ్లుగా లంకలో ఒక్క ఉగ్రవాద చర్యా లేదు
కొలంబో: కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల కూటమి (చోగమ్)ని.. దండించే కూటమిగానో, తీర్పు చెప్పే కూటమిగానో మార్చవద్దని శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స సూచించారు. మూడు రోజుల చోగమ్ శిఖరాగ్ర సదస్సు శ్రీలంక రాజధాని కొలంబోలో శుక్రవారం ప్రారంభమైంది. ఎల్‌టీటీఈపై పోరులో భాగంగా శ్రీలంకలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో శ్రీలంకలో జరుగుతున్న సదస్సును పలు సభ్యదేశాలు బహిష్కరించిన విషయం తెలిసిందే. తమిళనాడు పార్టీలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో భారత ప్రధానమంత్రి మన్మో హన్‌సింగ్ కూడా చోగమ్ సదస్సుకు దూరంగా ఉండగా.. భారత్ తరఫున విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరయ్యారు.
ఈ సదస్సులో రాజపక్స ప్రారంభోపన్యాసం చేస్తూ.. లంక తమిళులపై మానవ హక్కుల ఉల్లంఘన వివాదాలను, దానిపై పలు దేశాల వైఖరిని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘కామన్వెల్త్ అనేదానికి సమకాలీనత ఉండాలంటే.. ఈ కూటమి సభ్యులు ప్రజల అవసరాలకు స్పందించాలి కానీ.. కూటమిని శిక్షించేది గానో, తీర్పు చెప్పేది గానో మార్చకూడదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మానవ హక్కుల పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది. జీవించే హక్కును మేం పునరుద్ధరించాం. గత నాలుగేళ్లలో శ్రీలంకలో ఎక్కడా ఒక్క ఉగ్రవాద ఘటన కూడా చోటుచేసుకోలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.
సహకారం మరింత పెరగాలి: ప్రిన్స్ చార్లెస్
కామన్వెల్త్ అధినేత 87 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్-2 తరఫున హాజరైన ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్, రాజపక్సతో కలిసి చోగమ్ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని నెహ్రూ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఆర్థిక, సామాజిక, పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు కామన్వెల్త్ దేశాలు పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘సమకాలీన ప్రపంచ సమస్యలను ‘నయంచేయగల స్పర్శ’ను తీసుకువచ్చే సామర్థ్యం కామన్వెల్త్‌కు ఉంద’ని నాటి భారత ప్రధాని నెహ్రూ (కాకతాళీయంగా ఆయన జన్మదినం, నా జన్మదినం ఒకటే కావటం నాకు ఎంతో గర్వకారణం) ప్రకటించారు. 60 ఏళ్లకు పైగా గడిచిపోయిన తర్వాత.. మన ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను మనం మళ్లీ గుర్తుచేసుకోవాల్సిన అవసరం రాకూడదు’’ అని పేర్కొన్నారు. మొత్తం 53 సభ్యదేశాల చోగమ్ ప్రారంభ కార్యక్రమంలో కామన్వెల్త్ చైర్మన్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్, బ్రిటిష్ ప్రధాని కామెరాన్ సహా 23 దేశాల అధినేతలు, పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జాఫ్నాలో కామెరాన్
జాఫ్నా: శ్రీలంకలో ‘ఎల్‌టీటీఈపై యుద్ధం’తో అతలాకుతలమైన ఉత్తర ప్రాంతంలో బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ శుక్రవారం పర్యటించారు. 1948లో శ్రీలంకకు ఇంగ్లండ్ నుంచి స్వాతంత్య్రం లభించిన నాటి నుంచీ ఈ ప్రాంతంలో కాలు పెట్టిన తొలి విదేశాధినేత ఆయనే కావడం విశేషం! శ్రీలంక ప్రభుత్వం యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కామెరాన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.