సాక్షి, చెన్నై: కామన్వెల్త్ సమావేశాలను భారత్ బహిష్కరించాల్సిందేనన్న నినాదంలో రాష్ట్రంలో కొంతకాలంగా ఆందోళనలు సాగుతున్నాయి. అయితే సమావేశాలకు భారత్ వెళ్లనుందన్న సంకేతాలు ఇటీవల వెలువడ్డాయి. అదే సమయంలో శ్రీలంకలో జరిగిన మారణ హోమం లో ఇసై ప్రియ దారుణహత్యకు గురైన వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈలం తమిళులపై శ్రీలంక అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా కేంద్రం మాత్రం ఆ దేశానికి వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తుండడం తమిళులకు ఆగ్రహం కలిగిస్తోంది.
ఆందోళనబాట: కేంద్రం తీరును ఎండగట్టేందుకు తమిళాభిమాన సంఘాలు, విద్యార్థి సంఘాలు సిద్ధమయ్యా యి. ఆగ్రహ చిచ్చు ఆదివారం మరింతగా రాజుకుంది. విల్లుపురం, కడలూరు, మదురై, చెన్నైలో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. కడలూరులో తమిళాభిమాన సంఘాలు, విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. రాజపక్సే, మన్మోహన్ సింగ్‌లకు వ్యతిరేకంగా నినాదాల్ని హోరెత్తించారు. విల్లుపురం బస్టాండ్ ఆవరణలో ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో విద్యార్థులను అరెస్టు చేశారు.
మదురై, సమయనల్లూరులో వీసీకే నేతృత్వంలో నిరసనలు జరిగాయి. రైల్‌రోకకు యత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని పల్లావరం, క్రోంపేటలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పల్లావరంలో బీచ్ - తాంబరం లోకల్ రైలును అడ్డుకున్నారు. కామన్వెల్త్ సమావేశాలను భారత్ బహిష్కరించాలని, యుద్ధ నేరం కింద శ్రీలంకను విచారించేందుకు ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రవేశపెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారుు. ఫిబ్రవరిలో జెనీవా వేదికగా జరగనున్న ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఈ తీర్మానం తీసుకొచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టాలన్న డిమాండ్‌తో ఆందోళనల్ని ఉద్ధృద చేయడానికి విద్యార్థి సంఘాలు ఏకమవుతున్నారుు. ఇసై ప్రియను బందీగా పట్టుకెళుతున్న సింహళీయ మానవ మృగాల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పీఎంకే అధినేత రాందాసు, వీసీకే అధినేత తిరుమావళవన్ వేర్వేరు ప్రకటనల్లో తమ పార్టీల నేతృత్వంలో ఆందోళనలకు పిలుపునిచ్చారు. మంగళవారం చెన్నైలో వీసీకే భారీ నిరసనకు నిర్ణయించింది.
కరుణతో చిదంబరం భేటీ
ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీలంక పర్యటనను వ్యతిరేకిస్తున్న వారి జాబితాలో ఆర్థిక మంత్రి చిదంబరం సైతం చేరారు. ఇప్పటికే కేంద్రం మంత్రులు జీకేవాసన్, ఆంటోని, జయంతి నటరాజన్, నారాయణస్వామి వ్యతిరేకత తెలిపారు. ప్రస్తుతం చిదంబరం తోడు కావడంతో తమిళుల వాదనకు కేంద్రంలో బలం చేకూరేనా అన్న చర్చ బయలుదేరింది. గోపాలపురంలో కరుణానిధితో చిదంబరం శనివారం భేటీ అయ్యారు. అర్ధగంట సేపు వివిధ అంశాలపై చర్చించారు. శ్రీలంక తమిళుల సమస్య, కామన్వెల్త్ సమావేశాలు, ఇసై ప్రియ హత్య దృశ్యాలపై ఎక్కువ సమయం మాట్లాడుకున్నట్లు సమాచారం. అనంతరం వెలుపలకు వచ్చిన చిదంబరం మీడియాతో మాట్లాడారు. దీపావళిని పురస్కరించుకుని మర్యాద పూర్వకంగానే కరుణానిధిని కలుసుకున్నట్లు పేర్కొన్నారు.
కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొనే విషయమై ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఒక వేళ తీసుకుంటే తమిళుల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించే రీతిలో తాను ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రధాని నిర్ణయం తీసుకోరన్న నమ్మకం తనకు ఉందన్నారు. కోర్ కమిటీలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇసై ప్రియ హత్య ఘటనపై ఛానల్-4 ప్రసారం చేసిన దృశ్యాల్ని తాను చూశానని, ఆ దృశ్యాలన్నీ వాస్తవమేనని పేర్కొన్నారు. క్రూరంగా వ్యవహరించిన సింహళీయ సైన్యాన్ని గుర్తించి చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకొస్తానన్నారు.