లండన్: అంతర్జాతీయంగా మన దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కామన్వెల్త్ కూటమిలోనూ భారత్ కీలకపాత్ర పోషించాలని బ్రిటన్ సహా పలు కామన్వెల్త్ దేశాలు వెల్లడించాయి. దీంతో, ఇప్పటికే పలు ప్రపంచ వేదికలపై క్రియాశీలక పాత్ర పోషిస్తున్న భారత్.. కామన్వెల్త్ సమావేశాల అనంతరం మరో కీలకమైన అడుగు ముందుకేయనుంది. ఈనెల 16 నుంచి 20 వరకు లండన్‌లో జరగనున్న కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశాల్లో (చోగమ్) పాల్గొనేందుకు ప్రధాని మోదీ మంగళవారం బ్రిటన్ వెళ్లనున్నారు.
‘వివిధ అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు, కార్యక్రమాల్లో భారత్ పాత్ర క్రియాశీలకంగా మారింది. అందుకే కామన్వెల్త్‌లోని అతిపెద్ద దేశంగా భారత్.. ఈ గ్రూపును కూడా ముందుండి నడిపించాలని బ్రిటన్ కోరుకుంటోంది’ అని యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్ దినేశ్ పట్నాయక్ పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఈ ద్వైవార్షిక కామన్వెల్త్ ప్రభుత్వాల సదస్సుకు భారత ప్రధాని హాజరవటం ఇదే తొలిసారి. సోమవారమే ఈ సదస్సు ప్రారంభం కానున్నప్పటికీ.. మోదీ మంగళవారం రాత్రి లండన్ చేరుకుంటారు. బ్రిటీష్ రాణి ఎలిజబెత్–2 (కామన్వెల్త్ హెడ్) ప్రత్యేకంగా వ్యక్తిగత ఆహ్వాన లేఖ పంపినందుకే మోదీ ఈ సదస్సులో పాల్గొనేందుకు లండన్ వెళ్తున్నారని విదేశాంగ శాఖ సీనియర్ అధికారులు వెల్లడించారు.
నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
ప్రధాని మోదీ రెండుదేశాల (స్వీడన్, యూకే) విదేశీ పర్యటన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఐదురోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు స్వీడన్‌లో మోదీ పర్యటిస్తారు. ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్‌తో పలు అంశాలపై విస్తృత చర్చలు జరపనున్నారు. అనంతరం భారత్–నార్డిక్ సదస్సులో ఆయన పాల్గొననున్నారు.
ప్రపంచానికి ‘భారత్ కీ బాత్’
లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ‘భారత్ కీ బాత్, సబ్‌కే సాథ్’ పేరుతో భారత సంతతి ప్రజలు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రపంచాన్నుద్దేశించి ప్రసంగించనున్నారు. బుధవారం సాయంత్రం (బ్రిటీష్ కాలమానం ప్రకారం) సెంట్రల్ లండన్‌లోని సెంట్రల్ హాల్ వెస్ట్‌మినిస్టర్ వేదిక నుంచి మోదీ ప్రసంగం ప్రారంభం కానుంది. ప్రపంచం నలుమూలల నుంచి సోషల్ మీడియా, లైవ్ వీడియో లింక్‌ల ద్వారా వచ్చే ప్రశ్నలకు మోదీ సమాధానాలిస్తారు. అలాగే థేమ్స్ నది ఒడ్డున ఉన్న బసవేశ్వర (12 శతాబ్దపు సంఘసంస్కర్త) విగ్రహానికి ప్రధాని పుష్పాంజలి ఘటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment