కార్యక్రమంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నేరగాళ్లు ఖండాంతరాల్లో నేరసామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వేళ దేశాలు సత్వర న్యాయ వితరణ కోసం మరింతగా సహకరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘కామన్వెల్త్ దేశాల అటార్నీలు, సొలిసిటర్ జనరళ్ల సమావేశం’లో ఆయన ప్రసంగించారు.
‘‘ఒక దేశ న్యాయస్థానాన్ని మరో దేశం గౌరవించిన నాడే ఈ సహకారం సాధ్యం. అప్పుడే సత్వర న్యాయం జరుగుతుంది. క్రిప్టోకరెన్సీ, సైబర్ దాడుల విజృంభిస్తున్న ఈ తరుణంలో ఒక దేశ న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, ఉత్తర్వులు మరో దేశంలోనూ అమలుకు సాధ్యమయ్యేలా సంస్కరణలు తేవాలి. అప్పుడే బాధితులకు తక్షణ న్యాయం అందుతుంది. ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నౌకాయానంలో ఇది సాధ్యమైంది.
ఇకపై ఈ ఉమ్మడి విధానాన్ని కేసుల దర్యాప్తు, న్యాయవ్యవస్థలకూ విస్తరింపజేయాలి’’ అని అభిలషించారు. ఒక దేశంలో జరిగిన ఆర్థిక నేరాలు ఇంకొక దేశంలో అలాంటి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. లా స్కూళ్లలో మహిళల అడ్మిషన్లు పెరగాలని, అప్పుడే న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం: సీజేఐ
న్యాయ వితరణలో న్యాయ స్థానాలకు సాంకేతికత అనేది శక్తివంతమైన పరికరంగా ఎదిగిందని సర్వో న్నత న్యాయస్థానం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అటార్నీల సదస్సులో సీజేఐ పాల్గొని ప్రసంగించారు. ‘‘ సత్వర న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థ సాంకేతికతను శక్తివంతమైన ఉపకరణంగా వాడుతూ సద్వినియోగం చేస్తోంది. సాంకేతికతలను ఎల్లప్పుడూ సమాన త్వం, సమ్మిళితత్వాన్ని దృష్టిలో ఉంచుకునే అభివృద్ధిచేయాలి.
న్యాయం అందించేందుకు కామన్వెల్త్ దేశాలు ఉమ్మ డిగా కట్టుబడి ఉండాలి. న్యాయ వితరణ లో రాజకీయాలకు ఏమాత్ర జోక్యం లేకుండా చూడాల్సిన బాధ్యత న్యాయా ధికారులైన అటార్నీలు, సొలిసిటర్ జనరళ్లదే. అప్పుడే న్యాయవ్యవస్థ నైతిక త నిలబడుతుంది. సత్వర న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం తోడైంది. ప్రభుత్వాధికారులకు అనవసరంగా సమన్లు జారీ చేసే సంస్కృతి పోవాలి’’ అని సీజేఐ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment