సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో నీటి కేటాయింపుల్లేని ఆరు ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడంపైనే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 పరిమితమైందని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే అధికారం తమకు లేదంటూ ‘పాలమూరు–రంగారెడ్డి’ పథకంపై చేసిన విచారణలో ట్రిబ్యునల్ తేల్చిచెప్పడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు.
విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ.. తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులకే పరిమితం కానుంది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడాలని విభజన చట్టంలో సెక్షన్–89లో కేంద్రం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లే అవకాశంలేదు.
ఉమ్మడి రాష్ట్రానికి మిగులు జలాలు 194 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయిస్తూ 2013లో తుది నివేదిక ఇచ్చింది. ఇందులో తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ద్వారా కేంద్రం ఆ ట్రిబ్యునల్‌కే కట్టబెట్టింది. దాంతో 2016 నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ జరుపుతోంది.
ఏపీకి 125.5.. తెలంగాణకు 47 టీఎంసీలు
విభజన చట్టం 11వ షెడ్యూలులో కేంద్రం ఆమోదించిన తెలుగుగంగకు తుది తీర్పులోనే 25 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. శ్రీశైలం నుంచి 29 టీఎంసీల కృష్ణా వరద జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలు జతచేసి తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. తెలుగుగంగకు మరో 4 టీఎంసీలు అవసరం. శ్రీశైలం నుంచి 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా, 38 టీఎంసీలు తరలించేలా గాలేరు–నగరి, 43.5 టీఎంసీలు తరలించేలా వెలిగొండను ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టారు.
వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 125.5 టీఎంసీలు అవసరం. మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 22 టీఎంసీలు తరలించేలా నెట్టెంపాడు, శ్రీశైలం నుంచి 25 టీఎంసీలు తరలించేలా కల్వకుర్తి ఎత్తిపోతలను చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టులకు తెలంగాణకు 47 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటే 172.5 టీఎంసీలు అవసరం. కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలు 169 టీఎంసీలను.. ఆ ఆరు ప్రాజెక్టులకు ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు సర్దుబాటు చేయనుందని నిపుణులు చెబుతున్నారు.
కొత్త ప్రాజెక్టులకు కొత్త ట్రిబ్యునలే..
ఇక విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘంతో మదింపు చేయించుకుని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయానికి రాని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల కోసం అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాల్సి ఉంటుందని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంచేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ ‘కృష్ణా’పై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస, నెట్టెంపాడు, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), మిషన్ భగీరథలకు నీటి కేటాయింపులపై విచారణ చేయాలంటే కొత్త ట్రిబ్యునల్‌ను వేయాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment