కుండపోత | record level rain fall | Sakshi
Sakshi News home page

కుండపోత

Published Mon, Aug 1 2016 7:04 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

కుండపోత - Sakshi

కుండపోత

  • ఆదివారం రికార్డు స్థాయి వర్షం
  • మోర్తాడ్‌లో 15, బాల్కొండలో 14 సెం.మీ.
  • ఈ సీజన్‌లో ఇదే అత్యధికం
  • పొంగిపొర్లుతున్న వాగులు
  • ప్రాజెక్టులు, చెరువులకు జలకళ
  • నీట మునిగిన పంట పొలాలు
  • ఇందూరు : ఇందూరు పరవశించింది.. కుండపోతతో తడిసి ముద్దయింది.. కరువుతో తాగునీటికీ కటకటలాడిన జిల్లా గొంతు తడారింది.. ఆదివారం రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 179 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంతపెద్ద మొత్తంలో వర్షం కురియడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. మోర్తాడ్‌లో 15, బాల్కొండలో 14, కమ్మర్‌పల్లిలో 13 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం కురిసిన భారీ వర్షంతో అత్యధిక వర్షపాతం నమోదైన మండలాల సంఖ్య 17కు చేరింది. 18 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఒక్క తాడ్వాయి మండలం మాత్రం లోటు జాబితాలో ఉంది.
    పొంగిన వాగులు.. నిండిన చెరువులు
    ఎడతెరిపి లేకుండా కురిసిన జడివానతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగాయి. జిల్లాలో గల చిన్న, పెద్ద ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చాలాచోట్ల చెరువులు కూడా నిండుకుండల్లా మారాయి. భూగర్భ జలాలు పెరగడం, బోర్ల నుంచి పుష్కలంగా నీరు వస్తుండడంతో రైతులు వరినాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
    • భారీ వర్షాలతో పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. భీమ్‌గల్‌ మండలం బాబానగర్‌లో చెరువులోకి భారీ వరద నీరు వచ్చి చేరడంతో తూములకు గండికొట్టారు. 
    • కమ్మర్‌పల్లి మండలంలో పలు చెరువులు నిండుకుండల్లా మారాయి. పల్లె చెరువు, పటేల్‌ చెరువు, గుండ్లకుంట (బతుకమ్మ చెరువు), గారడీ కుంట, కుడికుంట చెరువు, గండి కుంట హాసాకొత్తూర్‌లోని కొత్త చెరువు, పటేల్‌ కుంట చెరువు జలకళను సంతరించుకున్నాయి. కోనాపూర్‌ రాళ్లవాగు ప్రాజెక్ట్‌ జలకళ సంతరించుకుంది. కమ్మర్‌పల్లి–ఉప్లూర్‌ రహదారిలోని వరద కాలువ సమీపంలో పంట పొలాలు నీట మునిగాయి.
    • బాల్కొండ మండలంలోని రెంజర్ల, బాల్కొండ, సోన్‌పేట్‌ గ్రామాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. పెద్ద వాగు, గుండె వాగు నిండుగా ప్రవహిస్తున్నాయి. పక్కన ఉన్న పొలాలు నీట మునిగాయి. వరినాట్లు కొట్టుకుపోయాయి. సావెల్‌–కోడిచర్ల రహదారి నీట మునిగింది.
    • బోధన్‌లోని సరస్వతీనగర్, వెంకటేశ్వర కాలనీ, డీగ్రీ కళాశాల, రాకాసీపేట్‌ తదితర ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. 
    • వేల్పూర్‌ మండలంలో వాగులు పొంగి పొర్లాయి. ప^è ్చలనడ్కుడ మీదుగా ప్రవహించే పెద్దవాగుకు మొదటిసారి వరద ప్రవాహం వచ్చింది. కప్పలవాగు, ముత్యాలమ్మ వాగులు వరదతో పోటెత్తాయి. 
    • జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్, జక్రాన్‌పల్లి గ్రామాల పెద్ద చెరువులు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. 
    కూలిన ఇళ్లు..
    • భీమ్‌గల్‌ మండలంలో ఆదివారం రెండిళ్లు నేలమట్టమయ్యాయి. మండలంలోని కారేపల్లిలో ధారవత్‌ నారాయణ అనే వ్యక్తికి చెందిన ఇళ్లు కుప్ప కూలింది. బడాభీమ్‌గల్‌లో సుద్దులం ఉజారావ్, నర్సయ్యలకు చెందిన ఇళ్లు నేలమట్టమయ్యాయి.
    • తాడ్వాయి మండలంలోని నందివాడ గ్రామంలో మంగళి నారాయణకు చెందిన పెంకుటిల్లు కుప్పకూలింది.
    • భారీ వర్షంతో కమ్మర్‌పల్లిలో ఓ ఇల్లు కూలింది.
    • బాల్కొండ మండలంలోని చిట్టాపూర్‌లో గొల్ల దేవన్నకు చెందిన ఇల్లు కూలిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement