'బాబు నూరు మాట్లాడితే నూటాయాభై అబద్ధాలు'
'బాబు నూరు మాట్లాడితే నూటాయాభై అబద్ధాలు'
Published Fri, Nov 27 2015 9:34 AM | Last Updated on Sat, Jun 2 2018 3:08 PM
ఈ ఖరీఫ్‌లో పంటలు దెబ్బతిని రైతాంగం విలవిలలాడుతోంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రైతులను ఆదుకోవాలి. లేకపోతే రైతుల ఆత్మహత్యలను ఆపడం సాధ్యం కాదు. ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
చంద్రబాబు నూరు మాటలు మాడ్లాడితే అందులో నూటా యాభై అబద్ధాలుంటాయని ప్రతీతి. సీమకు నీళ్లందించడం కోసమేనంటూ ఆయన తన సొంత లబ్ధి కోసం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారు. అందుకోసం పోలవరం ప్రాజెక్టుకు యుటిలిటీ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిధులు రాలేదంటూ దాన్ని నీరుగార్చారు. ఇప్పుడు పట్టిసీమ తప్ప మిగిలిన గోదావరి ఎత్తిపోతల పథకాలను ఆపుచేయాలని జీఓ జారీ చేసి గోదావరి జిల్లాలకు తీరని అన్యాయం చేశారు. గోదావరి డెల్టా వ్యవస్థకే 11,000 క్యూసెక్కుల నీరు అవసరం ఉండగా, ఇప్పుడు 11,600 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. త్వరలోనే అది ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది.
ఇక రాయలసీమకు నీరెక్కడిది? ఇది సీమవాసులను వంచించటం కాదా? హంద్రి-నీవా ప్రాజెక్టు పాత రేట్లను సవరించి కాంట్రాక్టర్లకు ఎక్కువ రేట్లు కట్టబెట్టడమే గాక, ఆ ప్రాజెక్టు పంపులను పట్టిసీమకు అమర్చడం సీమ రైతుల కళ్లల్లో దుమ్ము కొట్టడం కాదా? అవుకు, గాలేరు-నగరి ప్రాజెక్టుల అవినీతి బాగోతంపై టీడీపీ ప్రముఖ నేత సీఎం రమేష్ నీటిపారుదలశాఖా మంత్రిపై చేసిన ఆరోపణలపైనా, సదరు మంత్రి రమేష్‌పైనా చేసిన ప్రత్యారోపణలపైనా ముఖ్యమంత్రి విచారణ జరిపించగలరా? వైఎస్ హయాంలో ప్రాజెక్టు పనులను 5 శాతం కంటే ఎక్కువకు అప్పగించరాదనే నిబంధనను తుంగలో తొక్కి పట్టిసీమను 22 శాతం ఎక్కువ టెండరుకు కట్టబెట్టడంలో సుమారు రూ. 400 కోట్ల మేరకు అవినీతి జరగటం నిజం కాదా?
‘అనుసంధాన’ ప్రహసనం
ప్రపంచంలోనే తొలుత నదుల అనుసంధానాన్ని చేపట్టినది తానేనన్నట్టు ప్రచారం సాగించి బాబు చరిత్రపట్ల తన అపార అజ్ఞానాన్ని ప్రదర్శించారు. డెల్టా రూపశిల్పి సర్ ఆర్థర్ కాటన్ ‘గార్లండ్ ఆఫ్ ఇండియా’ (భారత జల హారం) అనే మ్యాప్‌ను సిద్ధం చేయగా, ఆ తర్వాత ఎమ్‌ఎన్ దస్తూర్, కేఎల్ రావులు నదుల అనుసంధానానికి బీజం వేశారు. కృష్ణానది ఏలూరు కాలువ ద్వారా గోదావరి కాలువకు ఏనాడో అనుసంధానమైంది. కాకినాడ నుంచి మద్రాసుకు బకింగ్‌హామ్ కెనాల్‌ను బ్రిటిష్ హయాంలోనే నిర్మించారు. తర్వాతి కాలపు ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా-పెన్నా, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి ఎన్నో నిధులను కేటాయించారు. ఇప్పుడు కొత్తగా తాను కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం చేస్తానని బాబు అనడం హాస్యాస్పదం.
వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలను కాదని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతానికే రాజధానిని ఇచ్చిన ముఖ్యమంత్రికి రెండవ రాజధానినైనా సీమలో ఏర్పాటు చేయాలనే యోచన లేకపోవడం దురదృష్టకరం. అలాగే ఉత్తరాంధ్రలో శాసనసభ శీతాకాల సమావేశాలు జరిగేలా ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేకపోతే మరో ప్రత్యేక ఉద్యమం తప్పదని అనిపిస్తోంది.
రైతులంటే చులకన
528 జీఓతో ‘ఏకగ్రీవ’ మాయాజాలం ప్రదర్శించి నీటి సంఘాల వ్యవస్థను నిర్వీర్యం చేసి, అధికారులపై ఒత్తిడితెచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీటి సంఘాలనన్నిటినీ అప్రజాస్వామికంగా టీడీపీ కార్యకర్తలతో నింపిన ఘనత చంద్రబాబుది. ‘‘మీ ఇంటికి - మీ భూమి’’ కార్యక్రమంలో రైతుల భూమి రికార్డులను 1బిలో సరిచేస్తానని చెప్పిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా అలాగే రశీదులను రైతుల ఇళ్లకు పంపింది.
వ్యవసాయ రంగం అసంఘటితం రంగం కావడం వల్ల సాగుబడి లాభసాటి కాదనే అభిప్రాయాన్ని చంద్రబాబు ఎన్నడూ మార్చుకోలేదు. ఎన్నికల్లో గట్టెక్కడం కోసం టీడీపీ, బీజేపీలు రెండూ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని వాగ్దానం చేశారు. ‘ఏరుదాటాక...’ అన్నట్టుగా గెలిచాక వాటిని అమలు చేయడం సాధ్యం కాదంటూ సుప్రీం కోర్టులోనే బాహాటంగా చెప్పాయి. ఇది రైతాంగాన్ని మోసగించడం కాదా?
ప్రస్తుత ఖరీఫ్‌లో నీరు లేక కృష్ణా-తూర్పు, పశ్చిమ గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఎండిపోతున్న పంటలను నిలపడానికి, రైతాంగాన్ని ఆదుకోడానికి ప్రభుత్వం చేసింది శూన్యం. ఇక పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల విపరీతమైన పంట నష్టం వాటిల్లింది. అయినా కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర కంటే తక్కువకే ధాన్యాన్ని కొంటున్నారు. రవాణా ఖర్చులను రైతులకు చెల్లించాలని జీఓ ఉన్నా దాన్ని అమలు చేయడం లేదు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మాత్రమే ఇవ్వాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి, రంగుమారిన ధాన్యాన్ని తానే కొని రైతులను ఆదుకోవాలి. లేకపోతే రైతుల ఆత్మహత్యలను ఆపడం ఎవరి తరమూ కాదు. నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు, ఆయన ప్రభుత్వమే అందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
(వ్యాసకర్త తూర్పు గోదావరి జిల్లా ‘రాష్ట్ర నీటి సంఘాల సమాఖ్య’ మాజీ ప్రధాన కార్యదర్శి) మొబైల్: 94402 04323
Advertisement
Advertisement