వివిధ జిల్లాల్లో వలంటీర్ల నిరసన.. పాడేరులో రెండువేల మందితో భారీ ర్యాలీ
3 నెలల పెండింగ్ బకాయిలూ చెల్లించాలని డిమాండ్
సాక్షి, అమరావతి/పాడేరు: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లా కేంద్రాల్లో వలంటీర్లు సోమవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. పెండింగ్ బకాయిలతో సహా వలంటీర్ల గౌరవ వేతనాలు అక్టోబరు 25లోగా చెల్లించకుంటే నిరసన దీక్షలు చేపడతామని.. రాబోయే కేబినెట్ సమావేశంలోగా తమకు న్యాయం చేయకుంటే ‘చలో సీఎం క్యాంపు కార్యాలయం’ చేపట్టనున్నట్లు వలంటీర్ల సంఘాలు హెచ్చరించాయి.
ఇక వీరి ఆందోళనలకు సీపీఐ అనుబంధ ఏఐవైఎఫ్ ప్రతినిధులు తమ సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11 మండలాలకు సంబంధించిన దాదాపు రెండువేల మంది వలంటీర్లు పాడేరులో సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీ ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పలువురు వలంటీర్లు చంటి పిల్లలతో పాల్గొన్నారు.
అనంతరం గంటసేపు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ వలంటీర్లతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం వలంటీర్లు ఆయనకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే, కర్నూలు కలెక్టరేట్ ఎదుట కూడా వలంటీర్లు భారీఎత్తున ఆందోళన నిర్వహించి, ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వీరికి గౌరవ వేతనాలు చెల్లించలేదు.
Comments
Please login to add a commentAdd a comment