Krishna Project
-
సీఎం రేవంత్‌రెడ్డి పసలేని ఆరోపణలు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చాక కూడా కాంగ్రెస్ అబద్ధాలు ఆడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. విభజన చట్టాన్ని తయారుచేసింది.. ఆనాటి కాంగ్రెస్ నాయకులు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. విభజన చట్టంతో తమకేం సంబంధం లేదని తెలిపారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమపై సీఎం రేవంత్‌రెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని అన్నారు. రుణమాఫీ, రైతు బంధు, ఉద్యోగాల నోటీఫికేషన్లపై మాట తప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతకావటంలేదని ఎద్దేవా చేశారు. -
నీటి కేటాయింపులు.. ఆ ఆరు ప్రాజెక్టులకే పరిమితం
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో నీటి కేటాయింపుల్లేని ఆరు ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడంపైనే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 పరిమితమైందని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే అధికారం తమకు లేదంటూ ‘పాలమూరు–రంగారెడ్డి’ పథకంపై చేసిన విచారణలో ట్రిబ్యునల్ తేల్చిచెప్పడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ.. తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులకే పరిమితం కానుంది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడాలని విభజన చట్టంలో సెక్షన్–89లో కేంద్రం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లే అవకాశంలేదు. ఉమ్మడి రాష్ట్రానికి మిగులు జలాలు 194 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయిస్తూ 2013లో తుది నివేదిక ఇచ్చింది. ఇందులో తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ద్వారా కేంద్రం ఆ ట్రిబ్యునల్‌కే కట్టబెట్టింది. దాంతో 2016 నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ జరుపుతోంది. ఏపీకి 125.5.. తెలంగాణకు 47 టీఎంసీలు విభజన చట్టం 11వ షెడ్యూలులో కేంద్రం ఆమోదించిన తెలుగుగంగకు తుది తీర్పులోనే 25 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. శ్రీశైలం నుంచి 29 టీఎంసీల కృష్ణా వరద జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలు జతచేసి తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. తెలుగుగంగకు మరో 4 టీఎంసీలు అవసరం. శ్రీశైలం నుంచి 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా, 38 టీఎంసీలు తరలించేలా గాలేరు–నగరి, 43.5 టీఎంసీలు తరలించేలా వెలిగొండను ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 125.5 టీఎంసీలు అవసరం. మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 22 టీఎంసీలు తరలించేలా నెట్టెంపాడు, శ్రీశైలం నుంచి 25 టీఎంసీలు తరలించేలా కల్వకుర్తి ఎత్తిపోతలను చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టులకు తెలంగాణకు 47 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటే 172.5 టీఎంసీలు అవసరం. కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలు 169 టీఎంసీలను.. ఆ ఆరు ప్రాజెక్టులకు ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు సర్దుబాటు చేయనుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు కొత్త ట్రిబ్యునలే.. ఇక విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘంతో మదింపు చేయించుకుని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్లో ఏకాభిప్రాయానికి రాని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల కోసం అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాల్సి ఉంటుందని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంచేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ ‘కృష్ణా’పై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస, నెట్టెంపాడు, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), మిషన్ భగీరథలకు నీటి కేటాయింపులపై విచారణ చేయాలంటే కొత్త ట్రిబ్యునల్‌ను వేయాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
కృష్ణా ప్రాజెక్టులపై గెజిట్‌ను రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పొందుపర్చిన ఆరు ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ గత ఏడాది జూలై 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోఫికేషన్‌కు చట్టబద్ధత లేదని, దానిని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. బేసిన్ వెలుపల ఉన్న ఏపీలోని నాలుగు ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కేటాయింపులు లేకున్నా.. అనుమతుల నుంచి మినహాయింపు కల్పించడం సరికాదని స్పష్టం చేసింది. నీటి కేటాయింపులు జరిపే అధికారం కేవలం ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని పేర్కొంది. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టుల జాబితా అసంపూర్తిగా ఉందని.. 2002 నుంచే వినియోగంలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును అందులో చేర్చలేదని వివరించింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయాలను ప్రభావితం చేసేలా ఉన్న ఈ గెజిట్‌ను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణకు అన్యాయం.. కృష్ణా జలాల వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టం కింద కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. ఆ బోర్డుకు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో కృష్ణానదిపై తెలంగాణలోని కల్వ కుర్తి (అదనపు 15 టీఎంసీల సామర్థ్యం పెంపు), నెట్టెంపా డు (సామర్థ్యం పెంచనిది)తోపాటు ఏపీలోని తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ఎత్తిపోతల పథకా లను అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. వీటికి ఏడాదిలోగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని పే ర్కొంది. కానీ కేంద్రం వీటిని విభజన చట్టంలో 11వ షెడ్యూ ల్లో పొందుపరిచి, పూర్తి చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లే దంటూ గత ఏడాది జూలై 27న సవరణ గెజిట్ జారీ చేసింది. అయితే.. ఇలా మినహాయింపు పొందిన ప్రాజెక్టుల్లో తెలంగాణలోని రెండే ప్రాజెక్టులు ఉండగా, ఏపీలోని 4 ప్రాజె క్టులు ఉండటంపై తెలంగాణ తాజాగా అభ్యంతరం తెలిపింది. కృష్ణా బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను కోరుతూ కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపి స్తున్నామని.. ఈ సమయంలో బేసిన్ వెలుపల ఉన్న ఏపీలో ని 4 ప్రాజెక్టులకు మినహాయింపు ఇస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయమని ఆందోళన వ్యక్తం చేసింది. బేసిన్ పరిధిలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు అ నుమతుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు గెజిట్ నోటిఫికేషన్ అడ్డంకిగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు కోరుతు న్నామని తెలిపింది. -
వరదొచ్చేదాకా ... ఎదురుచూపే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది విస్తారంగా కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదలతో ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై భారీ ఆశలే నెలకొన్నాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటికే చాలా ప్రాజెక్టులు ఖాళీ అవగా నైరుతి రుతుపవనాల రాక సకాలంలో ఉంటుందన్న అంచనాలు రాష్ట్రానికి ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు బేసిన్ల పరిధిలో 525 టీఎంసీల లోటు ఉండగా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే సకాలంలో సమృద్ధిగా కురిసే వానలపై భవిష్యత్తు ఆధారపడి ఉంది. వరదలొస్తేనే ప్రాజెక్టులకు ఊతం.. రాష్ట్రంలో ఖరీఫ్, యాసంగి సాగు అవసరాలకు భారీగా నీటి వినియోగం చేయడంతో ప్రాజెక్టులు నిండుకున్నాయి. అంతకుముందు ఏడాదులతో పోలిస్తే నిల్వలు కొంత మెరుగ్గానే ఉన్నా అవి తాగునీటికి తప్ప సాగు అవసరాలను తీర్చలేవు. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో 537 టీఎంసీలకుగాను ప్రస్తు తం 327 టీఎంసీల నీటి లోటు ఉంది. ఇందులో సాగర్‌లో ప్రస్తుతం 172 టీఎంసీల నీటి లభ్యత కనబడుతున్నా ఇందులో కనీస నీటిమట్టాలకు ఎగువన ఉన్నది కేవలం 35 టీఎంసీలే. ఈ నీటినే జూలై చివరి వరకు రాష్ట్రం వినియోగించుకోవాల్సి ఉంది. ఇక శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను కేవలం 35 టీఎంసీలే లభ్యతగా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు నిండాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల్లోనే 210 టీఎంసీల నీటి కొరత ఉంది. అవి నిండితే కానీ శ్రీశైలానికి వరద కొనసాగే పరిస్థితి లేదు. గతేడాది భారీ వరదల కారణంగా జూలైలోనే 220 టీఎంసీల మేర నీరొచ్చింది. ఈ ఏడాది సైతం అలా వస్తేనే శ్రీశైలం నిండే అవకాశం ఉంది. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా.. (టీఎంసీల్లో) -
చినుకు పడలే.. చెరువు నిండలే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టు పరిధిలోని పెద్ద ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతుంటే.. చిన్న నీటివనరులైన చెరువులు మాత్రం నీటి కొరతతో అల్లల్లాడుతున్నాయి. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో దిగువ ప్రాజెక్టులకు ఊహించని రీతి లో వరద కొనసాగుతుండగా, సరైన వర్షాలు లేక చెరువులు ఓటికుండల్లా దర్శనమిస్తున్నాయి. బేసిన్ పరిధిలోని 23,700కు పైగా చెరువుల్లో 21,900 ఖాళీగానే ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తేగానీ నిండే అవకాశం లేదు. వర్షపాతం తక్కువే.. కృష్ణా బేసిన్‌లోని నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదైంది. గతేడాదితో పోలిస్తే 30 నుంచి 50% తక్కువ వర్షపాతం రికార్డయింది. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో 50% తక్కువ వర్షపాతం నమోదవగా.. రంగారెడ్డిలో 39, జోగుళాంబ గద్వాల, సంగారెడ్డిలో 23, సూర్యాపేటలో 26, యాదాద్రి, మేడ్చల్‌లో 33% తక్కువ వర్షపాతం రికార్డయింది. దీంతో ఈ జిల్లాల పరిధిలోని చెరువుల్లో పెద్దగా నీరు చేరలేదు. ఖాళీగా 21,909 చెరువులు నిజానికి కృష్ణా బేసిన్లో ఉన్న 23,704 చెరువులకు 89 టీఎంసీల మేర నీటి కేటాయింపులున్నాయి. కానీ ఇప్పటివరకు 21,909 చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కేవలం 1,339 చెరువుల్లో 25 నుంచి 50 శాతం మేర నీరు చేరగా 214 చెరువుల్లో 50 నుంచి 70 శాతం, 201 చెరువుల్లో 75 శాతానికి మించి లభ్యత ఉంది. 41 చెరువులే అలుగు పారుతున్నాయి. కృష్ణా బేసిన్లో ప్రధానంగా సిద్ధిపేట జిల్లాలో 3,256 చెరువుల్లో 3,222 చెరువుల్లో చుక్క నీరు లేదు. మహ బూబ్‌నగర్ జిల్లాలోనూ 2,461 చెరువుల్లో ఒక్క చెరువులోకి నీరు చేరలేదు. మిగతా జిల్లాలోనూ ఇదే పరిస్థితి. భవిష్యత్తులో కురిసే వర్షాలపైనే ఈ చెరువులన్నీ ఆధారపడి ఉన్నాయి. గోదావరి పరిధిలో 20,121 చెరువుల్లో 8 వేల చెరువులు ఖాళీగా ఉన్నాయి. మిగ తా చెరువుల్లో 40 శాతం నీటి లభ్యత ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ రెండ్రోజుల్లోనే శ్రీశైలానికి 30 టీఎంసీల మేర నీరు చేరింది. ప్రవాహాలు పెరగడంతో 10 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. -
మంచినీటికి కటకటే!
సాక్షి, హైదరాబాద్: తాగునీటికీ కటకట మొదలవుతోంది.. వేసవి పూర్తి స్థాయిలో మొదలవకముందే కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలంలో కనీస నీటి మట్టాల కంటే దిగువన నీటిని తోడేస్తుండగా.. సాగర్‌లో నీటి నిల్వలు కనీస మట్టానికి చేరుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆగస్టు వరకు తాగు, సాగు అవసరాలకు ఈ నీరే దిక్కు. ఈ నీటిని ఎలా సర్దుబాటు చేసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. శ్రీశైలం ఖాళీకి మరో వారమే..! ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా ఖాళీ అవుతోంది. ఇక్కడ రోజూ 24 వేల క్యూసెక్కుల (రోజుకు 2 టీఎంసీల) చొప్పున నీటిని ఏపీ తోడేడటంతో నీటినిల్వలు తగ్గిపోతున్నా యి. శ్రీశైలం లో 823.2 అడుగుల వద్ద 43.34 టీఎంసీల మేర నిల్వలున్నాయి. వాస్తవానికి శ్రీశైలం కనీస నీటిమట్టం 834 అడుగులు కాగా.. వారం కిందటి నుంచే దిగువకి వెళ్లి తోడేస్తున్నారు. ఇదే మాదిరి రోజుకు 2 టీఎంసీల చొప్పున తీసుకుంటే.. ప్రస్తుతం 800 అడుగుల మట్టానికి ఎగువన ఉన్న 14.36 టీఎంసీల నీరు వారంలో ఖాళీ అవుతుంది. పూర్తిగా సాగర్‌లో లభ్యత జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. సాగర్ నీటిపై ఊగిసలాట సాగర్‌లో 522.7 అడుగుల వద్ద 154.25 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీళ్లు 22.58 టీఎంసీలు మాత్రమే. ఇరు రాష్ట్రాలు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటి అవసరాల కోసం 15 వేల క్యూసెక్కుల మేర నీటిని తీసుకుంటున్నాయి. ఇదిలాగే కొనసాగితే నెలాఖరు నాటికి సాగర్‌లో నీటి నిల్వలు కనీస మట్టాలకు చేరడం ఖాయం. సాగర్ఎడమ కాల్వ కింద జోన్–1, జోన్–2కు సంబంధించి ఈ నెలలో మరో 10 టీఎంసీలు, ఏప్రిల్‌లో ఆరు టీఎంసీల వరకు సాగునీటి అవసరాలు ఉంటాయని అంచనా. సాగర్‌లో నీటిమట్టం కనీసం 515 అడుగుల వరౖMðనా లేకుంటే నీటి విడుదలలో సాంకేతిక ఇబ్బందులు తప్పవు. హైదరాబాద్, నల్లగొండ జిల్లాల తాగునీటి అవసరాలు తీరాలంటే కనీసం 510 అడుగుల నీటిమట్టం తప్పనిసరి. దీంతో మే నెలాఖరు వరకు సాగర్‌లో కనీస నీటి మట్టాలు ఉండేలా చూడాలని తెలంగాణ పట్టుబడుతోంది. కానీ, ఏపీ, కృష్ణా బోర్డు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కరంగా మారింది. కనీస మట్టాలకు దిగువన నీటిపై కన్ను సాగర్‌లో ఉన్న నీటినే ఆగస్టు నెలాఖరు వరకు సర్దుకోవాల్సిన పరిస్థితుల్లో.. కనీస నీటి మట్టాల కంటే దిగువకు వెళ్లి నీటిని తోడుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కనీసమట్టాలకు దిగువన 500 అడుగుల వరకు నీటిని తీసుకునేందుకు బోర్డుపై ఏపీ ఒత్తిడి తెస్తోంది. 510 అడుగుల నుంచి 500 అడుగుల మధ్య 16.36 టీఎంసీల నీటిలభ్యత ఉంటుందని, 510 అడుగుల ఎగువన ఉన్న లభ్యత జలాలు 22.58 టీఎంసీలు కలిపితే మొత్తం 38.94 టీఎంసీలతో ఇరు రాష్ట్రాల అవసరాలు తీరుతాయని చెబుతోంది. దీనిపై తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి అభ్యంతరం తెలుపుతూ ఇటీవల బోర్డుకు లేఖ రాశారు. మే నెలాఖరు వరకు 510 అడుగుల మట్టం కన్నా దిగువకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. అయితే, బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ముందున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బోర్డు నిర్ణ యం తీసుకోవాల్సి ఉంటుందని నీటి పారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
కృష్ణా జలాలపై తేలిన లెక్క
34 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 15.5 టీఎంసీలు.. ఏపీకి 18.5 టీఎంసీలు సాక్షి, హైదరాబాద్: కృష్టా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాల పంపిణీపై లెక్క తేలింది. ప్రస్తుతం లభ్యతగా ఉన్న 34 టీఎంసీల్లో తెలంగాణకు 15.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 18.5 టీఎంసీలు దక్కనున్నాయి. తెలంగాణకు కేటాయించిన నీటిలో 14 టీఎంసీలు సాగర్ ఎడమ కాల్వ కు, 1.5 టీఎంసీలు హైదరాబాద్ తాగు నీటికి, ఏపీకి కేటాయించిన నీటిలో సాగర్ ఎడమ కాల్వ కింద 5 టీఎంసీలు, కుడి కాల్వ కింద 12 టీఎంసీలు, హంద్రీనీవాకు 1.5 టీఎంసీలు వాడుకునేలా ఇరు రాష్ట్రాలు బోర్డు సమక్షంలో అంగీకారానికి వచ్చాయి. కృష్ణా బేసిన్‌లోని వివాదాలపై చర్చించేం దుకు బుధవారమిక్కడ బోర్డు చైర్మన్ హల్దార్ అధ్యక్షతన జలసౌధలో సమావేశం జరిగింది. ఐదు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, సభ్యుడు బాలన్, రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్కే జోషి, ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శశిభూషణ్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వర్రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. లభ్యత జలాలను పంచుకునే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చాయని, వచ్చే సమావేశంలో బోర్డు వర్కింగ్ మాన్యువల్‌పై చర్చిస్తామని సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ మీడియాకు తెలిపారు. తెలంగాణ ప్రధాన వాదనలివీ.. ► గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తరలిస్తున్న నీటిపై ఏపీ లెక్కలను సమర్థిం చిన బోర్డు.. మైనర్ ఇరిగేషన్ కింద మేం సమర్పించిన లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇది పక్షపాత వైఖరికి నిదర్శనం కాదా? ► మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణకు 89.15 టీఎంసీల కేటాయింపులున్నా 2005–06 నుంచి 2014–15 వరకు జరిగిన సరాసరి వినియోగం కేవలం 45.97 టీఎంసీలు మాత్రమే. 2015–16లో అయితే మైనర్ వినియోగం సున్నా. ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లోని చెరువుల్లోకి 37.812 టీఎంసీల నీటి ప్రవాహం వచ్చింది. ఇందులో 15 శాతం డెడ్‌స్టోరేజీ లెక్కలను పక్కనపెడితే లభ్యత జలం 32.14 టీఎంసీలే. ఇందులో మేజర్ ప్రాజెక్టు నుంచి వచ్చిన నీరు 7.36 టీఎంసీల వరకు ఉంది. అంటే మైనర్ కింద వాస్తవంగా జరిగిన వినియోగం 24.78 టీఎంసీలు మాత్రమే. ► కృష్ణా ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ యంత్రాల్లో ఇదివరకు ప్రతిపాదించిన 47 లొకేషన్లతోపాటు అదనంగా మరో 12 లొకేషన్లు పెట్టాలి. మొదటి విడతలో 18 చోట్ల పరికరాల అనుమతికి అంగీకారం కుదరగా.. ఇందులో 11 చోట్ల తెలంగాణలో, 7 చోట్ల ఏపీలో అమర్చారు. ఇలా కాకుండా రెండు రాష్ట్రాల్లో సమాన సంఖ్యలో ఏర్పాటు చేయాలి. రెండో విడతలో గుర్తించిన 28 చోట్ల వెంటనే వీటిని అమర్చేలా చర్యలు తీసుకోవాలి. ► నల్లగొండ జిల్లాలోని 8 ఎత్తిపోతల పథకాలు పులిచింతల ఫోర్‌షోర్ నీటిపై ఆధారపడి ఉన్నాయి. వీటికింద ప్రస్తుతం 30 వేల ఎకరాల పంటల సాగు జరిగింది. అయితే పులిచింతల కనీస నీటిమట్టం లేకపోవడంతో పంటలకు నీరందడం లేదు. ఈ దృష్ట్యా ప్రాజెక్టులో కనీస నీటి మట్టంలో నీరుండేలా చర్యలు తీసుకోవాలి. న్యాయమైన వాటాను ఎలా అడ్డుకుంటారు? కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ సూచించిన ప్రకారం 299 : 512 టీఎంసీల(37.63 నిష్పత్తిలో) పంపిణీ జరగాలని సమా వేశంలో తెలంగాణ పట్టుపట్టింది. ఈ లెక్కనే నీటిని పంచుకోవాలని కేంద్ర జల వనరుల శాఖ, అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఒప్పందం కుదిరిందని, దీనిపై ఇప్పుడు ఏపీ, బోర్డు అభ్యంతరం తెలపడమేం టని ప్రశ్నించింది. దీన్ని ఏపీ వ్యతిరేకించింది. బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులను తీసుకున్నప్పుడే ఈ నిష్పత్తి వర్తిస్తుందని, సాగర్, శ్రీశైలంలకు ఇది వర్తించదని పేర్కొంది. ఇందుకు బోర్డు సైతం మద్ద తుగా నిలవడంతో రాష్ట్ర స్పెషల్ సీఎస్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలం గాణకు రావాల్సిన న్యాయమైన వాటాపై ఏపీ అన్యాయంగా వ్యవహరిస్తోంది. కొత్త రాష్ట్రంలోనూ రైతులు చావాల్సిం దేనా?’’ అని ఉద్వేగంగా ప్రశ్నించారు. నీటి పంపిణీ నిష్పత్తి తేలనంత వరకు బోర్డు వర్కింగ్ మాన్యువల్‌ను ఒప్పుకో మన్నారు. దీన్ని ఏపీ వ్యతిరేకించింది. అయితే బోర్డు చైర్మన్ జోక్యం చేసుకొని దీనిపై తర్వాత చర్చిద్దామని ప్రస్తుతానికి తాము సూచించిన మేరకు నీటిని పంచుకోవాలని సూచించారు. -
నీటి విడుదల
కుడి కాలువకు విజయపురిసౌత్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు తాగునీటి అవసరాల నిమిత్తం ఆదివారం అధికారులు నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు ఏఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరావు ఉదయం 10గంటలకు ఐదో గేటు నాలుగున్నర అడుగుల మేర ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని కుడికాలువకు విడుదల చేశారు. 5, 7వ గేట్ల ద్వారా మధ్యాహ్నం 3గంటల నుంచి గంటకు 500 క్యూసెక్కుల చొప్పున 2,036 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తాగునీటి అవసరాలకు కుడికాలువకు నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తాగునీటి అవసరాల నిమిత్తం నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవటంతో ఎట్టకేలకు కుడికాలువకు నీరు విడుదలైంది. తాగునీటి అవసరాల నిమిత్తం ఈ ఏడాది కృష్ణా రివర్‌బోర్డు నిర్ణయం మేరకు మొదటి విడత ఆగస్టు 26న 1.41టీఎంసీలు, రెండో విడత సెప్టెంబర్ 15న 2.39టీఎంసీల నీటిని కుడికాలువకు విడుదల చేశారు. సోమవారం కుడికాలువకు నీటిని పెంపుదల చేసే అవకాశం ఉందని సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సాగర్ జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 510.20 అడుగుల వద్ద ఉంది. ఇది 132.0098 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 2,036, ఎడమ కాలువకు 5,961, ఎస్ఎల్బీసీకి 900, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 9,671 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
డిసెంబర్ నాటికి నగరానికి ‘కృష్ణా’ నీళ్లు
మంత్రి పద్మారావు వెల్లడి సీఎం ఆదేశాల మేరకు పైపులైన్ పనుల పరిశీలన సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ ప్రాజెక్టును వచ్చే డిసెంబర్‌నాటికి పాక్షికంగా పూర్తిచేసి నగరానికి 22.5 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిస్థాయిలో మూడోదశ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని, తద్వారా గ్రేటర్‌కు 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలు అందుతాయన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన సోమవారం మూడోదశ పనులను జలమండలి ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. నగర శివార్లలోని సాహెబ్‌నగర్ నుంచి గోడకొండ్ల, గున్గల్, నాసర్లపల్లి, నల్లగొండ జిల్లా కోదండాపూర్ వరకు సుమారు 110 కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న పైప్‌లైన్, పంప్‌హౌజ్, నీటిశుద్ధి కేంద్రాల పనులను పరిశీలించారు. పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది జూలై నాటికి గోదావరి మంచినీటి పథకాన్ని పూర్తిచేసి నగరానికి 170 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలను సరఫరా చేయనున్నామన్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో నీటినిల్వలు తగ్గినపుడు డెడ్‌స్టోరేజి నుంచి సైతం గ్రేటర్ తా గునీటి అవసరాలకు అవసరమైన నీటిని సేకరించేం దుకు సుంకిశాల కృష్ణా హెడ్‌వర్క్స్ పనులను పూర్తిచేస్తామన్నారు. ఇందుకోసం రూ.840 కోట్ల అంచనా వ్యయంతో రూ పొందించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించనున్నామని తెలిపారు. కృష్ణా మూడోదశ పైప్‌లైన్‌కు ఆనుకొని ఉన్న గ్రామాల తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను సరఫరా చేస్తామన్నారు. అవసరమైతే కృష్ణా నాలుగోదశ.. రాబోయే పదేళ్లలో నగర జనాభా ప్రస్తుతం ఉన్న కోటి నుంచి రెండు కోట్లకు చేరుకుంటుందని..అప్పటి జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే కృష్ణా నాలుగోదశ పథకాన్ని చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి పద్మారావు చెప్పారు. కృష్ణా జలాల్లో 30 టీఎంసీలకు గాను ప్రస్తుతం కృష్ణా మూడుదశల ప్రాజెక్టుల ద్వారా 16.5 టీఎంసీల జలాలను నగర తాగునీటి అవసరాలకు మళ్లిస్తున్నామన్నారు. నీటి వృథాను అరికట్టడం,జలమండలి నష్టాలను అధిగమించేందుకు కనీసం నీటి శుద్ధికి అయ్యే నిర్వహణ వ్యయాన్ని ఛార్జీల రూపంలో వసూలు చేయక తప్పదని పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట జలమండలి ఎండీ జగదీశ్వర్, డెరైక్టర్లు రామేశ్వర్రావు, కొండారెడ్డి, సత్యనారాయణ, ఎల్లాస్వామి, జలమండలి ఉన్నతాధికారులు ఇతర టీఆర్ఎస్ నాయకులున్నారు. కృష్ణా ప్రాజెక్టు లోన్‌కు రూ.15 కోట్లు విడుదల.. కృష్ణా మొదటి,రెండవ దశ ప్రాజెక్టుల కోసం గతంలో జలమండలి సేకరించిన రుణానికి సంబంధించి వాయిదా చెల్లించేందుకు రూ.15 కోట్లు విడుదల చేస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
హే.. కృష్ణా!
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ పనులు నత్తనడకన సా..గుతూ ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు, అధికారుల మాటలు కోటలు దాటుతున్నా.. పనుల్లో పురోగతి కానరావడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి హామీ మేరకు వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ప్రాజెక్టును పూర్తిచేసే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు. ఈ పరిస్థితితో ఆయన హామీ నీటిమూటగానే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టులో కీలకమైన రింగ్‌మెయిన్-1, 2 పనులు ఇప్పటికీ మొదలుకాకపోవడం గమనార్హం. పనులు దక్కించుకున్న ఏజెన్సీలు అసలు పనులు పక్కకు పెట్టి పైపుల తయారీ పైనే దృష్టిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు పైపుల మందం ప్రమాణాల ప్రకారం లేదని, వాటి నాణ్యత, మన్నికపైనా నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు దండుకునేందుకే ఆయా సంస్థలు పైపుల తయారీలో వేగం పెంచాయని ఆక్షేపిస్తుండడం గమనార్హం. మందగమనంలో పనులు మూడోదశలో భాగంగా నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి నగర శివారులోని సాహెబ్‌నగర్ వరకు 107.5 కిలోమీటర్లు, ఆ తరువాత నగరంలో 66 కిలోమీటర్ల మేర నీటిని సరఫరా చేసే రింగ్‌మెయిన్ పనులు కలిపి మొత్తంగా 173.5 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు పూర్తిచేయాలి. గత ఆరునెలలుగా అన్ని ప్యాకేజీల్లో కలిపి 12.5 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు పూర్తికావడం పనుల మందగమనానికి అద్దంపడుతోంది. ఇక కోదండాపూర్, నాసర్లపల్లి, గోడకండ్ల, గున్గల్ వద్ద నీటి శుద్ధి కేంద్రాల పనులు ఇటీవలే మొదలయ్యాయి. ప్రహరీ, పిల్లర్ల నిర్మాణం పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవడం గుడ్డిలో మెల్ల. ఇక కోదండాపూర్, నాసర్లపల్లి, గున్గల్ వద్ద పంప్‌హౌస్‌ల నిర్మాణపు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. అధికారుల వివరణ ఇదీ.. వచ్చే ఏడాది జనవరి నాటికి కోదండాపూర్ వరకు 107.5 కిలోమీటర్ల మేర ప్రధాన పైప్‌లైన్ పనులు పూర్తిచేస్తామని జలమండలి ప్రాజెక్టు విభాగం అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో ప్యాకేజీలో ఆరు భారీ యంత్రాలు, కార్మికులు, నిపుణులున్న నాలుగు బృందాలు పనులు చేపడుతున్నాయని వివరించారు. ఆ తరువాత రింగ్‌మెయిన్, పంప్‌హౌస్ పనులు పూర్తిచేస్తామని సాక్షికి తెలిపారు. పైపుల నాణ్యతపై అనుమానాలెన్నో? పైపులు వేయాల్సిన పనులను పక్కకుబెట్టి పైపుల తయారీపైనే ఏజెన్సీలు దృష్టి సారించడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు పైపుల మందం తగ్గిందని నిపుణులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మందం తగ్గడంతో దీర్ఘకాలంలో వీటి నాణ్యత, మన్నిక ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పైపుల నాణ్యతపై విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో సమ గ్ర దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. కాగా ఇప్పటివరకు 65 కిలోమీటర్ల మేర పైపులను తయారు చేశామని బిల్లులు దండుకునేందుకు పనులు చేపట్టిన సంస్థలు ఆరాటపడుతున్నాయి. కానీ పైపులు వేసింది(లేయింగ్) 12.5 కిలోమీటర్లే కావడం గమనార్హం. పైపుల తయారీపై ఉంచిన శ్రద్ధ వాటిని వేయడం(లేయింగ్)లోనూ చూపాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.