నీటి విడుదల
కుడి కాలువకు
విజయపురిసౌత్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు తాగునీటి అవసరాల నిమిత్తం ఆదివారం అధికారులు నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు ఏఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరావు ఉదయం 10గంటలకు ఐదో గేటు నాలుగున్నర అడుగుల మేర ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని కుడికాలువకు విడుదల చేశారు. 5, 7వ గేట్ల ద్వారా మధ్యాహ్నం 3గంటల నుంచి గంటకు 500 క్యూసెక్కుల చొప్పున 2,036 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తాగునీటి అవసరాలకు కుడికాలువకు నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు తాగునీటి అవసరాల నిమిత్తం నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవటంతో ఎట్టకేలకు కుడికాలువకు నీరు విడుదలైంది. తాగునీటి అవసరాల నిమిత్తం ఈ ఏడాది కృష్ణా రివర్‌బోర్డు నిర్ణయం మేరకు మొదటి విడత ఆగస్టు 26న 1.41టీఎంసీలు, రెండో విడత సెప్టెంబర్ 15న 2.39టీఎంసీల నీటిని కుడికాలువకు విడుదల చేశారు. సోమవారం కుడికాలువకు నీటిని పెంపుదల చేసే అవకాశం ఉందని సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సాగర్ జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 510.20 అడుగుల వద్ద ఉంది. ఇది 132.0098 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 2,036, ఎడమ కాలువకు 5,961, ఎస్‌ఎల్‌బీసీకి 900, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 9,671 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.