సాక్షి, హైదరాబాద్: తాగునీటికీ కటకట మొదలవుతోంది.. వేసవి పూర్తి స్థాయిలో మొదలవకముందే కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలంలో కనీస నీటి మట్టాల కంటే దిగువన నీటిని తోడేస్తుండగా.. సాగర్‌లో నీటి నిల్వలు కనీస మట్టానికి చేరుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆగస్టు వరకు తాగు, సాగు అవసరాలకు ఈ నీరే దిక్కు. ఈ నీటిని ఎలా సర్దుబాటు చేసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది.
శ్రీశైలం ఖాళీకి మరో వారమే..!
ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా ఖాళీ అవుతోంది. ఇక్కడ రోజూ 24 వేల క్యూసెక్కుల (రోజుకు 2 టీఎంసీల) చొప్పున నీటిని ఏపీ తోడేడటంతో నీటినిల్వలు తగ్గిపోతున్నా యి. శ్రీశైలం లో 823.2 అడుగుల వద్ద 43.34 టీఎంసీల మేర నిల్వలున్నాయి. వాస్తవానికి శ్రీశైలం కనీస నీటిమట్టం 834 అడుగులు కాగా.. వారం కిందటి నుంచే దిగువకి వెళ్లి తోడేస్తున్నారు. ఇదే మాదిరి రోజుకు 2 టీఎంసీల చొప్పున తీసుకుంటే.. ప్రస్తుతం 800 అడుగుల మట్టానికి ఎగువన ఉన్న 14.36 టీఎంసీల నీరు వారంలో ఖాళీ అవుతుంది. పూర్తిగా సాగర్‌లో లభ్యత జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది.
సాగర్ నీటిపై ఊగిసలాట
సాగర్‌లో 522.7 అడుగుల వద్ద 154.25 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీళ్లు 22.58 టీఎంసీలు మాత్రమే. ఇరు రాష్ట్రాలు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటి అవసరాల కోసం 15 వేల క్యూసెక్కుల మేర నీటిని తీసుకుంటున్నాయి. ఇదిలాగే కొనసాగితే నెలాఖరు నాటికి సాగర్‌లో నీటి నిల్వలు కనీస మట్టాలకు చేరడం ఖాయం. సాగర్‌ఎడమ కాల్వ కింద జోన్–1, జోన్–2కు సంబంధించి ఈ నెలలో మరో 10 టీఎంసీలు, ఏప్రిల్‌లో ఆరు టీఎంసీల వరకు సాగునీటి అవసరాలు ఉంటాయని అంచనా. సాగర్‌లో నీటిమట్టం కనీసం 515 అడుగుల వరౖMðనా లేకుంటే నీటి విడుదలలో సాంకేతిక ఇబ్బందులు తప్పవు. హైదరాబాద్, నల్లగొండ జిల్లాల తాగునీటి అవసరాలు తీరాలంటే కనీసం 510 అడుగుల నీటిమట్టం తప్పనిసరి. దీంతో మే నెలాఖరు వరకు సాగర్‌లో కనీస నీటి మట్టాలు ఉండేలా చూడాలని తెలంగాణ పట్టుబడుతోంది. కానీ, ఏపీ, కృష్ణా బోర్డు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కరంగా మారింది.
కనీస మట్టాలకు దిగువన నీటిపై కన్ను
సాగర్‌లో ఉన్న నీటినే ఆగస్టు నెలాఖరు వరకు సర్దుకోవాల్సిన పరిస్థితుల్లో.. కనీస నీటి మట్టాల కంటే దిగువకు వెళ్లి నీటిని తోడుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కనీసమట్టాలకు దిగువన 500 అడుగుల వరకు నీటిని తీసుకునేందుకు బోర్డుపై ఏపీ ఒత్తిడి తెస్తోంది. 510 అడుగుల నుంచి 500 అడుగుల మధ్య 16.36 టీఎంసీల నీటిలభ్యత ఉంటుందని, 510 అడుగుల ఎగువన ఉన్న లభ్యత జలాలు 22.58 టీఎంసీలు కలిపితే మొత్తం 38.94 టీఎంసీలతో ఇరు రాష్ట్రాల అవసరాలు తీరుతాయని చెబుతోంది. దీనిపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి అభ్యంతరం తెలుపుతూ ఇటీవల బోర్డుకు లేఖ రాశారు. మే నెలాఖరు వరకు 510 అడుగుల మట్టం కన్నా దిగువకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. అయితే, బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ముందున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బోర్డు నిర్ణ యం తీసుకోవాల్సి ఉంటుందని నీటి పారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment