హే.. కృష్ణా! | Mudodasa slowing things | Sakshi
Sakshi News home page

హే.. కృష్ణా!

Published Tue, Oct 1 2013 4:58 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Mudodasa slowing things

సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ పనులు నత్తనడకన సా..గుతూ ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు, అధికారుల మాటలు కోటలు దాటుతున్నా.. పనుల్లో పురోగతి కానరావడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి హామీ మేరకు వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ప్రాజెక్టును పూర్తిచేసే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు. ఈ పరిస్థితితో ఆయన హామీ నీటిమూటగానే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రాజెక్టులో కీలకమైన రింగ్‌మెయిన్-1, 2 పనులు ఇప్పటికీ మొదలుకాకపోవడం గమనార్హం.  పనులు దక్కించుకున్న ఏజెన్సీలు అసలు పనులు పక్కకు పెట్టి పైపుల తయారీ పైనే దృష్టిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు పైపుల మందం ప్రమాణాల ప్రకారం లేదని, వాటి నాణ్యత, మన్నికపైనా నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు దండుకునేందుకే ఆయా సంస్థలు పైపుల తయారీలో వేగం పెంచాయని ఆక్షేపిస్తుండడం గమనార్హం.
 
మందగమనంలో పనులు

 మూడోదశలో భాగంగా నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి నగర శివారులోని సాహెబ్‌నగర్ వరకు 107.5 కిలోమీటర్లు, ఆ తరువాత నగరంలో 66 కిలోమీటర్ల మేర నీటిని సరఫరా చేసే రింగ్‌మెయిన్ పనులు కలిపి మొత్తంగా 173.5 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు పూర్తిచేయాలి. గత ఆరునెలలుగా అన్ని ప్యాకేజీల్లో కలిపి 12.5 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు పూర్తికావడం పనుల మందగమనానికి అద్దంపడుతోంది. ఇక కోదండాపూర్, నాసర్లపల్లి, గోడకండ్ల, గున్‌గల్ వద్ద నీటి శుద్ధి కేంద్రాల పనులు ఇటీవలే మొదలయ్యాయి. ప్రహరీ, పిల్లర్ల నిర్మాణం పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవడం గుడ్డిలో మెల్ల. ఇక కోదండాపూర్, నాసర్లపల్లి, గున్‌గల్ వద్ద పంప్‌హౌస్‌ల నిర్మాణపు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.
 
అధికారుల వివరణ ఇదీ..

 వచ్చే ఏడాది జనవరి నాటికి కోదండాపూర్ వరకు 107.5 కిలోమీటర్ల మేర ప్రధాన పైప్‌లైన్ పనులు పూర్తిచేస్తామని జలమండలి ప్రాజెక్టు విభాగం అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో ప్యాకేజీలో ఆరు భారీ యంత్రాలు, కార్మికులు, నిపుణులున్న నాలుగు బృందాలు పనులు చేపడుతున్నాయని వివరించారు. ఆ తరువాత రింగ్‌మెయిన్, పంప్‌హౌస్ పనులు పూర్తిచేస్తామని సాక్షికి తెలిపారు.
 
పైపుల నాణ్యతపై అనుమానాలెన్నో?

 పైపులు వేయాల్సిన పనులను పక్కకుబెట్టి పైపుల తయారీపైనే ఏజెన్సీలు దృష్టి సారించడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు పైపుల మందం తగ్గిందని నిపుణులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మందం తగ్గడంతో దీర్ఘకాలంలో వీటి నాణ్యత, మన్నిక ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పైపుల నాణ్యతపై విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో సమ గ్ర దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. కాగా ఇప్పటివరకు 65 కిలోమీటర్ల మేర పైపులను తయారు చేశామని బిల్లులు దండుకునేందుకు పనులు చేపట్టిన సంస్థలు ఆరాటపడుతున్నాయి. కానీ పైపులు వేసింది(లేయింగ్) 12.5 కిలోమీటర్లే కావడం గమనార్హం. పైపుల తయారీపై ఉంచిన శ్రద్ధ వాటిని వేయడం(లేయింగ్)లోనూ చూపాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement