సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో సాంకేతికతలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని కామన్వెల్త్ మీడియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.
న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. కానీ, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం న్యాయ వ్యవస్థకు సవాల్‌గా మారిందన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమన్నారు. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలి. దీనివల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అందుకు కృషి చేస్తోన్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ నిర్వాహకులను రేవంత్‌రెడ్డి అభినందించారు. మీడియేషన్, ఆర్బిట్రేషన్‌ను సమన్వయం చేస్తే సమస్యలు, వివాదాలను వీలైనంత వేగంగా పరిష్కరించొచ్చన్నారు.
ఐఏఎంసీ తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు.. దేశం మొత్తానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ఐఏఎంసీని గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కు, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే పరిమితం చేయొద్దన్న రేవంత్.. కామన్ మ్యాన్‌కు, చిన్న సంస్థలకు కూడా ఐఏఎంసీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్‌లో హైదరాబాద్ ఉండటం గర్వకారణం. ఆర్బిట్రేషన్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై మరో సదస్సు నిర్వహించాలని కోరుతున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment