CSAT
-
‘కామన్వెల్త్’ పదవికి జస్టిస్ సిక్రి నో
న్యూఢిల్లీ: లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్(సీశాట్) అధ్యక్షుడు/సభ్యుడిగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఏకే సిక్రి పేరును కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఆ పదవి చేపట్టేందుకు ఆయన తిరస్కరించారు. ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను తొలగించిన హైపవర్డ్ కమిటీలో జస్టిస్ సిక్రి కూడా సభ్యుడే అన్న సంగతి తెలిసిందే. వర్మపై వేటుకు సిక్రి మద్దతుపలకడం, ఆ తరువాత వచ్చిన విమర్శలతో ఆయన కలతచెందినట్లు తెలుస్తోంది. ఈ పదవిని వద్దనుకుంటున్నానని, తన పేరును ఇకపై పరిగణించొద్దని కోరుతూ ఆయన కేంద్రానికి లేఖ పంపారు. సీశాట్ పదవికి జస్టిస్ సిక్రి పేరును కేంద్రం గత నెలలోనే నామినేట్ చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ సీశాట్‌కు వర్తమానం పంపింది. మార్చి 6న రిటైర్ అయిన తరువాత ఆయన ఈ పదవి చేపట్టాల్సి ఉంది. తొలుత ఈ ఆఫర్‌కు అంగీకరించిన జస్టిస్ సిక్రి..సీబీఐ పరిణామాల నేపథ్యంలో మనసు మార్చుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ‘కామన్వెల్త్ పదవిని ఆఫర్ చేస్తూ ప్రభుత్వం గత నెలలోనే జస్టిస్ సిక్రిని సంప్రదించింది. దీనికి ఆయన అంగీకరించారు. ఎలాంటి జీతభత్యాలు లేని ఈ పదవిలో భాగంగా ఏడాదికి రెండు, మూడు విచారణలకు హాజరుకావాల్సి ఉంది’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జస్టిస్ సిక్రిని సీశాట్ పదవికి నామినేట్ చేయడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ డిమాండ్ చేశారు. భయంతోనే ప్రధాని మోదీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. న్యాయ ప్రక్రియలో ఇతరులు వేలుపెడితే, అరాచకం రాజ్యమేలుతుందని ట్వీట్ చేశారు. కామన్వెల్త్ కూటమిలోని 53 దేశాల మధ్య తలెత్తే వివాదాల్ని పరిష్కరించే అత్యున్నత మధ్యవర్తి సంస్థే సీశాట్. 1965లో ఈ సంస్థ ప్రారంభమైంది. -
క్వాలిఫైయింగ్ పేపర్‌గా సీశాట్
సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్ష ప్రిలిమ్స్‌లో రెండో పేపర్ అయిన సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్టు (సీశాట్)ను క్వాలిఫైయింగ్ పేపర్‌గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. సీశాట్‌ను రద్దుచేయాలని, దీనివల్ల తమకు అవకాశాలు దెబ్బతింటున్నాయంటూ వివిధ రాష్ట్రాల ప్రాంతీయ, ఆర్ట్స్ సైన్స్ అభ్యర్థులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సీశాట్‌లో గణితం, ఆంగ్లం, డెసిషన్ మేకింగ్ అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు అడుగుతుండడం, వాటిలో వచ్చిన మార్కుల్ని పరిగణనలోకి తీసుకొని మెయిన్స్‌కు ఎంపిక చేయడం వల్ల ఆ సబ్జెక్టుల్లో ప్రావీణ్యమున్నవారే లబ్ధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు, హ్యుమానిటీ సబ్జెక్టుల్నిబట్టి పరీక్షలు రాసే వారు నష్టపోతున్నారు. మొదటి పేపర్లో ఎక్కువ మార్కులొచ్చినా రెండో పేపర్ అయిన సీశాట్‌లో ఐఐటీ, ఐఐఎం తదితర అభ్యర్థులకంటే తక్కువ మార్కులొస్తుండడంతో మెయిన్స్‌కు అర్హత కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సీశాట్‌ను కంపల్సరీ అని కాకుండా క్వాలిఫైయింగ్ పేపర్‌గా కేంద్రం మార్చింది. ఈ పేపర్లో 33 శాతం మార్కుల్ని క్వాలిఫైయిం గ్‌కు నిర్దేశించారు. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సీశాట్ వల్ల ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులకు కలుగుతున్న నష్టాన్ని నివారించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన కృషి ఫలించింది. ఆర్ట్స్, సైన్స్ తదితర విభాగాల విద్యార్థులలతోపాటు వివిధ ప్రాంతీయ భాషా విద్యార్థులకు నష్టం వాటిల్లుతున్న విషయాన్ని ఆ పార్టీ ఎంపీ అవినాశ్‌రెడ్డి తదితరులు ప్రధాని మోదీ దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. -
సీశాట్ పై అభిప్రాయాలు తెలపండి: కేంద్రం
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) ప్రవేశపెట్టిన సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీశాట్) పై అభిప్రాయాలు తెలపాలని అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. రెండు వారాల్లోగా అభిప్రాయాలు వెల్లడించాలని ఆదివారం విజ్ఞప్తి చేసింది. సీశాట్ పై అన్ని కోణాల్లో సమీక్ష జరుపుతామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. పార్లమెంట్ లో ఆదివారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ విషయం చెప్పారు. యూపీఎస్సీ ప్రవేశపెట్టిన సీశాట్ వల్ల ప్రాంతీయ భాషల్లో సివిల్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
అసమానతలకు ‘సీశాట్’ ఆజ్యం
సీశాట్ వ్యతిరేక ఆందోళన ల నేపథ్యంలోనే ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కావడంతో ఇప్పుడు కలుగచేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించినా, సమస్యలో ఉన్న ప్రతికూలాంశాలు విస్మరించలేనివి. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) గురించి పెద్ద రగడే జరుగు తోంది. ఇప్పుడు నిర్వహిస్తున్న సీశాట్‌ను తొలగించవలసిందని ఢిల్లీలో నిరస నలు జరుగుతున్నాయి. నిరసనకారులను ప్రతిభాస్వామ్యానికి వ్యతిరేకు లుగా చిత్రిస్తున్నారు. ప్రాంతీయ భాషలలో చదువుకున్న వారికి కూడా ఆంగ్ల భాషా మాధ్యమం నుంచి వచ్చిన విద్యార్థులతో సమంగా ప్రాధాన్యం ఇవ్వా లంటూ రాజ్యాంగం కల్పించిన హక్కును అమలు చేయమని కోరుతున్నం దుకే ఇలా విమర్శలు కురిపిస్తున్నారన్న మాట వాస్తవం. సీశాట్‌ను తొలగించ మని కోరే వారంతా ఆంగ్ల భాషకు శత్రువులైనట్టు, సొంత భాష మీద విపరీత ప్రేమను చూపిస్తున్న చాందసులన్నట్టు వ్యాఖ్యానాలు చేస్తు న్నారు. ప్రాంతీయ భాషలలో కూడా ప్రశ్న పత్రం అందించాలని కోరడమే నేరంగా పేర్కొంటున్నారు. మౌఖిక పరీక్షలో ప్రాంతీయ మాధ్య మాల నుంచి వచ్చిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్న సంగతి చెబితే, ఇంగ్లిష్ మాట్లాడేవారే సివిల్ సర్వెంట్‌గా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తా రని వింత వాదన వినిపిస్తున్నారు. సేవాగుణానికీ, పాలనా సామర్థ్యానికి భాషతో సంబంధం లేదన్న వాదనలను పెడచెవిన పెడుతున్నారు. నిజంగానే సీశాట్‌ను వ్యతిరేకిస్తున్న వారంతా ప్రతిభాస్వామ్యానికి బద్ధ శత్రువులేనా? యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక మాత్రమే ప్రతిభాస్వామ్యానికి కొలమానమా? ఇప్పుడు నిర్వహిస్తున్నది నిజంగానే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్టేనా? సీశాట్ పరీక్ష అనంతరం తలెత్తిన పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. సీశాట్ ఎందుకు వచ్చింది? యూపీఎస్సీ దృష్టిలో సివిల్ సర్వీసెస్ పట్ల అభ్యర్థి అభిరుచికి కొలమానం ఏమిటి? లాజికల్ రీజనింగ్, సమస్య పరిష్కారంలో నైపుణ్యం, విశ్లేషణా సామర్థ్యం, మౌఖిక భావ ప్రకటనా నైపుణ్యం, ప్రాథమిక స్థాయి గణితం, జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ - అని యూపీఎస్సీ సిలబస్‌ను బట్టి తెలు స్తుంది. ఈ అంశాలలో వెనుకబడిన వారు సివిల్ సర్వీసెస్‌కు అనర్హులని యూపీఎస్సీ నిర్ధారిస్తున్నది. యూపీఎస్సీ 2011లో సీశాట్‌ను ప్రవేశపెట్టిన పుడు అంతా పురోగమన చర్యగా భావించారు. 2010 సంవత్సరం వరకు అభ్యర్థులు అనేక ఐచ్ఛికాంశాల నుంచి ఒకదానిని ఎంచుకునేవారు. అయితే అన్ని ఐచ్ఛికాంశాల ప్రశ్నపత్రాలను ఒకే స్థాయిలో రూపొందించడం అసాధ్యం కావడం, ఐచ్ఛికాంశాల నుంచి ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉండడం, ఆ జాబితాలో రెండు మూడు ఐచ్ఛికాంశాలను ఎంచుకున్న వారే అధికంగా కృతార్థులు కావడం వంటి సమస్యలను తరు వాత గమనించారు. సమాచార హక్కు చట్టం పుణ్యమా అని స్కేలింగ్ విధా నం మీద కూడా అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ ఐచ్ఛికాంశం స్థానంలో అభ్యర్థుల ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే ఉమ్మడి పరీక్షను ప్రవేశపెట్టింది. అదే సీశాట్. ఐచ్ఛికాంశాలను తొలగించడం వల్ల సమతౌల్యం సాధించే అవకాశం ఉందని అప్పుడు అభ్యర్థులంతా భావించారు. శాపంగా మారిన పరీక్ష అయితే సీశాట్‌తో అనుభవాలు వేరుగా ఉన్నాయి. భాషాపరంగా వివిధ రకాల చదువుల నేపథ్యాల నడుమ 1979 నుంచి కాపాడుకుంటూ వచ్చిన తటస్థ వైఖరిని నాశనం చేసే విధంగా సీశాట్ రూపు దాల్చింది. యూపీఎస్ సీయే సీశాట్ విశ్వసనీయతను దెబ్బతీసింది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను ప్రవేశపె ట్టడం వెనుక ఉన్న హేతువును బలహీనపరిచింది. సివిల్ సర్వీసెస్ పట్ల అభి రుచితో పాటు, సరైన దృక్పథం ఉన్నవారు కూడా వైదొలగే రీతిలో ప్రశ్నలను రూపొందించడం శోచనీయం. సీశాట్ వ్యతిరేక ఆందోళన ల నేపథ్యంలోనే ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కావడంతో ఇప్పుడు కలుగచేసుకోలేమని అత్యున్నత న్యాయ స్థానం ప్రకటించినా, సమస్యలో ఉన్న ప్రతికూలాంశాలు విస్మరించలేనివి. ప్రాంతీయ భాషల మీద వేటు ఆంగ్ల ప్రసార మాధ్యమాలు కోడై కూస్తున్నట్టు సీశాట్ మీద నిరసన అంటే సాధారణ ఇంగ్లిష్ మీద పోరాటం కాదని అంతా అర్థం చేసుకోవాలి. సీశాట్ ను వ్యతిరేకిస్తున్నవారంతా ఇంగ్లిష్‌లో రాయగల కనీస పరిజ్ఞానం ఉన్నవారే. మెయిన్స్‌లో ఉండే తప్పనిసరి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్ని సమర్థంగా ఎదుర్కొనగ లిగినవారే కూడా. అసలు ఈ కారణంతోనే ఇలాంటి వారిని ప్రాథమిక పరీ క్షలో గట్టెక్కనీయకుండా తప్పిస్తున్నారు. ఇతర విభాగాలలో మంచి పట్టు ఉన్న అభ్యర్థులు కూడా కాంప్రహెన్షన్‌లో తక్కువ మార్కులు సాధించడం వల్ల అపజయం పాలవుతున్నారు. సీశాట్‌లో ఇచ్చే ప్రశ్నలు, అభ్యర్థికి సివిల్ సర్వీసెస్ పట్ల ఉన్న అభిరుచి ఏపాటిదో వెల్లడించేందుకు ఉపకరించేవి కా కుండా, ఇంగ్లిష్ పరిజ్ఞానం ఎంత అన్నది తేల్చడానికే సరిపోతాయన్న రీతిలో ఉంటున్నాయి. జనరల్ స్టడీస్ తక్కువ మార్కులు తెచ్చుకునేలా రూపొం దిస్తూ ఉంటే, సీశాట్ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అనువుగా రూపొం దుతోంది. సీశాట్‌లో అర్హత సాధించిన వారి మార్కులను పరిశీలిస్తే, మూడింట రెండువంతులు ఇందులోనే సాధిస్తున్నారు. జనరల్ స్టడీస్‌లో తెచ్చుకుంటున్న మార్కులు కేవలం మూడింట ఒక వంతు. 2010లో హిందీతో పాటు, ఇతర ప్రాంతీయ భాషలను మెయిన్స్‌లో రాత పరీక్ష మాధ్యమంగా ఎంచుకుని రాసిన అభ్యర్థులు 4,156 మంది. సీశాట్ ప్రవేశ పెట్టిన 2011లో ఆంగ్లేతర భాషలలో పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 1,682. కటాఫ్‌ను తగ్గించిన ఆప్టిట్యూడ్ ఇంతకీ ఇంత ‘ఆప్టిట్యూడ్’ ఉన్న అభ్యర్థులు మెయిన్స్‌లో చూపించిన ప్రతిభ ఎంతటిది? సీశాట్‌ను ప్రవేశ పెట్టాక మెయిన్స్‌లో కటాఫ్ మార్కును దారు ణంగా దించవలసి వచ్చింది. ఉదాహరణకు 2014లో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1750 మార్కులకు గాను, కనిష్టంగా 564 (32 శాతం) మార్కులు మాత్రమే సాధించారు. 2014 ‘టాపర్’ జనరల్ స్టడీస్‌లో సాధించిన మార్కులు కేవలం 33.8 శాతం. సీశాట్ ప్రవేశపెట్టక ముందు టాపర్లుగా నిలిచిన నాగరాజన్, అద్దంకి శ్రీధర్‌బాబు వంటి వారు జనరల్ స్టడీస్‌లో 70 శాతం మార్కులు సాధించారు. సివిల్ సర్వీసెస్‌కు కీలక మైన జనరల్ స్టడీస్‌లో ప్రతిభ లేని వారు ఇప్పుడు టాపర్లుగా నిలుస్తున్నా రంటే అందుకు కారణం, ఇంగ్లిష్, గణితాలేనని చెప్పకతప్పదు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులలో ఎక్కువ శాతానికి దేశ సమస్యలపై అవగాహన లేదని యూపీఎస్సీ చైర్మన్ డీపీ అగర్వాల్ కొంత కాలం క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశ, సామాజిక సమస్యల కంటె, ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సీశాట్‌ను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఆయనే. సీశాట్ అమలులోకి వచ్చిన తరు వాత వచ్చిన గణనీయమైన మార్పు - విజేతలలో ఇంజనీరింగ్, మెడిసిన్ నేపథ్యం ఉన్న వారి సంఖ్య విశేషంగా పెరిగింది. 2004 సంవత్సరంతో పోల్చి చూస్తే, 2011 సంవత్సరానికి వీరి సంఖ్య రెట్టింపు కనిపిస్తుంది. ఆ చదువుల నేపథ్యంతో ఐఏఎస్‌కు ఎంపికయ్యే వారి సంఖ్య మూడింట రెండు వంతుల వరకు ఉంది. సీశాట్‌తో మారిన యూపీఎస్సీ ఎంపిక తీరు 2004 2011 ఇంజనీరింగ్ 23.40 41.76 మెడిసిన్ 8.39 13.11 సైన్స్ 5.30 4.90 హ్యుమానిటీస్ 16.56 9.21 సీశాట్‌ను ప్రవేశపెట్టడం వెనుక రహస్య ప్రణాళిక ఉంది. డీపీ అగర్వాల్ 2008లో యూపీఎస్సీ బాధ్యతలు స్వీకరించారు. ఐఐటీలో బోధిస్తూ ఈ పద విని చేపట్టిన అగర్వాల్ అన్ని అంశాలను ఇంజనీరింగ్ నేపథ్యంతో ఆలోచిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్, ఐఐఎంల నుంచి సివిల్స్ వైపు అభ్యర్థులను ఆకర్షించే విధంగా పరీక్ష విధానాన్ని మార్చుకుంటూ వచ్చారు. అయితే ఇదంతా ఖన్నా కమిటీ సిఫారసుల మేరకే జరిగాయని ఆయన అంటున్నారు. ఆ కమిటీ అగర్వాల్ సూచనల మేరకే పని చేసింది. ఏ విధంగా చూసినా సీశాట్ గురించి పునరాలోచించవలసిన సమయం వచ్చింది. ప్రేమ విఘ్నేశ్వరరావు. కె. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) -
రాజ్యసభను కుదిపేసిన యూపీఎస్సీ వివాదం
న్యూఢిల్లీ : యూపీఎస్సీ పరీక్షల వివాదం మంగళవారం రాజ్యసభను కుదిపేసింది. ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మార్కులను మెరిట్ జాబితాలో పరిగణనలోకి తీసుకోబోమన్న .... కేంద్రం ప్రకటనతో ప్రతిపక్షాలు శాంతించలేదు. యూపీఎస్సీ తీరు వల్ల ప్రాంతీయ భాషలకు అన్యాయం జరుగుతుందంటూ తెలుగు, తమిళ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీశాట్‌ను రద్దు చేయాల్సిందేనంటూ రాజ్యసభలో పట్టుపట్టారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఛైర్మన్ హామీద్ అన్సారీ కోరినా సభ్యులు శాంతించలేదు. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్ధులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఎంపీలు ఆరోపించారు. కాగా ఎంపీల వ్యవహార శైలిపై అన్సారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సివిల్స్.. ‘ఆంగ్లం’పై ఆందోళన!
టాప్ స్టోరీ: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2ను రద్దు చేయాలంటూ.. కొద్దిరోజులుగా సివిల్స్ అభ్యర్థులు ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం సోమవారం స్పందించింది. ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మార్కులను మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకోబోమని ప్రకటించింది. అయితే అభ్యర్థులు సీశాట్‌ను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు సీశాట్ వివాదం ఏమిటి? దీనిపట్ల అభ్యర్థుల్లో అంత వ్యతిరేకత ఎందుకు? సబ్జెక్టు నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేస్తూనే.. సమాజ సేవకు ధీటైన మార్గంగా నిలుస్తోంది.. సివిల్ సర్వీసెస్ పరీక్ష! ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఉన్నత సర్వీసుల్లో అడుగుపెట్టే సదవకాశాన్ని కల్పిస్తోంది. దీన్ని సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2లో ‘ఇంగ్లిష్’ తమకు అందనీయకుండా చేస్తోందని సివిల్స్ ఔత్సాహి కులు ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల వారు ఆందోళన చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆప్టిట్యూడ్‌పై ఆందోళన సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్.. ఇలా మూడు దశలుంటాయి. 2010 వరకు ప్రిలిమినరీ పరీక్ష విధానం కొఠారి కమిషన్ సిఫార్సులపై ఆధారపడి ఉండేది. గతంలో ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్(150 మార్కులు) పేపర్, ఒక ఆప్షనల్ పేపర్(300 మార్కులు) ఉండేవి. యూపీఎస్సీ ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ ఎస్కే ఖన్నా ఏక సభ్య కమిటీ సిఫార్సుల మేరకు 2011 నుంచి ప్రిలిమ్స్ స్థానంలో సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను ప్రవేశపెట్టారు. అభ్యర్థుల్లో ఎనలిటికల్, రీజనింగ్, ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. ఇందులో రెండు పేపర్లు ఒక్కోదానికి 200 మార్కులు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ స్టడీస్ వరకు ఫర్వాలేదుకానీ, రెండో పేపర్ మాత్రం ఇంగ్లిష్ బాగా వచ్చిన వారికి అనుకూలంగా ఉందని హిందీ రాష్ట్రాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల హిందీ, ప్రాంతీయ భాషల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటున్నారు. ‘సివిల్స్-2013 తుది ఫలితాలు గత జూన్‌లో విడుదలయ్యాయి. టాప్ 24 ర్యాంకర్లలో ఏ ఒక్కరూ భారతీయ భాషను ఎంపిక చేసుకోని వారే! హిందీ మాధ్యమం టాపర్‌కు 107 ర్యాంకు వచ్చింది. హిందీ మాధ్యమం అభ్యర్థుల సక్సెస్ రేటు ఇప్పుడు మూడు కంటే దిగువకు చేరుకుంది. సీశాట్ ప్రవేశపెట్టడానికి ముందు ఇది 15 శాతం ఉండేది. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు’’ అంటూ అభ్యర్థులు చెబుతున్నారు. ‘2008లో ఐఏఎస్‌లో చేరిన వారిలో ఇంజనీర్లు 30 శాతం మంది ఉంటే, హ్యుమానిటీస్ నేపథ్యం ఉన్నవారు 30 శాతం ఉన్నారు. సీశాట్ ప్రవేశపెట్టిన తర్వాత ఐఏఎస్‌లో ప్రవేశించిన ఇంజరింగ్ గ్రాడ్యుయేట్లు 50 శాతానికి చేరగా.. హ్యుమానిటీస్ చదివినవారి వాటా 15 శాతానికి పడిపోయింది’ అంటూ తమ వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. ప్రతికూలం - ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు సంబంధించి 8 ప్రశ్నలు (20 మార్కులు) ఉన్నాయి! దీనివల్ల ఇంగ్లిష్ బాగా వచ్చినవారు లాభపడుతున్నారు. తమకు నష్టం వాటిల్లుతోంది. - ప్రశ్నపత్రం (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రశ్నలు మినహా మిగిలినవి) హిందీ అనువాదం ఇస్తున్నా, అది సరిగా ఉండటం లేదు. గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారా అనువ దిస్తున్నారని, ఇది అభ్యర్థుల ను గందరగోళానికి గురిచేస్తోందని ఆరోపిస్తున్నారు. డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్; అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు అర్థం కావడం లేదు. ఈ విభాగాల్లోనూ ఇంగ్లిష్ అభ్యర్థులతోపాటు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు లాభపడుతున్నారు. హ్యుమానిటీస్ నేపథ్యం ఉన్నవారు నష్టపోతున్నారు. - అందరికీ అవకాశాలుండేలా సివిల్స్ ప్రిలిమ్స్‌ను మార్చాలి. ‘ప్రస్తుత వివాదం మాట అటుంచి ప్రిలిమ్స్ పేపర్-2.. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నిరాశాజనకంగా ఉందనే వాదన మొదట్నుంచీ ఉంది’ అంటున్నారు సివిల్స్ శిక్షణలో అపార అనుభవం ఉన్న డాక్టర్ బి.జె.బి.కృపాదానం. అనుకూలం ఉన్నతాధికారులుగా సమాజానికి సేవ చేయబోయే వ్యక్తులకు బుద్ధికుశలత, నిర్ణయాత్మక శక్తి, విశ్లేషణ సామర్థ్యం అవసరం. ‘క్లిష్ట పరిస్థితుల్లో అభ్యర్థి ఎంత త్వరగా సరైన నిర్ణయాలు తీసుకోగలడన్నదాన్ని అంచనా వేసేందుకు సీశాట్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ తదితర విభాగాలకు చెందిన ప్రశ్నలూ ఈ కోవకు చెందుతాయి. ఇలా ఇవ్వడం సబబే. ఇవి ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ అభ్యర్థులకు అనుకూలంగా ఉంటున్నాయన్నది నిజం కాదు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడంలో అభ్యర్థి అకడమిక్ నేపథ్యం ప్రభావం ఉంటుందనుకోవడం లేదు’ అని కొందరు సబ్జెక్టు నిపుణులు, సివిల్స్ ఔత్సాహికులు చెబుతున్నారు. ఇందులోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ పీవో, క్యాట్ తదితర పరీక్షలతో పోలిస్తే సీశాట్‌లో ఇస్తున్న ప్రశ్నలు మరీ అంత కష్టంగా లేవంటున్నారు. పార్లమెంటులోనూ సెగలు అభ్యర్థుల ఆందోళనతోపాటు ఎంపీలు కూడా గళమెత్తడంతో సీశాట్ వివాదంపై గతంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మాజీ కార్యదర్శి అరవింద్ వర్మ నేతృత్వంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 31న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత నిర్ణయం వెలువడింది. కాబట్టి అభ్యర్థులు అనవసర ఆందోళనలకు తావివ్వకుండా తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలని బ్రెయిన్ ట్రీ అకాడెమీ డెరైక్టర్ వి.గోపాలకృష్ణ సూచిస్తున్నారు. ఇంగ్లిష్ నైపుణ్యాలు అవసరమే కదా? ‘ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్‌పై ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటున్నాయి కాబట్టి ఎవరికీ ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో ప్రభుత్వ పరిపాలనలో కీలకంగా వ్యవహరించే అభ్యర్థులకు ఆ మాత్రం ఇంగ్లిష్ నైపుణ్యాలు అవసరమే! దైనందిన విధులకు ఇంగ్లిష్ నైపుణ్యాలు లేకపోవడం అనేది అడ్డంకిగా మారుతుంది. ఇక అనలిటికల్, రీజనింగ్ నైపుణ్యాలు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారికి చాలా ముఖ్యం. వీటిని పరీక్షించేలా ప్రశ్నలు ఇవ్వడం సబబే. కష్టపడి, విశ్లేషణాత్మకంగా ప్రాక్టీస్ చేస్తే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్.. ఇలా ఏ నేపథ్యమున్న వారైనా వీటికి సమాధానాలు గుర్తించగలరన్నది నా అభిప్రాయం. జాతీయస్థాయిలో నిర్వహించే ఇతర పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ఎవరైనా అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి?. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడమంటే అసలు ఇంగ్లిష్ నైపుణ్యాలు లేకుండా చేయాలని కాదు కదా! ప్రపంచీకరణ నేపథ్యంలో సివిల్స్‌లో వచ్చిన మార్పులు ఆవశ్యకం.. అభిలషణీయం. - గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ పరీక్ష నిపుణులు -
సీశాట్ వద్దు
భారీ ఆందోళనకు దిగిన విద్యార్థులు అడ్డుకున్న పోలీసులు యూపీఎస్సీలో సీశాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగి పార్లమెంట్ హౌస్ దిశగా వెళుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు లాఠీచార్జీపై విచారణ జరిపించాలని ఆప్ డిమాండ్ చేసింది. సాక్షి, న్యూఢిల్లీ : యూపీఎస్సీ పరీక్షలో సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను రద్దు డిమాండ్ ఊపందుకుంటోంది. దీనిపై విద్యార్థి లోకం మండిపడుతోంది. కాగా సీసాట్‌ను రద్దు చేస్తామంటూ ప్రభుత్వం ఇటీవల హామీ ఇచ్చింది. అయితే వచ్చే నెల 24వ తేదీన జరగనున్న ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు జారీ కావడంతో తీవ్ర ఆందోళనకు గురైన 500 మంది విద్యార్థులు శుక్రవారం పార్లమెంట్ హౌస్‌కు చేరుకునేందుకు వస్తుండగా ముఖర్జీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా దాదాపు 150 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాగా సీశాట్ పేపర్ వ ల్ల హిందీ భాషలో యూపీఎస్సీ పరీక్ష రాసే హ్యూమనిటీస్ విభాగానికి చెందినవారికి అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంగ్లిషులో రూపొందించిన ప్రశ్నపత్రాన్ని హిందీలో అనువదించడం వల్ల తమకు నష్టం వాటిల్లుతోందనే ప్రధాన ఆరోపణతో విద్యార్థులు సీశాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పోలీసు అధికారి మాట్లాడుతూ 150 మందిని అదుపులోకి తీసుకున్నామని, అవసరమైతే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రయాణికులు ఇక్కట్లపాలు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మెట్రో రైలు ప్రయాణికులు నానాఅగచాట్ల పాలయ్యారు. దాదాపు రెండు గంటలపాటు స్టేషన్లోనే చిక్కుకుపోయారు. ఎల్లో లైన్ మార్గంలోని సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్ మెట్రో స్టేషన్లను సంబంధిత అధికారులు మధ్యాహ్నం 12.45 నుంచి మూడు గంటలవరకూ మూసివేశారు. ఆ తర్వాత వాటిని తిరిగి తెరిచారు. ఇబ్బందికరం సీసాట్ విషయమై కొందరు ఆందోళనకారులు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఫార్మాట్ వల్ల ఆంగ్ల భాషలో ప్రావీణ్యం లేనివారు ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుందన్నారు. తమ బాధలను పార్లమెంట్లో ప్రస్తావించే వారే కరువయ్యారని, అందువల్లనే పార్లమెంట్ హౌస్ దిశగా మార్చ్ నిర్వహించామన్నారు. ఈ అంశానికి సంబంధించి గతంలో తమకు అనేక హామీలు లభించాయని, అయితే జరిగిందేమీ లేదన్నారు. తమకు ఇప్పటికే అడ్మిట్ కార్డులు అందాయని, వచ్చే నెల 24వ తేదీన పరీక్ష జరుగుతుందన్నారు. అందువల్లనే ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.