సీశాట్ వద్దు
భారీ ఆందోళనకు దిగిన విద్యార్థులు అడ్డుకున్న పోలీసులు
యూపీఎస్‌సీలో సీశాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగి పార్లమెంట్ హౌస్ దిశగా వెళుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు లాఠీచార్జీపై విచారణ జరిపించాలని ఆప్ డిమాండ్ చేసింది.
సాక్షి, న్యూఢిల్లీ : యూపీఎస్‌సీ పరీక్షలో సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను రద్దు డిమాండ్ ఊపందుకుంటోంది. దీనిపై విద్యార్థి లోకం మండిపడుతోంది. కాగా సీసాట్‌ను రద్దు చేస్తామంటూ ప్రభుత్వం ఇటీవల హామీ ఇచ్చింది. అయితే వచ్చే నెల 24వ తేదీన జరగనున్న ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు జారీ కావడంతో తీవ్ర ఆందోళనకు గురైన 500 మంది విద్యార్థులు శుక్రవారం పార్లమెంట్ హౌస్‌కు చేరుకునేందుకు వస్తుండగా ముఖర్జీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
అంతేకాకుండా దాదాపు 150 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాగా సీశాట్ పేపర్ వ ల్ల హిందీ భాషలో యూపీఎస్‌సీ పరీక్ష రాసే హ్యూమనిటీస్ విభాగానికి చెందినవారికి అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంగ్లిషులో రూపొందించిన ప్రశ్నపత్రాన్ని హిందీలో అనువదించడం వల్ల తమకు నష్టం వాటిల్లుతోందనే ప్రధాన ఆరోపణతో విద్యార్థులు సీశాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పోలీసు అధికారి మాట్లాడుతూ 150 మందిని అదుపులోకి తీసుకున్నామని, అవసరమైతే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రయాణికులు ఇక్కట్లపాలు
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మెట్రో రైలు ప్రయాణికులు నానాఅగచాట్ల పాలయ్యారు. దాదాపు రెండు గంటలపాటు స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు. ఎల్లో లైన్ మార్గంలోని సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్ మెట్రో స్టేషన్లను సంబంధిత అధికారులు మధ్యాహ్నం 12.45 నుంచి మూడు గంటలవరకూ మూసివేశారు. ఆ తర్వాత వాటిని తిరిగి తెరిచారు.
ఇబ్బందికరం
సీసాట్ విషయమై కొందరు ఆందోళనకారులు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఫార్మాట్ వల్ల ఆంగ్ల భాషలో ప్రావీణ్యం లేనివారు ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుందన్నారు. తమ బాధలను పార్లమెంట్‌లో ప్రస్తావించే వారే కరువయ్యారని, అందువల్లనే పార్లమెంట్ హౌస్ దిశగా మార్చ్ నిర్వహించామన్నారు.
ఈ అంశానికి సంబంధించి గతంలో తమకు అనేక హామీలు లభించాయని, అయితే జరిగిందేమీ లేదన్నారు. తమకు ఇప్పటికే అడ్మిట్ కార్డులు అందాయని, వచ్చే నెల 24వ తేదీన పరీక్ష జరుగుతుందన్నారు. అందువల్లనే ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.