సివిల్స్.. ‘ఆంగ్లం’పై ఆందోళన! | English a tricky subject to afraid of students in Civils services exam | Sakshi
Sakshi News home page

సివిల్స్.. ‘ఆంగ్లం’పై ఆందోళన!

Published Tue, Aug 5 2014 1:51 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

సివిల్స్.. ‘ఆంగ్లం’పై ఆందోళన! - Sakshi

సివిల్స్.. ‘ఆంగ్లం’పై ఆందోళన!

టాప్ స్టోరీ: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2ను రద్దు చేయాలంటూ.. కొద్దిరోజులుగా సివిల్స్ అభ్యర్థులు ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం సోమవారం స్పందించింది. ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మార్కులను మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకోబోమని ప్రకటించింది. అయితే అభ్యర్థులు సీశాట్‌ను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు సీశాట్ వివాదం ఏమిటి? దీనిపట్ల అభ్యర్థుల్లో అంత వ్యతిరేకత ఎందుకు? సబ్జెక్టు నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
 
 అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేస్తూనే.. సమాజ సేవకు ధీటైన మార్గంగా నిలుస్తోంది.. సివిల్ సర్వీసెస్ పరీక్ష! ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ ఉన్నత సర్వీసుల్లో అడుగుపెట్టే సదవకాశాన్ని కల్పిస్తోంది. దీన్ని సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2లో ‘ఇంగ్లిష్’ తమకు అందనీయకుండా చేస్తోందని సివిల్స్ ఔత్సాహి కులు ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల వారు ఆందోళన చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
 
 ఆప్టిట్యూడ్‌పై ఆందోళన
 సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్.. ఇలా మూడు దశలుంటాయి.  2010 వరకు ప్రిలిమినరీ పరీక్ష విధానం కొఠారి కమిషన్ సిఫార్సులపై ఆధారపడి ఉండేది. గతంలో ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్(150 మార్కులు) పేపర్, ఒక ఆప్షనల్ పేపర్(300 మార్కులు) ఉండేవి. యూపీఎస్సీ ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ ఎస్‌కే ఖన్నా ఏక సభ్య కమిటీ సిఫార్సుల మేరకు 2011 నుంచి ప్రిలిమ్స్ స్థానంలో సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను ప్రవేశపెట్టారు. అభ్యర్థుల్లో ఎనలిటికల్, రీజనింగ్, ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు.
 
 ఇందులో రెండు పేపర్లు ఒక్కోదానికి 200 మార్కులు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ స్టడీస్ వరకు ఫర్వాలేదుకానీ, రెండో పేపర్ మాత్రం ఇంగ్లిష్ బాగా వచ్చిన వారికి అనుకూలంగా ఉందని హిందీ రాష్ట్రాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల హిందీ, ప్రాంతీయ భాషల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటున్నారు.
 
 ‘సివిల్స్-2013 తుది ఫలితాలు గత జూన్‌లో విడుదలయ్యాయి. టాప్ 24 ర్యాంకర్లలో ఏ ఒక్కరూ భారతీయ భాషను ఎంపిక చేసుకోని వారే! హిందీ మాధ్యమం టాపర్‌కు 107 ర్యాంకు వచ్చింది. హిందీ మాధ్యమం అభ్యర్థుల సక్సెస్ రేటు ఇప్పుడు మూడు కంటే దిగువకు చేరుకుంది. సీశాట్ ప్రవేశపెట్టడానికి ముందు ఇది 15 శాతం ఉండేది. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు’’ అంటూ అభ్యర్థులు చెబుతున్నారు. ‘2008లో ఐఏఎస్‌లో చేరిన వారిలో ఇంజనీర్లు 30 శాతం మంది ఉంటే, హ్యుమానిటీస్ నేపథ్యం ఉన్నవారు 30 శాతం ఉన్నారు. సీశాట్ ప్రవేశపెట్టిన తర్వాత ఐఏఎస్‌లో ప్రవేశించిన ఇంజరింగ్ గ్రాడ్యుయేట్లు 50 శాతానికి చేరగా.. హ్యుమానిటీస్ చదివినవారి వాటా 15 శాతానికి పడిపోయింది’ అంటూ తమ వాదనను గట్టిగా వినిపిస్తున్నారు.
 
 ప్రతికూలం
 -    ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు సంబంధించి 8 ప్రశ్నలు (20 మార్కులు) ఉన్నాయి! దీనివల్ల ఇంగ్లిష్ బాగా వచ్చినవారు లాభపడుతున్నారు. తమకు నష్టం వాటిల్లుతోంది.
 -   ప్రశ్నపత్రం (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రశ్నలు మినహా మిగిలినవి) హిందీ అనువాదం ఇస్తున్నా, అది సరిగా ఉండటం లేదు. గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారా అనువ దిస్తున్నారని, ఇది అభ్యర్థుల ను గందరగోళానికి గురిచేస్తోందని ఆరోపిస్తున్నారు. డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్; అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు అర్థం కావడం లేదు. ఈ విభాగాల్లోనూ ఇంగ్లిష్ అభ్యర్థులతోపాటు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు లాభపడుతున్నారు. హ్యుమానిటీస్ నేపథ్యం ఉన్నవారు నష్టపోతున్నారు.
 -    అందరికీ అవకాశాలుండేలా సివిల్స్ ప్రిలిమ్స్‌ను మార్చాలి.
 ‘ప్రస్తుత వివాదం మాట అటుంచి ప్రిలిమ్స్ పేపర్-2.. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నిరాశాజనకంగా ఉందనే వాదన మొదట్నుంచీ ఉంది’ అంటున్నారు సివిల్స్ శిక్షణలో అపార అనుభవం ఉన్న డాక్టర్ బి.జె.బి.కృపాదానం.
 
 అనుకూలం
 ఉన్నతాధికారులుగా సమాజానికి సేవ చేయబోయే వ్యక్తులకు బుద్ధికుశలత, నిర్ణయాత్మక శక్తి, విశ్లేషణ సామర్థ్యం అవసరం. ‘క్లిష్ట పరిస్థితుల్లో అభ్యర్థి ఎంత త్వరగా సరైన నిర్ణయాలు తీసుకోగలడన్నదాన్ని అంచనా వేసేందుకు సీశాట్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ తదితర విభాగాలకు చెందిన ప్రశ్నలూ ఈ కోవకు చెందుతాయి. ఇలా ఇవ్వడం సబబే. ఇవి ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు అనుకూలంగా ఉంటున్నాయన్నది నిజం కాదు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడంలో అభ్యర్థి అకడమిక్ నేపథ్యం ప్రభావం ఉంటుందనుకోవడం లేదు’ అని కొందరు సబ్జెక్టు నిపుణులు, సివిల్స్ ఔత్సాహికులు చెబుతున్నారు. ఇందులోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ పీవో, క్యాట్ తదితర పరీక్షలతో పోలిస్తే సీశాట్‌లో ఇస్తున్న ప్రశ్నలు మరీ అంత కష్టంగా లేవంటున్నారు.
 
 పార్లమెంటులోనూ సెగలు
 అభ్యర్థుల ఆందోళనతోపాటు ఎంపీలు కూడా గళమెత్తడంతో సీశాట్ వివాదంపై గతంలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మాజీ కార్యదర్శి అరవింద్ వర్మ నేతృత్వంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 31న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత నిర్ణయం వెలువడింది.   కాబట్టి అభ్యర్థులు అనవసర ఆందోళనలకు తావివ్వకుండా తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలని బ్రెయిన్ ట్రీ అకాడెమీ డెరైక్టర్ వి.గోపాలకృష్ణ సూచిస్తున్నారు.
 
 ఇంగ్లిష్ నైపుణ్యాలు అవసరమే కదా?
 ‘ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్‌పై ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటున్నాయి కాబట్టి ఎవరికీ ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో ప్రభుత్వ పరిపాలనలో కీలకంగా వ్యవహరించే అభ్యర్థులకు ఆ మాత్రం ఇంగ్లిష్ నైపుణ్యాలు అవసరమే! దైనందిన విధులకు ఇంగ్లిష్ నైపుణ్యాలు లేకపోవడం అనేది అడ్డంకిగా మారుతుంది. ఇక  అనలిటికల్, రీజనింగ్ నైపుణ్యాలు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారికి చాలా ముఖ్యం. వీటిని పరీక్షించేలా ప్రశ్నలు ఇవ్వడం సబబే. కష్టపడి, విశ్లేషణాత్మకంగా ప్రాక్టీస్ చేస్తే ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్.. ఇలా ఏ నేపథ్యమున్న వారైనా వీటికి సమాధానాలు గుర్తించగలరన్నది నా అభిప్రాయం. జాతీయస్థాయిలో నిర్వహించే ఇతర పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ఎవరైనా అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి?. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడమంటే అసలు ఇంగ్లిష్ నైపుణ్యాలు లేకుండా చేయాలని కాదు కదా! ప్రపంచీకరణ నేపథ్యంలో సివిల్స్‌లో వచ్చిన మార్పులు ఆవశ్యకం.. అభిలషణీయం.
- గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ పరీక్ష నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement