అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్య | CBI director only on my visiting card, Alok Verma in Supreme Court | Sakshi
Sakshi News home page

అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్య

Published Fri, Dec 7 2018 2:18 AM | Last Updated on Fri, Dec 7 2018 2:18 AM

CBI director only on my visiting card, Alok Verma in Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: అసాధారణ పరిస్థితుల్లోనే అసాధారణ చర్యలు అవసరమవుతాయని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) పేర్కొంది. తనను సెలవులో పంపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ పెట్టుకున్న పిటిషన్‌పై గురువారం వాదనలు ముగియగా సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. సీబీఐ డైరెక్టర్, స్పెషల్‌ డైరెక్టర్‌ల మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నట్లు చెబుతూనే రాత్రికి రాత్రే అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  ‘ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతలతో కూడిన ఎంపిక కమిటీని సంప్రదించకుండా డైరెక్టర్‌ అధికారాలను తొలగించాల్సిన పరిస్థితులు ఏమున్నాయి? ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యా ఉత్తమ ఫలితం సాధించేదిగా, రాజ్యాంగ వ్యవస్థను బలోపేతం చేసేదిగా ఉండాలి’ అని పేర్కొంది. సీబీఐలో విభేదాలకు జూలైలోనే బీజాలు పడ్డాయన్న అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనపై ధర్మాసనం పైవిధంగా స్పందించింది. 

సీవీసీ తరఫున వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. సీబీఐలో సంభవించిన ఆశ్చర్యకర, అసాధారణ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రభుత్వ సూచన మేరకు సీవీసీ విచారణ చేపట్టిందన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ‘అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్తానాలు కేసుల విచారణ మానేసి, ఒకరిపై మరొకరు దర్యాప్తు చేసుకోవడం మొదలుపెట్టినందునే కేంద్రం జోక్యం చేసుకుంది. వారిపై దర్యాప్తు చేపట్టే అధికారం సీవీసీకి ఉంది. అలోక్‌ ఆరోపణలపై విచారణ చేపట్టనట్లయితే, సీవీసీ విధులను నిర్లక్ష్యం చేసినట్లే అవుతుంది. దీనిపై రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు సీవీసీ సమాధానం చెప్పుకోవాల్సి ఉండేది. దర్యాప్తునకు అవసరమైన పత్రాలను సీవీసీకి చాలా రోజుల దాకా అలోక్‌ వర్మ అందివ్వలేదు’ అని తుషార్‌ మెహతా అన్నారు. అలోక్‌ వర్మపై సీవీసీ దర్యాప్తునకు కేంద్రం న్యాయబద్ధమైన ముగింపు ఇవ్వాలని ఆస్తానా తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి అన్నారు. సీబీఐ డైరెక్టర్‌కు రెండేళ్ల పదవీకాలానికి అర్థం అధికారాలు లేని హోదా, విజిటింగ్‌ కార్డు కాదని అలోక్‌ వర్మ తరఫు సీనియర్‌ న్యాయవాది ఫాలి ఎస్‌.నారిమన్‌ వ్యాఖ్యానించారు.

నిర్ణీత పదవీ కాలమైన ఆ రెండేళ్లలో సీబీఐ డైరెక్టర్‌ ఏం చేసినా కేంద్రం, సీవీసీ ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఎక్కడైనా ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ డైరెక్టర్‌పై చర్యలు తీసుకునే అధికారం కేంద్రం, సీవీసీలకు లేదంటూ లాయర్‌ ఫాలి ఎస్‌.నారిమన్‌తోపాటు కామన్‌కాజ్‌ అనే ఎన్‌జీవో తరఫున వాదించిన దుష్యంత్‌ దవే పేర్కొనడంపై స్పందించిన ధర్మాసనం.. ‘రెండేళ్ల పదవీ కాలం ఉన్నంత మాత్రాన సీబీఐ డైరెక్టర్‌ అతీతుడా? ఆయనకు నిబంధనలు వర్తించవా? పార్లమెంట్‌ ఉద్దేశం ఇదేనా అని నిలదీసింది. సీబీఐ అధికారులను బాధ్యతల నుంచి తప్పించడం/సస్పెండ్‌ చేసే అధికారం ప్రభుత్వానికి ఇవ్వరాదని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. ప్రత్యేక పరిస్థితుల్లో సీబీఐ డైరెక్టర్‌ను బదిలీ చేసే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉండాలన్నారు. అలోక్‌వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం వారిని అక్టోబర్‌ 23న సెలవుపై పంపిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement