సాక్షి, న్యూఢిల్లీ : ‘సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిఫార్సు మేరకే ఇరువురు సిబీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. సీబీఐ సంస్థాగత రుజువర్తన, విశ్వసనీయతను పెంచేందుకు ఈ చర్య తీసుకోక తప్పడం లేదు’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేసిన విషయం తెల్సిందే. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు నాటకీయంగా సీబీఐ కార్యాలయంపై దాడిచేసి, తనిఖీలు నిర్వహించడం, సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ డిప్యూటీ రాకేశ్ అస్థానాలను సెలవుపై పంపించే ఉత్తర్వులను సర్వ్ చేయడం తదితర పరిణామాల నేపథ్యంలోనే అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
కేంద్ర విజిలెన్స్ కమిషన్ ప్రస్థావనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇక్కడ తీసుకరావడానికి సందర్భం ఉంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ రాజకీయ సానుకూలత చూపించడమే కాకుండా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ డిప్యూటీ డైరెక్టర్ రాకేశ్ అస్థానా గత ఆగస్టు 24వ తేదీన కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకొనే కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇరువురిని సెలవుపై పంపించాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేసినట్లు అరుణ్ జైట్లీ చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. 1988 అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ డైరెక్టర్‌పై కేసు నమోదైన పక్షంలోనే కేంద్ర విజిలెన్స్ కమిషన్ జోక్యం చేసుకోవాలి. లేనట్లయితే జోక్యం చేసుకోకూడదు. అలోక్ వర్మపై ఎలాంటి అవినీతి కేసు దాఖలు కాలే దు. అలాంటప్పుడు విజిలెన్స్ కమిషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకు జోక్యం చేసుకొంది? అసలు జోక్యం చేసుకుందా? ప్రభుత్వమే విజిలెన్స్ కమిషన్‌ను ఓ సాకుగా వాడుకుందా?
ఇక సీబీఐ డైరెక్టర్ పదవి రెండేళ్లు ఉంటుంది. ఎంతటి తీవ్ర పరిస్థితుల్లో కూడా ఆయన్ని విధుల నుంచి తప్పించడానికి వీల్లేదు. అయినా చర్య తీసుకోవాల్సినంత తీవ్ర పరిస్థితులు ఉత్పన్నం అయితే 2013 నాటి లోక్‌పాల్ చట్టం ప్రకారం ‘సెలక్షన్ కమిటీ’ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. సెలక్షన్ కమిటీలో ప్రధాన మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన సుప్రీం కోర్టు జడ్జీ సభ్యులుగా ఉంటారన్న విషయం తెల్సిందే. ‘సెలక్షక్ కమిటీ’ అనుమతి లేకుండానే సీబీఐ అధికారులపై కేంద్రం చర్యలు తీసుకున్నట్లు ఇక్కడ స్పష్టం అవుతుంది. కేంద్రం ఆదేశాల మేరకు అర్ధరాత్రి సీబీఐ కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు చుట్టుముట్టడం, డైరెక్టర్ ఆఫీసును తనిఖీ చేయడం, ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన డైరెక్టర్ వస్తూ రాగానే పాత డైరెక్టర్ అనుచరులుగా భావించిన 13 మంది అధికారులపై బదిలీ వేటు వేయడం తదితర పరిణామాలు సీబీఐ ప్రతిష్టను నిలబెట్టేవా, మరింత దిగజార్చేవా?
Published Thu, Oct 25 2018 3:32 PM | Last Updated on Thu, Oct 25 2018 3:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment